Begin typing your search above and press return to search.

రిపోర్టు: తెలంగాణ ఎంపీల్లో 14 మందిపై కేసులు

వీరిలో బీజేపీ ఎంపీ.. మల్కాజిగిరి నుంచి ఎన్నికైన ఈటల రాజేందర్ పై అత్యధికంగా 54 కేసులు ఉన్నాయి.

By:  Tupaki Desk   |   9 Jun 2024 6:29 AM GMT
రిపోర్టు: తెలంగాణ ఎంపీల్లో 14 మందిపై కేసులు
X

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలంగాణలో ఎన్నికైన 17 మంది ఎంపీలకు సంబంధించి.. వారి మీద ఉన్న కేసుల పైన ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ఆసక్తికర అంశాల్ని వెల్లడించింది. మొత్తం 17 మంది ఎన్నికైన ఎంపీల్లో 14 మందిపై కేసులు ఉన్నాయి. అంటే.. ఎన్నికైన ఎంపీల్లో 84 శాతం మందిపై కేసులు ఉన్నట్లుగా చెప్పాలి. వీరిలో బీజేపీ ఎంపీ.. మల్కాజిగిరి నుంచి ఎన్నికైన ఈటల రాజేందర్ పై అత్యధికంగా 54 కేసులు ఉన్నాయి.

ఎన్నికల వేళ నామినేషన్ల దాఖలు వేళ అభ్యర్థులు సమర్పించిన అఫిడవిట్లను అధ్యయనం చేయటం ద్వారా ఈ అంశాల్ని వెల్లడించారు. అంతేకాదు.. ఎన్నికల ఫలితాల్ని విశ్లేషించి మరికొన్ని ఆసక్తికర అంశాల్ని సైతం వెల్లడించారు. ఇందులో ముఖ్యమైనవి చూస్తే..

- ఈసారి లోక్ సభా ఎన్నికల్లో తెలంగాణ పరిధిలో ఖమ్మం నియోజకవర్గం నుంచి ఎన్నికైన ఎంపీ రఘరామ్ రెడ్డికి అత్యధికంగా 7,66,929 ఓట్లు పోలయ్యాయి.

- మల్కాజిగిరి నియోజకవర్గంలో నోటాకు 13,366 మంది ఓటేశారు

- ఎన్నికైన ఎంపీల్లో చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అత్యంత సంపన్నుడు.

- అత్యంత తక్కువ ఆస్తులు ఉన్న ఎన్నికైన ఎంపీల్లో బండి సంజయ్ మొదటిస్థానంలో నిలిచారు.

తెలంగాణలో జరిగిన ఎంపీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్.. బీజేపీలు చెరో 8 స్థానాల్లో విజయం సాధించగా.. మజ్లిస్ ఒక స్థానంలో గెలిచింది. తెలంగాణ ఏర్పాటులో కీలకభూమిక పోషించి.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నుంచి నాన్ స్టాప్ గా పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ మాత్రం ఈసారి ఎన్నికల్లో ఒక్క స్థానంలోనూ గెలవకపోవటం గమనార్హం. మరో ఆసక్తికరమైన అంశం ఏమంటే.. తెలంగాణ వాదాన్ని బలంగా వినిపించటం మొదలు పెట్టిన తర్వాత ఎంపీ స్థానాన్ని ఒక్కటి కూడా గెలవకపోవటం ఆదే తొలిసారిగా చెబుతున్నారు.

తెలంగాణలో జరిగిన ఎంపీ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీని సాధించిన ఘనతను నల్గొండ ఎంపీ స్థానం నుంచి పోటీ చేసిన రఘువీర్ రెడ్డికి 5.51 లక్షల మెజార్టీ వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో సాధించిన అత్యధిక మెజార్టీ ఇదే కావటం గమనార్హం. రెండో అత్యధిక మెజార్టీ ఖమ్మం ఎంపీ స్థానానికి పోటీ చేసి విజయం సాధించిన కాంగ్రెస్ అభ్యర్థి రఘురాంరెడ్డి. ఆయన తన ప్రత్యర్థి కంటే 4.56లక్షల ఓట్ల మెజార్టీను సొంతం చేసుకున్నారు.

అదే సమయంలో అతి తక్కువ ఓట్ల తేడాతో విజయం సాధించిన ఎంపీ అభ్యర్థిగా డీకే అరుణ నిలిచారు. మహబూబ్ నగర్ ఎంపీ స్థానం నుంచి పోటీ చేసిన ఆమె కేవలం 4500 ఓట్ల తేడాతో విజయం సాధించారు. గత ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా వ్యవహరించిన కిషన్ రెడ్డి సికింద్రాబాద్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు కానీ.. ఆయన సాధించిన మెజార్టీ 50వేల కంటే తక్కువగా ఉండటం గమనార్హం. ఇక.. హైదరాబాద్ ఎంపీ స్థానంలో తిరుగులేని అధిక్యతను ప్రదర్శించే మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఎక్కువ మెజార్టీ సాధించటం ఆసక్తికరంగా మారింది. కారణం.. బీజేపీ అభ్యర్థి మాధవీలత ఆయనకు తీవ్రమైన పోటీ ఇచ్చినట్లుగా ప్రచారం జరిగింది. కానీ.. మెజార్టీ మాత్రం అసద్ కే దక్కింది.