టపాసులు కాల్చిన వారికి షాక్... 554 మందిపై కేసులు!
అవును... దీపావళికి టపాసులు కాల్చిన వారికి పోలీసులు షాకిచ్చారు. ఇందులో సుమారు 554 మందిపై కేసులు నమోదు చేశారు.
By: Tupaki Desk | 13 Nov 2023 6:32 AM GMTదీపావళి పండగ సందర్భంగా టపాసులు కాల్చడంపై నిన్న మొన్నటివరకూ దేశ వ్యాప్తంగా చర్చ జరిగిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో పిల్లలకంటే పెద్దలే ఎక్కువగా కాలుస్తున్నారని అంటూ సుప్రీంకోర్టు ఈ విషయంపై మరికొన్ని కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో దీపావళికి టపాసులు పేల్చిన వారిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.
అవును... దీపావళికి టపాసులు కాల్చిన వారికి పోలీసులు షాకిచ్చారు. ఇందులో సుమారు 554 మందిపై కేసులు నమోదు చేశారు. సుప్రీంకోర్టు నిర్దేశించిన సమయం కాకుండా... ఇతర సమయాలలో బాణసంచా కాల్చిన వారిపై ఈ చర్యకు ఉపక్రమించారు. వాస్తవానికి ఉదయం 6 - 7, రాత్రి 7 - 8 వరకూ కేవలం రెండు గంటలు మాత్రమే సుప్రీంకోర్టు పర్మిషన్ ఇచ్చిందని పోలీసులు వెల్లడించారు.
కాగా... దీపావళి పండగ సందర్భంగా టపాసులు కాల్చేందుకు చెన్నై పోలీసులు పలు నిబంధనలు విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో దీనికి సంబంధించి సిటీ పోలీసు కమిషనర్ సందీప్ రాయ్ రాథోర్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఇందులో భాగంగా.. సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు పర్యావరణానికి హాని కలిగించని గ్రీన్ క్రాకర్స్ ను మాత్రమే విక్రయించాలని, పేల్చాలని తెలిపారు.
అదే విధంగా... ఉదయం 6 - 7, రాత్రి 7 - 8 గంటల మద్య మాత్రమే కాల్చాలని సుప్రీం ఉత్తర్వులను పాటించాలని సూచించారు. ఇదే సమయంలో నిషేధిత చైనా టపాసులను అమ్మకూడదని, వినియోగించకూడదని హెచ్చరించారు. ఇదే క్రమంలో... సులభంగా మంటలు వ్యాపించే ప్రదేశాల్లోనూ, వాహనాలు నిలిపి ఉన్న చోట్లలోనూ బాణసంచాలు పేల్చరాదని గ్రేటర్ చెన్నై పోలీసులు తెలిపారు.
టపాసులు విక్రయించే దుకాణాల వద్ద పొగతాగకూడదని, పశువులు ఉన్న చోట్ల బాణసంచా పేల్చకూడదని, జన సంచారం ఉండే చోట నిర్లక్ష్యంగా కాల్చకూడని, గుడిసెలున్న ప్రాంతాల్లో రాకెట్లు వంటివి పేల్చకూడదని పోలీసులు పలు సూచనలతో కూడిన హెచ్చరికలు చేశారు. ఇదే సమయంలో పెద్దల సమక్షంలోనే పిల్లలు బాణసంచా పేల్చాలని హితవు పలికారు.
ఈ క్రమంలో ఏవైనా ప్రమాదాలు జరిగితే వెంటనే పోలీసులు 100.. అగ్నిమాపక విభాగం 101కి ఫోన్ చేయాలని సూచించారు. అంబులెన్స్ కోసం 108 సంప్రదించాలని తెలిపారు. ఇదే సమయంలో గతేడాది ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి దుకాణాలను నిర్వహించినందుకు 14 కేసులు, కోర్టు అనుమతి ఇచ్చిన సమయాన్ని మీరి టపాసులు కాల్చినందుకు 241 కేసులు నమోదు చేసి చర్యలు చేపట్టినట్లు వివరించారు. ఈ క్రమంలో ఈ ఏడాది ఏకంగా 554 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.