Begin typing your search above and press return to search.

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంపై తెలంగాణలో కేసు!

ఈ సమయంలో ఆమె ఎంట్రీని వైసీపీ నేతలు లైట్ తీసుకుంటున్నారు! షర్మిళ ఏపీ కాంగ్రెస్ ఇన్ ఛార్జ్ అయినప్పటికీ వైసీపీకి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని చెబుతున్నారు.

By:  Tupaki Desk   |   9 Jan 2024 4:24 AM GMT
ఆంధ్రప్రదేశ్  డిప్యూటీ సీఎంపై తెలంగాణలో కేసు!
X

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది! ఈ సమయంలో సోనియా గాంధీపై విమర్శలు చేస్తే ఊరుకుంటామా అనే హెచ్చరికలు పంపాలనుకునారో ఏమో కానీ... తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామిపై తెలంగాణ కాంగ్రెస్ నేత హైదరాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. సోనియాగాంధీపై విమర్శలు చేశారనేదే అందుకు కారణం అని తెలుస్తుంది.

అవును... ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామిపై హైదరాబాద్ బేగంబజార్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ నమోదు అయింది! ఇటీవల సోనియా గాంధీపై ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఫిర్యాదు మేరకే కేసు నమోదు అయినట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్లురవి.. ఈ మేరకు ఫిర్యాదు చేశారు!

వివరాళ్లోకి వెళ్తే... ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలోకి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె.. ఏపీ సీఎం వైఎస్ జగన్ సోదరి అయిన వైఎస్ షర్మిల ఎంట్రీ ఇస్తున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో బలంగా నడుస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఆమె ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కండువా కప్పేసుకున్నారు కూడా! దీంతో ఆమెకు ఏపీ కాంగ్రెస్స్ బాధ్యతలు అప్పగించే అవకాశాలున్నాయని అంటున్నారు.

ఈ సమయంలో ఆమె ఎంట్రీని వైసీపీ నేతలు లైట్ తీసుకుంటున్నారు! షర్మిళ ఏపీ కాంగ్రెస్ ఇన్ ఛార్జ్ అయినప్పటికీ వైసీపీకి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని చెబుతున్నారు. మరికొంతమంది నేతలు గతం మరిచిపోయి కాంగ్రెస్ పాటీలో ఎలా చేరతారన్నట్లుగా కాస్త ఘాటుగానే స్పందిస్తున్నారు. ఫ్యామిలీ మొత్తాన్ని నడిరోడ్డుపై కూర్చోబెట్టిన రోజులు మరిచిపోయారా అంటూ గుర్తుచేసే ప్రయత్నం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానికి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ కారణమంటూ నారాయణ స్వామి వ్యాఖ్యలు చేశారని.. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనపై చర్యలు తీసుకోవాలని మల్లు రవి ఫిర్యాదు చేశారని తెలుస్తుంది. ఇందులో భాగంగా వైఎస్ మరణాన్ని సోనియాకు ఆపాదిస్తూ ఆమెపై అసత్య ఆరోపణలు చేశారంటూ నారాయణస్వామిపై కేసు నమోదు చేయాలని మల్లు రవి పోలీసులకు విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా స్పందించిన రవి... ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా పని చేసిన వైఎస్సార్ కు సోనియాగాంధీ అధిక ప్రాధాన్యత ఇచ్చారని అన్నారు. ఆయన హెలికాప్టర్ ప్రమాదం జరిగినప్పుడు స్పెషల్ ఫ్లైట్స్ పంపించి మరీ వెతికించారని పేర్కొన్నారు. వాతావరణం సరిగా లేకపోవడం వల్ల హెలికాప్టర్ ప్రమాదంలో వైఎస్సార్ మరణించారని.. ఈ విషయాన్ని నారాయణస్వామి గ్రహించాలని తెలిపారు.