Begin typing your search above and press return to search.

'ఇండియా' పై కేసు.. ఎవ‌రు.. ఎందుకు పెట్టారు..?

ఢిల్లీకి చెందిన 26 ఏళ్ల డాక్టర్ అవినాష్ మిశ్రా బారాఖంబు పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు

By:  Tupaki Desk   |   20 July 2023 6:14 AM GMT
ఇండియా పై కేసు.. ఎవ‌రు.. ఎందుకు పెట్టారు..?
X

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీకి వ్య‌తిరేకంగా ఆయ‌న‌ను గ‌ద్దె దింపాల‌నే ఏకైక ల‌క్ష్యంతో పావులు క‌దుపుతూ.. కాంగ్రెస్ నేతృత్వం లో చేతులు క‌లిపిన 26 ప్ర‌తిప‌క్ష పార్టీల‌కూ గ‌ట్టి ఎదురు దెబ్బ‌త‌గిలింది. బెంగ‌ళూరు వేదిక‌గా సోమ‌, మంగ‌ళ‌వారాల్లో 26 విప‌క్షాల కూట‌మి ప్ర‌త్యేకంగా భేటీ(2వ‌ది) అయి.. వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో మోడీని గద్దెదింపే కార్య‌క్ర‌మంపై చ‌ర్చించారు.

ఈ క్ర‌మంలోనే వారు ఉమ్మ‌డిగా త‌మ కూట‌మికి ఒక పేరు పెట్టారు. అదే ఇండియా. దీన‌ర్థం.. జాతీయ అభివృద్ధి సమ్మిళిత కూటమి. దీనిని ప్ర‌క‌టించ‌గానే విప‌క్షాల‌కు దాదాపు మేదావి వ‌ర్గాల నుంచి భారీ మ‌ద్ద‌తు ల‌భించింది.

మోడీ కూట‌మి ఎన్‌డీయేకు పోటీగా ఇండియా పెట్టార‌ని.. మాస్‌లోకి బాగా పోతుంద‌ని ఒక చ‌ర్చ సాగింది. అయితే.. ఈ చ‌ర్చ సాగుతున్న క్ర‌మంలోనే అనూహ్యంగా ఈ పేరు పెట్ట‌డాన్ని నిర‌సిస్తూ.. ఢిల్లీకి చెందిన 26 ఏళ్ల డాక్టర్ అవినాష్ మిశ్రా బారాఖంబు పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. "ఇండియా అనేది దేశం పేరు. దీనిని ఎవ‌రూ త‌మ స్వ‌లాభానికి వినియోగించుకునేందుకు వీలు లేదు.

ఇలా చేయ‌డం రాజ్యాంగ విరుద్ధం(వాస్త‌వానికి రాజ్యాంగంలో ఈ పేరులేదు). ఇలా ఇండియా అని పేరు పెట్ట‌డం అక్ర‌మ వినియోగం కింద‌కే వ‌స్తుంది" అని పోలీసుల‌కు ఇచ్చిన లిఖిత పూర్వ‌క ఫిర్యాదులో పేర్కొన్నాడు.

అంతేకాదు.. ఇలా ఇండియా అని పేరు పెట్ట‌డం వ‌ల్ల ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లను మాన‌సికంగా ప్ర‌భావితం చేస్తుంద‌ని కూడా ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఇది ఎన్నిక‌ల నియ‌మావ‌ళికి కూడా విరుద్ధ‌మ‌ని స్ప‌ష్టం చేశాడు. అంతే.. వెనుక ముందు ఆలోచించ‌కుండానే పోలీసులు కేసు న‌మోదు చేసి..ఎఫ్ ఐఆర్ కాపీని కూడా మిశ్రాకు అంద‌జేశారు. 26 రాజకీయ పార్టీలు దేశం పేరును దుర్వినియో గం చేశాయన్న మిశ్రా ఫిర్యాదుతో ఆయా పార్టీల పేర్లు కూడా ఎఫ్ ఐఆర్‌లో పేర్కొన్నారు. రేపో మాపో ఆయా పార్టీల‌కునోటీసులు పంపించ‌నున్నారు.

నితీష్‌కు న‌చ్చ‌లేదట‌!

మ‌రోవైపు.. ఇండియా అన్న పేరుపై 26 విప‌క్షాల్లోనూ కొంద‌రికి న‌చ్చ‌లేద‌ని తెలుస్తోంది. ముఖ్యంగా గ‌త ఏడాదిన్న‌ర కాలం నుంచి మోడీపై నిప్పులు చెరుగుతున్న‌ బిహార్ ముఖ్య‌మంత్రి నితీష్ కుమార్ ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా కూట‌మి కోసం ఎంతో శ్ర‌మించారు. అలాంటి నాయ‌కుడికి ఇప్ప‌డు ఈ పేరు న‌చ్చ‌లేద‌ని ఆయన వ‌ర్గం తెలిపింది. దీంతో ఆయ‌న మీడియా ముందుకు రాలేదు. 'ఇండియా'పై స్పందించ‌నూ లేదు.