Begin typing your search above and press return to search.

సజ్జల రామకృష్ణారెడ్డిపై కేసు నమోదు... తెరపైకి మూడు సెక్షన్లు!

టీడీపీ ఫిర్యాదు మేరకు తాడేపల్లి పోలీసులు 153, 505, 125 సెక్షన్ల కింద కేసు పెట్టారు. దీంతో ఈ వ్యవహారం చర్చనీయాంశం అయ్యింది.

By:  Tupaki Desk   |   31 May 2024 5:28 AM GMT
సజ్జల రామకృష్ణారెడ్డిపై కేసు నమోదు... తెరపైకి మూడు సెక్షన్లు!
X

ఏపీలో సార్వత్రిక ఎన్నికల వేళ వందల సంఖ్యలో కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో తాజాగా వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామృష్ణారెడ్డిపై కేసు నమోదైంది. టీడీపీ ఫిర్యాదు మేరకు తాడేపల్లి పోలీసులు 153, 505, 125 సెక్షన్ల కింద కేసు పెట్టారు. దీంతో ఈ వ్యవహారం చర్చనీయాంశం అయ్యింది. ఈ సందర్భంగా పలు రకాల కామెంట్లు తెరపైకి వస్తున్నాయి.

అవును... వైసీపీ ప్రధాన కార్యదర్శి, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై కేసు నమోదైంది. కౌంటింగ్‌ ఏజెంట్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ టీడీపీ నేతలు దేవినేని ఉమా, గూడపాటి లక్ష్మీనారాయణ ఫిర్యాదు మేరకు ఆయనపై తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు మొదలు పెట్టారు. ఈ సందర్భంగా సజ్జల వ్యాఖ్యలపై రెండు వెర్షన్స్ హల్ చల్ చేస్తున్నాయి.

ఇందులో భాగంగా... వైసీపీ కేంద్ర కార్యాలయంలో కౌంటింగ్‌ ఏజెంట్ల అవగాహన సదస్సులో పాల్గొని సజ్జల మాట్లాడారు. ఈ సందర్భంగా... మన టార్గెట్‌ ఇదీ అని దృష్టిలో పెట్టుకుని... దానికి అవసరమైనవి తెలుసుకోవాలి. అవతలివారు అడ్డం పడకుండా వారిని ఆపేందుకు ఏవేం నిబంధనలు ఉన్నాయో చూసుకోవాలి. మనవి ఒక్క ఓటు కూడా చెల్లనివిగా చేసే పరిస్థితి రాకుండా అడ్డుకునేందుకు ఏం చేయాలో చూసుకోవాలి.. అని అన్నారని అంటున్నారు.

ఇదే సమయంలో... మనకు అనుకూలంగా, అవతలివాళ్ల ఆటలు సాగకుండా రూల్‌ ని ఎలా చూసుకోవాలి? అవసరమైతే దానికోసం ఎంతవరకు ఫైట్‌ చేయాలనేది నేర్చుకుందాం. ఇందులో కౌంటింగ్‌ ఏజెంట్‌ తనవంతు పాత్ర పోషించేలా వారి మెదడులోకి మీరు బాగా ఎక్కించాలి. పొరపాటున ఒకటి మనం వాదించినా పర్లేదు.. కానీ, రూల్‌ కాదేమో అని వెనక్కి తగ్గేవాడైతే ఏజెంట్‌ గా వద్దు అని సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు అనేది టీడీపీ ఫిర్యాదు!

మరోపక్క ఎన్నికల కౌంటింగ్ రోజు ఏజెంట్లకు పలు సూచనలు చేసే క్రమంలో సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యల్ని ఒకవర్గం మీడియా వక్రీకరించిందని వైసీపీ నేతలు చెబుతున్నారు. ప్రత్యర్థి వర్గాన్ని నిలువరించాలంటే అప్రమత్తంగా ఉండాలని ఆయన వ్యాఖ్యానిస్తే... దీన్ని వక్రీకరించి రూల్స్ బ్రేక్ చేయాలని సజ్జల చెప్పినట్టుగా ప్రచారం జరిగిందని.. ఎడిటింగ్ వీడియోలను ఒకవర్గం మీడియా ప్రసారం చేసిందని అంటున్నారు.