కేటీఆర్ పై కేసు.. బీఆర్ఎస్ కు పెద్ద షాక్?
వీటికి తోడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కూడా పెద్ద దుమారం రేపుతోంది. అధికారంలో ఉండగా అందరి ఫోన్లు ట్యాపింగ్ చేసినట్లు గుర్తించారు
By: Tupaki Desk | 29 March 2024 11:23 AM GMTతెలంగాణలో రాజకీయాలు మారుతున్నాయి. గతంలో పదేళ్లు పదవిలో ఉండి పలు నేరాలు చేసిన బీఆర్ఎస్ పార్టీ వ్యవహారం ఇప్పుడు వివాదాస్పదంగా మారుతోంది. అప్పుడు ఎదురే లేకుండా చెలరేగిన నేతలు ప్రస్తుతం అన్ని మూసుకుని ఉండాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. అయినా వారిలో మేకపోతు గాంభీర్యం తగ్గడం లేదు. తాము చేసిందే వేదంగా భావిస్తున్నారు. తాము చేసిన శాసనాలే అసలైనవిగా అభివర్ణిస్తున్నారు. దీంతో బీఆర్ఎస్ నేతల తీరుపై సహజంగానే విమర్శలు వస్తున్నాయి.
బీఆర్ఎస్ హయాంలో చేసిన పనుల్లో అవినీతి, అక్రమాలు, ఎమ్మెల్సీ కవిత అరెస్ట్, సీనియర్ నేతలు కాంగ్రెస్ లోకి క్యూ కట్టడం వంటి చర్యలు మింగుడు పడటం లేదు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి ప్రస్తుతం చర్చనీయాంశంగా మారుతోంది. వారు చేసిన మోసాలపై అన్ని పార్టీలు ముక్తకంఠంతో చర్యలు తీసుకోవాల్సిందేనని పట్టుబట్టడంతో బీఆర్ఎస్ నేతల్లో భయం పట్టుకుంది.
వీటికి తోడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కూడా పెద్ద దుమారం రేపుతోంది. అధికారంలో ఉండగా అందరి ఫోన్లు ట్యాపింగ్ చేసినట్లు గుర్తించారు. దీంతో ఇందులో ప్రమేయం ఉన్న నేతలంతా జైలుకు వెళ్లాల్సిందే అంటున్నారు. పోలీసులను అడ్డం పెట్టుకుని బీఆర్ఎస్ సాగించిన దురాగాతాలకు చెక్ పెట్టే పనిలో భాగంగా వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం ఖాయమే అంటున్నారు.
ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసి తీహార్ జైలుకు తరలించడంతో వారికి కంటి మీద కనుకు లేకుండా చేస్తోంది. బీఆర్ఎస్ నేతలు వరసగా పార్టీని వీడటంతో ఒంటరైపోతున్నామని బెంగ వారిని వేధిస్తోంది. తాజాగా కేటీఆర్ పై మరో కేసు నమోదైంది. రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పీసీసీ సభ్యుడు బత్తిని శ్రీనివాసరావు చేసిన ఆరోపణలప హనుమకొడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేటీఆర్ పై జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయడం సంచలనం కలిగిస్తోంది. కేసును బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు బదిలీ చేస్తామని చెప్పారు.
ఇలా దెబ్బ మీద దెబ్బ పడుతుంటే బీఆర్ఎస్ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది. కాంగ్రెస్ పార్టీ రోజురోజుకు విస్తరిస్తోంది. బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతోంది. కేకే, దానం నాగేందర్, కడియం శ్రీహరి ఇలా ఒక్కొక్కరు పార్టీని వీడి వెళ్తుంటే చివరకు మిగిలేది కేసీఆర్, కేటీఆర్ మాత్రమే మిగులుతారని పలు రకాల సెటైర్లు వస్తున్నాయి. దీంతో వారి భవితవ్యం ఏమిటనేది వారికే తెలియడం లేదు.