Begin typing your search above and press return to search.

ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం.. హరీశ్‌రావు పై ఎఫ్ఐఆర్!

ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసు రోజుకో మలుపు తిరుగుతుండగా.. తాజాగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.

By:  Tupaki Desk   |   3 Dec 2024 9:29 AM GMT
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం..  హరీశ్‌రావు పై ఎఫ్ఐఆర్!
X

ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసు రోజుకో మలుపు తిరుగుతుండగా.. తాజాగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో మాజీమంత్రి హరీశ్‌రావుకు తాజాగా నోటీసులు జారీ అయ్యాయి. ఓ కాంగ్రెస్ నేత ఫిర్యాదుతో పోలీసులు హరీశ్‌రావుపై కేసు నమోదు చేశారు.

గత అసెంబ్లీ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీ మరోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా పలువురు ప్రతిపక్షాల నేతలతో పాటు సొంత పార్టీ నేతల ఫోన్లు సైతం ట్యాపింగ్ చేయించినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఎన్నికల సందర్భంలోనూ కాంగ్రెస్ పార్టీ ఇదే అంశంపై పలు ఆరోపణలు చేసింది. ఇక.. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఈ విషయంపై ఫోకస్ పెట్టింది. వెంటనే విచారణ ప్రారంభించింది. దాంతో ఫోన్ ట్యాపింగ్ జరిగిన విషయం వాస్తమేనని వెల్లడైంది.

దీంతో అప్పటి నుంచి ఆ కేసుపై విచారణ జరుగుతుండగా.. ఇప్పటికే పలువురు పోలీసు అధికారులను అదుపులోకి తీసుకున్నారు. ఇంకా వారు జైలులోనే ఉండిపోయారు. అయితే.. ఈ కేసులో ప్రధాన నిందితుడగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఇంకా పోలీసులకు చిక్కడం లేదు. ఫోన్ ట్యాపింగ్ అంశం తెరమీదకు రాగానే ఆయన అమెరికా పారిపోయారు. అప్పటి నుంచి అక్కడే ఉండిపోయారు. అంతేకాకుండా ఈ మధ్యే ఆయన అక్కడి గ్రీన్‌కార్డను సైతం పొందారు. ఇదిలా ఉండగా.. ప్రభాకర్‌రావును ఇండియాకు తీసుకొచ్చేందుకు కేంద్ర, తెలంగాణ పోలీసులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంటర్‌పోల్ సహాయం తీసుకొని రాష్ట్రానికి రప్పించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయనతోపాటు మీడియా సంస్థ అధినేత అయిన శ్రవణ్‌రావు సైతం ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్నారు. ఆయన సైతం విదేశాలకు పారిపోవడంతో.. ఇద్దరిని తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఈ కేసు విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో తాజాగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో భాగంగా మాజీమంత్రి, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత హరీశ్‌రావు మీద కేసు నమోదైంది. సిద్దిపేటకు చెందిన కాంగ్రెస్ నాయకుడు చక్రధర్‌గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయనపై పంజాగుట్ట పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. హరీశ్‌రావుతోపాటే ప్రభాకర్‌రావుపైనా కేసు నమోదు చేశారు. గతేడాది అసెంబ్లీ ఎన్నికల వేళ హరీశ్‌రావు, రాధాకిషన్‌రావు ఆదేశాలతో తన ఫోన్ ట్యాప్ చేశారని చక్రధర్‌గౌడ్ ఫిర్యాదులో పేర్కొన్నారు. తనపై అక్రమంగా కేసులు పెట్టి వేధించారని పేర్కొన్నారు. తన కుటుంబ సభ్యులను సైతం వేధించారని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.