Begin typing your search above and press return to search.

గీత దాటేస్తున్న రేవంత్ దూకుడు.. పాతబస్తీలో అమిత్ షాపై కేసు!

నువ్వు ఒకటి అంటే నేను రెండు అంటా అన్న తీరు గురించి తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరు కూడా అదే మాదిరి ఉందని చెప్పాలి.

By:  Tupaki Desk   |   4 May 2024 4:00 AM GMT
గీత దాటేస్తున్న రేవంత్ దూకుడు.. పాతబస్తీలో అమిత్ షాపై కేసు!
X

నువ్వు ఒకటి అంటే నేను రెండు అంటా అన్న తీరు గురించి తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరు కూడా అదే మాదిరి ఉందని చెప్పాలి. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో ఎంతటి శక్తివంతమైన ముఖ్యమంత్రి అయినప్పటికీ ప్రధాని మోడీ.. ఆయన నీడలా ఉండే అమిత్ షా జోలికి వెళ్లేందుకు పెద్దగా ఆసక్తి చూపరు. అయితే.. ఆ గీతను చెరిపేసే ప్రయత్నం చేస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

మీరు ఒక కేసు బుక్ చేస్తే తాను ఒక కేసు బుక్ చేస్తానన్న రీతిలో సంకేతాల్ని పంపిన వైనం ఇప్పుడు అందరి చూపు పడేలా చేస్తోంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఫేక్ వీడియో కేసులో కాంగ్రెస్ సోషల్ మీడియా విభాగానికి చెందిన పలువురి మీద కేసు నమోదు కావటంతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ సైతం ఈ కేసును ఎదుర్కొంటున్నారు. ఢిల్లీ పోలీసులు ముఖ్యమంత్రి రేవంత్ కు నోటీసులు జారీ చేయటం తెలిసిందే. ఇదిలా ఉంటే.. తాజాగా హైదరాబాద్ పాతబస్తీ పరిధిలోని మొఘల్ పురా పోలీస్ స్టేషన్ లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా మీద కేసు నమోదైంది.

కాంగ్రెస్ పార్టీ నేత నిరంజన్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మీద పోలీసులు కేసు నమోదు చేయటమే కాదు.. ఎఫ్ఐఆర్ ను సిద్ధం చేసిన వైనం చూసినప్పుడు.. రేవంత్ సామాన్యుడు కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తనపై డీప్ ఫేక్ వీడియో కేసు కత్తి వేలాడుతున్న వేళ.. అంతే స్థాయిలో అమిత్ షా మీద మరో కేసును సిద్ధం చేసిన తీరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కేంద్ర మంత్రి అమిత్ షా మీద కేసు పెట్టేంత ధైర్యం.. ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చగా మారింది.

కేంద్రంతో ఘర్షణకు పోకుండా.. సామరస్యంగా వ్యవహరిస్తున్న రేవంత్..ఇప్పుడు అందుకు భిన్నంగా దూకుడు ప్రదర్శించటంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తొందరపాటు మంచిది కాదని.. అమిత్ షాను టార్గెట్ చేసినట్లుగా చర్యలు ఉండకుంటే బాగేండదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇంతకూ కేంద్ర హోం మంత్రి మీద నమోదైన కేసు ఏమిటి? అన్న విషయంలోకి వెళితే.. మూడు.. నాలుగు రోజుల క్రితం హైదరాబాద్ పాతబస్తీలో అమిత్ షా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించటం తెలిసిందే.

ఈ సందర్భంగా ఎన్నికల కమిషన్ నిబంధనల్ని అమత్ షా ఉల్లంఘించినట్లుగా ఈమొయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. ఎన్నికల నియమావళిని బీజేపీ పట్టించుకోలేదని.. చిన్నారులతో ప్రచారం చేయించారని కంప్లైంట్ చేశారు. రోడ్ షో అనంతరం నిర్వహించిన సభలో.. హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీ లత మాట్లాడే వేళలో.. కొంతమంది చిన్నారుల్ని తన వద్దకు రమ్మంటూ అమిత్ షా సైగ చేశారని.. దీంతో వారు అమిత్ షా వద్దకు వెళ్లారన్నారు. ఈ సమయంలో ఒక చిన్నారి చేతిలో ఉన్న ప్లకార్డులో కమలంపువ్వు గుర్తు ఉందని.. ఇద్దరు చిన్నారుల చేతుల్లో ఆప్ కీ బార్ 400 సీట్స్ అంటూ రాసి ఉండటాన్ని తప్పు పట్టారు. ఇలా ప్రచారం చేయటం ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినట్లుగా పేర్కొన్నారు.

చిన్నారుల్ని ఎన్నికల ప్రచారానికి వినియోగించటం తప్పుగా పేర్కొన్న ఆయన ఫిర్యాదుకు ఎన్నికల సంఘం స్పందించింది. జరిగిన సంఘటనపై విచారణ జరిపించాలంటూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ను ఆదేశించింది.దీంతో హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి స్పందిస్తూ.. సౌత్ జోన్ డీసీపీ స్నేహ మెహ్రాకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో.. శుక్రవారం అమిత్ షాతో పాటు.. మరో నలుగురిపైనా మొఘల్ పురా పోలీసులు కేసు నమోదు చేసి.. ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. ఈ కేసులో ఏ1గా యమాన్ సింగ్.. ఏ2గా హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత.. ఏ3గా అమిత్ షా.. ఏ4గా తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డిపైనా కేసు నమోదు చేశారు. ఈ కేసుతో రేవంత్ అంచనాలకు మించిన రిటార్టు ఇచ్చారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ అంశం రానున్న రోజుల్లో పలు రాజకీయ పరిణామాలకు కారణమవుతుందన్న మాట వినిపిస్తోంది. మరేం జరుగుతుందో చూడాలి.