Begin typing your search above and press return to search.

హరీశ్ పై కేసు.. ఎవరీ చక్రధర్ గౌడ్?

అధికారంలో ఉండగా హరీశ్ తన ఫోన్లను ట్యాప్‌ చేయించారని ఆయన ఆరోపిస్తున్నారు.

By:  Tupaki Desk   |   5 Dec 2024 12:30 PM GMT
హరీశ్ పై కేసు.. ఎవరీ చక్రధర్ గౌడ్?
X

తెలంగాణలో రాజకీయం పెద్ద నాయకులపై కేసుల నమోదు వరకు వెళ్తోంది. బీఆర్ఎస్ కీలక నేత మాజీ మంత్రి హరీశ్ రావుపై హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో సిద్దిపేటకు చెందిన గదగోని చక్రధర్ గౌడ్ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. అధికారంలో ఉండగా హరీశ్ తన ఫోన్లను ట్యాప్‌ చేయించారని ఆయన ఆరోపిస్తున్నారు. స్థిరాస్తి వ్యాపారి, కాంగ్రెస్‌ నాయకుడు కూడా అయిన చక్రధర్‌గౌడ్‌ ఇచ్చిన ఫిర్యాదుతో హరీశ్‌ తో పాటు, విశ్రాంత పోలీసు అధికారి రాధాకిషన్‌ రావుపైనా పంజాగుట్ట ఠాణాలో 120(బీ), 386, 409, 506 ఆర్‌/డబ్ల్యూ 34ఐపీసీ, 66 ఐటీ యాక్ట్‌ ప్రకారం గత ఆదివారం కేసు నమోదైంది.

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక వాస్తవానికి బీఆర్ఎస్ నేతలపై వేర్వేరు అంశాలలో కేసులు నమోదయ్యాయి. అయితే, వారంతా వేర్వేరే స్థాయిల వారు. ఇప్పుడు ఏకంగా హరీశ్ వంటి అత్యంత కీలక నాయకుడిపై కేసు కావడం గమనార్హం. దీనిపై హరీశ్ హైకోర్టుకు సైతం వెళ్లారు. దీంతో పంజాగుట్ట స్టేషన్‌ లో నమోదైన కేసు విషయంలో హరీశ్ ను అరెస్టు చేయొద్దని కోర్టు ఆదేశాలిచ్చింది. పోలీసులు తదుపరి దర్యాప్తు చేపట్టొచ్చని, దీనికి హరీశ్‌ సహకరించాలని కోరింది. ఇక చక్రధర్‌ గౌడ్‌ కూ నోటీసులిచ్చి విచారణను వాయిదా వేసింది.

ఇంతకూ ఎవరీ చక్రధర్ గౌడ్?

గదగోని చక్రధర్ గౌడ్ సిద్దిపేట ప్రాంతానికి చెందినవారు. హరీశ్ నియోజకవర్గం సిద్దిపేట అనే సంగతి తెలిసిందే. ఇక చక్రధర్ గౌడ్ నేపథ్యం కూడా ఆసక్తికరం. రైతులను సేంద్రియ వ్యవసాయం వైపు మళ్లించేలా ఈయన గతంలో ఫార్మర్స్ ఫౌండేషన్ స్థాపించారు. సిద్దిపేట ప్రాంతంలో ఆత్మహత్య చేసుకున్న 150 మంది రైతుల కుటుంబాలకు రూ.లక్ష చొప్పున సాయం చేశారు. దీంతో చక్రధర్ గౌడ్ పేరు మీడియాలో వచ్చింది. కాగా, నిరుడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు చక్రధర్ గౌడ్ పై నకిలీ కాల్ సెంటర్ కేసు నమోదైంది. అయితే, ఇది రాజకీయ కారణాలతో చేసిందేనని ఆయన ఆరోపిస్తున్నారు. సిద్దిపేట ప్రాంతంలో తనకు ఆదరణ దక్కుతుండడంతో హరీశ్ రావే ఈ పని చేయించారని చక్రధర్ గౌడ్ అంటున్నారు.

కాగా, పంజాగుట్టలో హరీశ్ పై చక్రధర్ గౌడ్ చేసిన ఫిర్యాదు ప్రకారం.. ఆయన 2008లో రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రారంభించారు. 2021లో పంజాగుట్టలో ఫార్మర్స్‌ ఫస్ట్‌ ఫౌండేషన్‌ స్థాపించారు. ఇక యువతకు ఉపాధి కోసం అగ్గిపెట్టెల పరిశ్రమ ప్రారంభిస్తే.. అనుమతి లేదని చక్రధర్ గౌడ్ ను హరీశ్ రావు జైలుకు పంపారు. 2023 మార్చిలో బీజేపీలో చేరినా సిద్దిపేట నుంచి టికెట్‌ రాకపోవడంతో బీఎస్పీ నుంచి పోటీ చేశారు. నిరుడు తెలంగాణ ఎన్నికల సమయంలో హరీశ్‌ తన ఫోన్‌ తో పాటు కుటుంబసభ్యులకు చెందిన 20 ఫోన్లను ప్రణీత్‌ రావు సహాయంతో ట్యాప్‌ చేయించారనేది చక్రధర్ గౌడ్ ఆరోపణ.

కాంగ్రెస్ లో చేరికతో..

చక్రధర్ గౌడ్ కాంగ్రెస్ లో చేరినది ఎప్పుడో గానీ.. సిద్దిపేటలో ఆయన కార్యకలాపాల వెనుక రాజకీయ ఆలోచనలు ఉన్నాయని చెబుతారు. కానీ, స్థానిక రాజకీయ పరిస్థితుల రీత్యా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది. ఇక తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండడంతో.. చక్రధర్ గౌడ్ ఫిర్యాదుకు బలం చేకూరినట్లయింది.