ఆయనను వదలని ఆర్‌ఆర్‌ఆర్.. ఆ డీజీకి షాక్!
సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై పోలీసులు కేసు నమోదు చేశారు
By: Tupaki Desk | 12 July 2024 9:22 AM GMTసీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఉండి టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో గుంటూరు నగరంపాలెం పోలీసులు జగన్, సునీల్ కుమార్ పై కేసు నమోదు చేశారు.
ప్రస్తుతం అగ్నిమాపక శాఖ డీజీగా సునీల్ కుమార్ వైసీపీ ప్రభుత్వ
హయాంలో ఆంధ్రప్రదేశ్ సీఐడీ విభాగానికి అధిపతిగా పనిచేశారు. ఈ క్రమంలో నాటి సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు పలువురు టీడీపీ నేతలపై అక్రమ కేసులు నమోదు చేయడం, అర్థరాత్రి పూట ఇళ్లకు వారి గేట్లు దూకి అరెస్టు చేయించడం, వారిని కస్టడీలోకి తీసుకుని థర్డ్ డిగ్రీ ప్రయోగించడం వంటివి చేశారనే అభియోగాలు సునీల్ కుమార్ పై ఉన్నాయి.
వైసీపీ ప్రభుత్వ హయాంలో సీఐడీ డీజీననే విషయం మర్చిపోయి టీడీపీ, జనసేన నేతలపై అక్రమ కేసులు పెట్టడం, వారిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి.. ఆ సమయంలో తీసిన వీడియోలను వైసీపీ ముఖ్య నేతలకు పంపేవారని సునీల్ కుమార్ పై టీడీపీ నేతలు తీవ్ర ఆరోపణలు చేశారు.
ముఖ్యంగా నాడు నర్సాపురం వైసీపీ రెబల్ ఎంపీగా ఉన్న రఘురామకృష్ణరాజు.. జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయనపై సీఐడీ కేసులు నమోదు చేసింది. అంతేకాకుండా ఆయనను అరెస్టు చేసి.. థర్డ్ డిగ్రీ ప్రయోగించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. స్వయంగా రఘురామకృష్ణరాజు.. సీఐడీ డీజీ సునీల్ కుమార్ తనను తీవ్రంగా హింసించారని ఆరోపణలు చేశారు. తనను కొడుతూ తీసిన వీడియోను వైఎస్ జగన్ కు, సజ్జల రామకృష్ణారెడ్డి తదితరులకు పంపారని అప్పట్లో ఆరోపణలు చేశారు.
ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడటంతో రఘురామకృష్ణరాజు.. సునీల్ కుమార్ పై గుంటూరు నగరంపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపై తప్పుడు కేసులు మోపి థర్డ్ డిగ్రీ ప్రయోగించారని పేర్కొన్నారు.
కస్టడీకి తీసుకున్న సమయంలో కొట్టడమే కాకుండా హత్యాయత్నం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాకుండా తప్పుడు నివేదిక ఇవ్వడానికి ఆస్పత్రిలో డాక్టర్లను కూడా మార్చేశారని ఆరోపించారు. వైఎస్ జగన్ ఆదేశాలతోనే ఇది జరిగిందన్నారు. దీంతో నాటి సీఎం జగన్, సీఐడీ డీజీ సునీల్ కుమార్, ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయులు, ఏఎస్పీ విజయ్ పాల్ తోపాటు పలువురిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది.
కాగా ప్రభుత్వాధికారిగా ఉంటూ సునీల్ కుమార్ క్రిస్టియానిటీని వ్యాప్తి చేయడానికి ప్రయత్నిస్తున్నారని, హిందూ మతాన్ని కించపరుస్తూ వ్యాఖ్యలు చేశారని కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదులు కూడా వెళ్లాయి. కేంద్ర హోం శాఖకు సైతం సునీల్ పై పలువురు గతంలో ఫిర్యాదులు చేశారు. ఈ ఆరోపణలపై కేంద్ర హోం శాఖ రాష్ట్ర ప్రభుత్వ వివరణ కూడా కోరింది. అయితే సునీల్ కుమార్ ను గత వైసీపీ ప్రభుత్వం రక్షిస్తూ వచ్చింది.
ఇప్పుడు రఘురామ ఫిర్యాదు నేపథ్యంలో సునీల్ కుమార్ కు చిక్కులు తప్పేలా లేవు. కూటమి ప్రభుత్వం ఆయనపై విచారణకు ఆదేశించే అవకాశాలున్నాయి. అదే జరిగితే ఈ వివాదాస్పద పోలీసు అధికారికి ఇబ్బందులు తప్పవంటున్నారు.