ట్రెండింగ్: రూ.2,100 కోట్ల లంచం వ్యవహారం... అదానీపై అమెరికాలో కేసు!
ఈ కేసులో గౌతం అదానీతో పాటు మరో ఎనిమిది మందిపై అభియోగాలు మోపబడ్డాయి.
By: Tupaki Desk | 21 Nov 2024 4:12 AM GMTఅదానీ షేర్ హోల్డర్స్ లో తీవ్ర ఆందోళన రేకెత్తించే అంశం తాజాగా తెరపైకి వచ్చింది. భారత్ లోని అత్యంత సంపన్నుల్లో ఒకరైన గౌతం అదానీ లంచం ఇవ్వజూపారని, మోసాలకు పాల్పడ్డారంటూ అమెరికాలోని న్యూయార్క్ లో కేసు నమోదైంది. ఈ కేసులో గౌతం అదానీతో పాటు మరో ఎనిమిది మందిపై అభియోగాలు మోపబడ్డాయి.
అవును... బ్రూక్లిన్ లోని ఫెడరల్ కోర్టులో భారతీయ ఎనర్జీ కంపెనీ ఎగ్జిక్యూటివ్స్ అయిన గౌతం అధానీ, సాగర్ అదానీ లతో పాటు మరో ఏడుగురిపై నేరారోపణలు నమోదు చేయబడ్డాయి. అమెరికాలో నిధుల సమీకరణ కోసం 265 మిలియన్ డాలర్లు (సుమారు రూ.2,100 కోట్లు) లంచంగా ఇవ్వజూపారని అభియోగాలు నమోదయ్యాయి.
ఈ సందర్భంగా... బిలియన్ డాలర్ల విలువైన కాంట్రాక్టులను పొందేందుకు అంతర్జాతీయ పెట్టుబడిదారులు గౌతం అదానీ, సాగర్ అదానీ, వినీత్ జైన్ లు అమెరికాలో నిధుల సేకరణ కోసం భారత ప్రభుత్వ అధికారులకు లంచం ఇవ్వడానికి విస్తృతమైన పథకాన్ని రూపొందించారని యునైటెడ్ స్టేట్స్ అటార్నీ బ్రయోన్ పీస్ పేర్కొన్నారు!
ఇదే సమయంలో... అంతర్జాతీయ మార్కెట్ లో అవినీతిని రూపుమాపడానికి.. తమ దేశ ఆర్థిక మార్కెట్ల సమగ్రతను పణంగా పెట్టి, తమను తాము సుసంపన్నం చేసుకోవడానికి ప్రయత్నించే వారి నుంచి ఇన్వెస్టర్లను రక్షించడానికి తన కార్యాలయం కట్టుబడి ఉందని ఆయన తెలిపారు.
ఇదే సమయంలో... ఈ నేరారోపణల్లో 250 మిలియన్లకు పైగా భారత ప్రభుత్వ అధికారులకు లంచాలు చెల్లించడం.. ఇన్వెస్టర్స్, బ్యాంకులకు అబద్ధాలు చెప్పి బిలియన్ డాలర్లను సమీకరించడం, న్యాయాన్ని అడ్డుకోవడం వంటి పథకాలకు పూనుకున్నారంటూ డిప్యుటీ అసిస్టెంట్ అటార్నీ జనరల్ మిల్లర్ పేర్కొన్నారు.
వచ్చే 20 ఏళ్లలో అదానీ రెన్యూవబుల్ ఎనర్జీ కంపెనీ సుమారు రూ.16,880 కోట్ల కంటే ఎక్కువ లాభాలు ఆర్జించే విధంగా వివిధ కాంట్రాక్టులను దక్కించుకోవడం కోసం లంచం సొమ్ము చెల్లించేందుకు అదానీతో పాటు అతని కంపెనీకి చెందిన పలువురు సీనియర్ ఎగ్జిక్యూటివ్ లు అంగీకరించారని యూఎస్ ప్రాసిక్యూటర్లు ఆరోపించారు.
వాస్తవానికి ఈ లంచాల వ్యవహారంపై విచారణ జరుగుతుందంటూ కొన్ని నెలలుగా వార్తలొస్తున్నాయి! దీనిపై స్పందించిన న్యాయవాదులు... 2022లోనే అమెరికా ఈ కేసు విచారణ ప్రారంభించిందని.. అయితే, విచారణకు అడ్డంకులు సృష్టించారని తెలిపారు. అయితే... ఈ ఆరోపణలపై అదానీ గ్రూపు ఇంకా స్పందించలేదు!
నిందితులుగా చేర్చబడినవారిలో గౌతం అదానీ, ఆయన మేనల్లుడు సాగర్ అదానీతో పాటు అదానీ గ్రీన్ ఎనర్జీకి చెందిన మాజీ సీఇఓ వినీత్ జైన్, రంజిత్ గుప్తా (అజూర్ పవర్ గ్లోబల్ మాజీ ఎగ్జిక్యూటివ్!), రూపేష్ అగర్వాల్ (అజూర్ పవర్ గ్లోబల్ మాజీ సీఈఓ & మాజీ చీఫ్ స్ట్రాటజీ, కమర్షియల్ ఆఫీసర్) లు ఉన్నారు.
వీరితో పాటు సౌరభ్ అగర్వాల్, దీపక్ మల్హోత్రా తో పాటు ఫ్రెంచ్-ఆస్ట్రేలియన్ ద్వంద్వ పౌరసత్వం ఉన్న సిరిల్ క్యాబనిస్ ఉన్నారు. ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ – న్యూయార్క్ కు చెందిన కార్పొరేట్, సెక్యూరిటీస్ అండ్ కమోడిటీస్ ఫ్రాడ్ & ఇంటర్నేషనల్ కరప్షన్ యూనిట్లచే ఈ విచారణ జరిగినట్లు చెబుతున్నారు.
కాగా.. అమెరికా న్యాయ శాఖను పునర్నిర్మిస్తానని ప్రతినబూని డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన కొద్ది వారాల్లోనే ఈ కేసు తెరపైకి రావడం గమనార్హం. మరోపక్క... అమెరికా ఎన్నికల్లో ట్రంప్ గెలవగానే సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపిన అదానీ... యూఎస్ లో 1,000 కోట్ల డాలర్లు పెట్టుబడులు పెట్టనున్నట్లు పేర్కొన్న సంగతి తెలిసిందే!