టీఎస్ లో తుఫాన్: కేటీఆర్ పై కేసు నమోదు... రేపు అరెస్ట్ చేసే అవకాశం!
అవును... ఫార్ములా-ఈ కార్ రేసు కేసులో మాజీ మంత్రి కేటీఆర్ పై కేసు నమోదైంది. ఈ మేరకు 13(1)ఏ, 13(2) పీసీ యాక్ట్, 409, 120 బీ సెక్షన్స్ కింద ఏసీబీ కేసు నమోదు చేసింది.
By: Tupaki Desk | 19 Dec 2024 11:45 AM GMTతెలంగాణ రాజకీయాల్లో సంచలన పరిణామం చోటు చేసుకుంది. ఇందులో భాగంగా... బీఆరెస్స్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పై కేసు నమోదైంది. ఈ మేరకు ఫార్ములా-ఈకార్ రేసులో జరిగిన అవకతవకలపై తెలంగాణ యాంటీ కరెప్షన్ బ్యూరో (ఏసీబీ) అధికారులు కేసు నమోదు చేశారు. దీంతో.. ఈ విషయం ఒక్కసారిగా తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.
అవును... ఫార్ములా-ఈ కార్ రేసు కేసులో మాజీ మంత్రి కేటీఆర్ పై కేసు నమోదైంది. ఈ మేరకు 13(1)ఏ, 13(2) పీసీ యాక్ట్, 409, 120 బీ సెక్షన్స్ కింద ఏసీబీ కేసు నమోదు చేసింది. ఇవి నాలుగూ నాన్ బెయిలబుల్ సెక్షన్స్ కావడంతో ఈ విషయం మరింత చర్చనీయాంశంగా మారింది. ఇందులో ఏ1 గా కేటీఆర్ ను పేర్కొన్నారు.
ఓ విదేశీ కంపెనీకి 45 కోట్ల రూపాయలు చెల్లించిన హెచ్.ఎం.డీ.ఏ వ్యవహారంలో.. నాడు మున్సిపల్ శాఖ మంత్రి, హెచ్.ఎం.డీ.ఏ. ఛైర్మన్ గా ఉన్న కేటీఆర్ కేసు నమోదైంది. ఇదే సమయంలో.. ఏ2 గా మున్సిపల్ శాఖ అప్పటి ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, ఏ3 గా చీఫ్ ఇంజినీర్ బీ.ఎల్.ఎన్. రెడ్డి ని పేర్కొన్నారు.
ఎలక్షన్ కోడ్ ఉన్న సమయంలో ఈ లావాదేవీలు జరగగా.. నాడు ఈ వ్యవహారం అంతా కేటీఆర్ కనుసన్నల్లోనే జరిగిందనే ఆరోపణలు వినిపించాయి! ఇందులో భాగంగా... నాడు కేటీఆర్ ఆదేశాల మేరకే విదేశీ కంపెనీకి ఇండియన్ కరెన్సీలో డబ్బులు చెల్లించడం.. ఆర్బీఐ నిబంధనలు పాటించకుండా ఈ పనికి పూనుకోవడం.. దీంతో తెలంగాణ ప్రభుత్వానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.8 కోట్లు పెనాల్టీ వేయడం జరిగింది!
ఈ నేపథ్యంలో... వ్యవహారాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుందని అంటున్నారు. నాడు ఆర్బీఐ నిబంధనలు వ్యతిరేకంగా, మరోపక్క కేబినెట్ అప్రూవల్ లేకుండా, ఫైనాన్స్ సెక్రటరీ క్లియరెన్స్ కూడా లేకుండా రూ.45 కోట్లను విదేశీ కంపెనీకి చెల్లించారనేది ప్రధాన అభియోగంగా ఉందని అంటున్నారు.
కాగా.. ఫార్ములా-ఈ కార్ రేసు కేసులో కేటీఆర్ పై కేసు నమోదుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఇటీవల అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో.. ఈ అంశంపై సోమవారం అసెంబ్లీ కమిటీ హాలులో సీఎం రేవంత్ అధ్యక్షతన సమావేశమైన మంత్రిమండలి.. సుమారు నాలుగు గంటలకు పైగా సుదీర్ఘంగా చర్చించింది. అనంతరం గవర్నర్ అనుమతిని ఏసీబీకి పంపింది.
శుక్రవారం అరెస్టు చేసే అవకాశం?:
ఫార్ములా-ఈ కార్ రేసు వ్యవహారంపై కేటీఆర్ ను ఏ1 గా పేర్కొంటూ తెలంగాణ ఏసీబీ కేసు నమోదు చేసింది. ఇందులో పొందుపరిచిన సెక్షన్స్ నాలుగూ నాన్ బెలబుల్ సెక్షన్స్ అని అంటున్నారు. దీంతో... కేటీఆర్ అరెస్టు ఎప్పుడుండొచ్చు అనే చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో... శుక్రవారం కేటీఆర్ ను అరెస్ట్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. దీంతో... ఈ విషయం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర సంచలనంగా మారింది.
నాంపల్లి కోర్టుకు కేటీఆర్ ఎఫ్.ఐ.ఆర్. కాపీ!:
ఫార్ములా-ఈ కార్ రేసు వ్యవహారంపై కేటీఆర్ ను ఏ1 గా పేర్కొంటూ కేసు నమోదు చేసిన నేపథ్యంలో.. ఏసీబీ దూకుడుగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది. కేసు నమోదు చేసిన అనంతరం దానికి సంబంధించిన ఎఫ్.ఐ.ఆర్. కాపీని ఏసీబీ అధికారులు నాంపల్లి కోర్టులో సమర్పించారు. దీంతో... శుక్రవారం అరెస్టు, రిమాండ్ జరిగే అవకాశం ఉందనే ఊహాగాణాలు మొదలయ్యాయని అంటున్నారు!