Begin typing your search above and press return to search.

ట్రెండింగ్... ఇప్పుడు కొడాలి నాని వంతు!

ఈ సమయంలో ఇప్పటికే పలువురు అరెస్ట్ అవ్వగా.. మరికొంతమందికి నోటీసులు పంపించారు పోలీసులు.

By:  Tupaki Desk   |   17 Nov 2024 5:34 AM GMT
ట్రెండింగ్... ఇప్పుడు కొడాలి నాని వంతు!
X

గత ప్రభుత్వ హయాంలో సోషల్ మీడియా వేదికగా అసభ్యకరమైన పోస్టులు, అభ్యంతర కామెంట్లూ చేస్తూ.. జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేసిన వారిపై కూటమి ప్రభుత్వంలోని ఏపీ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఇప్పటికే పలువురు అరెస్ట్ అవ్వగా.. మరికొంతమందికి నోటీసులు పంపించారు పోలీసులు.

ఈ విషయంలో ఆ పార్టీ, ఈ పార్టీ.. ఆ స్థాయి, ఈ స్థాయి అనే తారతమ్యాలు ఏమీ లేవని అంటున్నారు ఏపీ ప్రభుత్వ పెద్దలు. ఏ రాజకీయ పక్షానికి చెందిన నేతలు, వారి కుటుంబ సభ్యులపై జుగుప్సకరమైన వ్యాఖ్యలు చేసినా చర్యలు తప్పవని నొక్కి చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత కొడాలి నానిపై కేసు నమోదైంది.

అవును... ఏపీ మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత కొడాలి నానిపై విశాఖ మూడో పట్టణ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. కొడాలి నాని అధికారంలో ఉన్నప్పుడు మూడేళ్ల పాటు చంద్రబాబు, లోకేష్ లను సోషల్ మీడియా వేదికగా దుర్భాషలాడారనే ఆరోపణలు తీవ్రంగా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఓ స్టూడెంట్ స్పందించారు.

ఇందులో భాగంగా... గతంలో చంద్రబాబు, లోకేష్ లను కొడాలి నాని సోషల్ మీడియాలో దుర్భాషలాడారని.. ఓ మహిళగా ఆ తిట్లు భరించలేకపోయానని చెబుతూ ఆంధ్రా యూనివర్సిటీ లా కాలేజ్ స్టూడెంట్ అంజనప్రియ శనివారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో... విశాఖ త్రీ టౌన్ పోలీసులు కొడాలి నానిపై కేసు నమోదు చేశారు.

కాగా.. 2024 సార్వత్రిక ఎన్నికల్లో కొడాలి నాని ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... సమీప టీడీపీ అభ్యర్థి రాము పై 58వేల పైచిలుకు ఓట్ల తేడాతో కొడాలి నాని ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి ఆయన పూర్తిగా ఇన్ యాక్టివ్ అయిపోయారనే చెప్పాలి. ఇటీవల కాలంలో ఆయన మీడియాలో కనిపించిందీ లేదు!

ఇక.. సోషల్ మీడియా దుర్వినియోగానికి స్వస్థి పలకాలని చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కంకణం కట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా తప్పుడు పోస్టులు పెట్టినవారిపై చర్యలకు ఉపక్రమించారు. ఈ క్రమంలో ఇప్పటికే ఆర్జీవీ, పోసాని, శ్రీరెడ్డి తో పాటు పలువురిపై కేసులు నమోదయ్యాయి.