Begin typing your search above and press return to search.

ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసులో నారాయ‌ణ‌ ఫ్యామిలీ & బంధువులపై కేసు!

ఇందులో భాగంగా... తాజాగా మాజీ మంత్రి నారాయ‌ణ సతీమ‌ణి ర‌మాదేవితో పాటు పలువురిపై కేసులు నమోదయాయి.

By:  Tupaki Desk   |   9 Oct 2023 10:39 AM GMT
ఇన్నర్‌  రింగ్‌  రోడ్డు కేసులో నారాయ‌ణ‌ ఫ్యామిలీ & బంధువులపై కేసు!
X

ఒకపక్క అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు, ఏపీ ఫైబర్ నెట్, అంగళ్లు అల్లర్ల కేసుల్లో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లను ఈ రోజు ఏపీ హైకోర్టు కొట్టేసిన సంగతి తెలిసిందే. అక్కడ పరిస్థితి అలా ఉంటే... మరోపక్క ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో కీలకపరిణామం చోటు చేసుకుంది. ఇందులో భాగంగా ఈ కేసులో నిందితుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా నారాయణ సతీమణి పేరు యాడ్ అయ్యింది!

అవును... ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసు అనంతరం, మరింత చర్చనీయాంశమైన అమ‌రావ‌తి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ కేసులో నిందితుల సంఖ్య పెరుగుతోంది. ఇందులో భాగంగా... తాజాగా మాజీ మంత్రి నారాయ‌ణ సతీమ‌ణి ర‌మాదేవితో పాటు పలువురిపై కేసులు నమోదయాయి. వీరిలో రమాదేవి బంధువులతోపాటు.. నారాయణ కళాశాల ఉద్యోగి భార్య మొదలైన వారు ఉండటం గమనార్హం.

ఈ క్రమంలో మాజీమంత్రి నారాయణ భార్య రమాదేవితో పాటు ఆమె బంధువు రాపూరి సాంబ‌శివ‌రావు, నారాయణ కళాశాల ఉద్యోగి ధనంజయ్ భార్య ప్రమీల‌, నారాయణ బంధువు ఆవుల మ‌ణిశంక‌ర్‌ లను నిందితులుగా చేర్చుతూ సీఐడీ కేసు న‌మోదు చేయ‌డం చ‌ర్చనీయాంశ‌మైంది. ఈ మేర‌కు దీనికి సంబంధించిన పిటిష‌న్‌ ను ఏసీబీ కోర్టులో సీఐడీ అధికారులు దాఖ‌లు చేశారు.

ఇలా మాజీ మంత్రి నారాయ‌ణ స‌తీమ‌ణితో పాటు మ‌రో ముగ్గురిపై సీఐడీ కేసు న‌మోదు చేయ‌డం తాజాగా ఏపీ రాజకీయ వర్గాలతోపాటు, టీడీపీలోనూ తీవ్ర చ‌ర్చనీయాంశ‌మైంది. ఇప్పటికే ఉద్దేశ పూర్వకంగానే త‌మ‌ను వైసీపీ ప్రభుత్వం కేసుల్లో ఇరికిస్తున్నట్టు టీడీపీ నేత‌లు ఆరోపిస్తున్నారు. అయినప్పటికీ ఇలాంటి రాజకీయ విమర్శలను ప‌ట్టించుకోకుండా ఇన్నర్ రింగ్ రోడ్డు వ్యవ‌హారంలో సీఐడీ ముందుకెళుతోంది.

కాగా... ఈ అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్ మెంట్ కేసులో ఇప్పటికే చంద్రబాబు నాయుడు ఏ-1, మాజీ మంత్రి పోంగూరు నారాయ‌ణ ఏ-2, మరో మాజీ మంత్రి నారా లోకేష్ ఏ-14గా సీఐడీ కేసులు న‌మోదు చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ క్రమంలోనే నారాయణ భార్యపైనా తాజాగా ఏపీ సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు.

మరోపక్క స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబు ప్రస్తుతం రాజ‌మండ్రి సెంట్రల్ జైల్లో సుమారు నెల రోజులుగా జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్న సంగ‌తి తెలిసిందే. ఇదే సమయంలో ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ముంద‌స్తు బెయిల్ పిటిష‌న్‌ ను ఏపీ హైకోర్టు తాజాగా కొట్టేసింది. మరోపక్క స్కిల్ స్కాం కు సంబంధించిన క్వాష్ పిటిషన్ సుప్రీంలో విచారణ జరుగుతోంది.