Begin typing your search above and press return to search.

ఎలాన్ మస్క్‌ పై కేసు... తెరపైకి ఇన్‌ సైడర్ ట్రేడింగ్! /

టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ పై ఆ కంపెనీ వాటాదారుడు ఒకరు తాజాగా దావా వేశారు.

By:  Tupaki Desk   |   1 Jun 2024 6:55 AM GMT
ఎలాన్  మస్క్‌  పై కేసు... తెరపైకి ఇన్‌  సైడర్  ట్రేడింగ్! /
X

టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ పై ఆ కంపెనీ వాటాదారుడు ఒకరు తాజాగా దావా వేశారు. ఇందులో భాగంగా... ఎలాన్ మస్క్ ఇన్ సైడర్ ట్రేడింగ్ కి పాల్పడ్డారనే ప్రధాన అభియోగాన్ని మోపారు! పైగా ఆ వ్యవహారం సుమారు 7.5 బిలియన్ డాలర్లకు సంబంధించింది కావడంతో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. మస్క్ క్రెడిబిలిటీపై మరోసారి చర్చకు తెరలేపింది.

అవును... 2022 చివరిలో ఎలక్ట్రిక్ కార్ల తయారీదారు టెస్లా కు సంబంధించిన సుమారు 7.5 బిలియన్ డాలర్ల షేర్లను విక్రయించినప్పుడు మస్క్ ఇన్‌ సైడర్ ట్రేడింగ్ చేశారని ఆరోపిస్తూ టెస్లా వాటాదారు దావా వేశారు. ఉత్పత్తి, డెలివరీ నంబర్‌ లను నిరుత్సాహపరిచే ముందు మస్క్ ఈ షేర్లను విక్రయించారని చెప్పారు.

ఈ సందర్భంగా సదరు వాటాదారు మైఖేల్ పెర్రీ, డెలావేర్ ఛాన్సరీ కోర్ట్‌ లో దావా వేశారు. ఇలా కోర్టులో దాఖలు చేసిన దావాలో... కంపెనీ నాల్గవ త్రైమాసిక సంఖ్యలను జనవరి 2, 2023న బహిరంగపరచిన తర్వాత టెస్లా షేరు ధర క్షీణించిందని, అయినప్పటికీ మస్క్ మాత్రం సుమారు 3 బిలియన్ డాలర్లను ఇన్‌ సైడర్ ట్రేడింగ్ ద్వారా సంపాదించారని పేర్కొన్నారు!

ఇదే సమయంలో టెస్లాకు ఎలాన్ మస్క్ తన విశ్వసనీయ బాధ్యతలను ఉల్లంఘించాడని వెల్లడించారు. ఈ సందర్భంగా లాభాలను తిరిగి ఇచ్చేలా మస్క్‌ ని ఆదేశించమని కోర్టును కోరారు. ఇదే క్రమంలో... టెస్లా కంపెనీకి సంబంధించిన ఆర్థిక పనితీరు గురించిన స్టాక్ అమ్మకాలు, ప్రకటనలలో మస్క్ చట్టపరమైన బాధ్యతలను పాటించినట్లు నిర్ధారించుకోవడంలో సదరు కంపెనీ డైరెక్టర్లు విఫలమయ్యారని కూడా ఫెరీ ఆరోపించాడు.

తాజా చట్టపరమైన సవాలు మస్క్ ఆర్థిక కార్యకలాపాల చుట్టూ ఉన్న నిరంతర వివాదాలు.. టెస్లా, దాని వాటాదారులపై వాటి ప్రభావాన్ని హైలైట్ చేస్తుందని అంటున్నారు. ఈ కేసు ఫలితం మస్క్, టెస్లాలో పాలనా విధానాలకు ఒకరకంగా ప్రామాణికంగా పరిగణించే అవకాశాలూ లేకపోలేదని చెబుతున్నారు.