పేర్ని నాని సతీమణిపై కేసు... గోడౌన్ లో టన్నుల బియ్యం మాయం!!
ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు రేషన్ బియ్యం సరఫరాలో అవకతవకలు.. పీడీఎఫ్ బియ్యం విదేశాలకు తరలింపు వంటి అంశాలు హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది.
By: Tupaki Desk | 11 Dec 2024 10:13 AM GMTఏపీ రాజకీయాల్లో ఇప్పుడు రేషన్ బియ్యం సరఫరాలో అవకతవకలు.. పీడీఎఫ్ బియ్యం విదేశాలకు తరలింపు వంటి అంశాలు హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇందులో భాగంగా... వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి పేర్ని జయసుధపై కేసు నమోదైంది.
అవును... పేర్ని నాని సతీమణి జయసుధపై కేసు నమోదైంది. బియ్యం అక్రమాలపై సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ కృష్ణాజిల్లా అసిస్టెంట్ మేనేజర్ కోటిరెడ్డి ఫిర్యాదు మేరకు మచిలీపట్నం పోలీసులు కేసు నమోదు చేసినట్లు చెబుతున్నారు. సుమారు 185 టన్నుల పీడీఎఫ్ బియ్యం మాయమైనట్లు కోటిరెడ్డి గుర్తించారని అంటున్నారు.
గత వైసీపీ ప్రభుత్వంలో మాజీ మంత్రి పేర్ని నాని.. తన సతీమణి జయసుధ పేరిట బందరు మండలం పొట్లపాలెంలో గోడౌన్ నిర్మించి.. దాన్ని సివిల్ సప్లయిస్ కు బఫర్ గోడౌన్ గా అద్దెకు ఇచ్చారని అంటున్నారు. ఈ సమయంలో గత పది రోజుల వార్షిక తనిఖీల్లో భాగంగా ఆ గోడౌన్ ను అధికారులు తనిఖీ చేశారని అంటున్నారు.
ఇలా సివిల్ సప్లయిస్ అధికారులు జరిపిన తనిఖీల్లో సుమారు 185 టన్నుల పీడీఎఫ్ బియ్యం మామైనట్లు తేల్చారని తెలుస్తోంది. దీంతో... పౌరసఫరాల శాఖ అధికారి కోటిరెడ్డి.. పేర్ని జయసుధపై ఫిర్యాదు చేయగా.. కేసు నమోదైనట్లు చెబుతున్నారు. ఇదే సమయంలో ఆ గోడౌన్ మేనేజర్ మానస తేజపై కూడా ఫిర్యాదు చేశారని అంటున్నారు.
ఈ నేపథ్యంలో స్పందించిన పేర్ని జయసుధ... వేబ్రిడ్జి సరిగ్గా పని చేయకపోవడం వల్లే షార్టేజీ వచ్చిందని అధికారులకు లేఖ రాశారని అంటున్నారు. ఈ క్రమంలో వచ్చిన షార్టేజీకి సంబంధించిన విలువ ప్రభుత్వానికి చెల్లిస్తామని లేఖలో పేర్కొన్నారని తెలుస్తోంది. అయితే... ఈ లేఖపై అధికారులు స్పందించాల్సి ఉందని అంటున్నారు!