"ఎమ్మెల్యే - ఓటరు.. మధ్యలో చెంపదెబ్బ" ఘటనలో కీలక పరిణామం!
ఓటరు గొట్టిముక్కల సుధాకర్ ఫిర్యాదు మేరకు ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు!
By: Tupaki Desk | 14 May 2024 8:05 AM GMTతాజాగా ముగిసిన ఏపీ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సమయంలో... "ఎమ్మెల్యే - ఓటరు.. మధ్యలో చెంపదెబ్బ" వ్యవహారం తీవ్ర చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో... ఎమ్మెల్యే అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ - ఓటరు గొట్టిముక్కల సుధాకర్ మధ్య నెలకొన్న చెంపదెబ్బల ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇందులో భాగంగా శివకుమార్ పై కేసు నమోదైంది.
అవును... పోలింగ్ కేంద్రంలో ఓటరుపై దాడికి పాల్పడిన ఘటన తీవ్ర చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఓటరు గొట్టిముక్కల సుధాకర్ ఫిర్యాదు మేరకు ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు!
కాగా... గుంటూరు జిల్లా తెనాలి ఐతానగర్ పోలింగ్ కేంద్రానికి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ తన కుటుంబసభ్యులతో కలిసి ఉదయం 11 గంటల సమయంలో వచ్చారు. ఈ సమయంలో అందరితో కలిసి క్యూలైన్ లో నిల్చోకుండా.. నేరుగా పోలింగ్ బూత్ లోకి వెళ్లిపోయి ఓటు వేశారు. ఈ నేపథ్యంలో సహజంగానే... అప్పటికే సుమారు రెండు గంటల నుంచి క్యూలైన్లో ఉన్న ఓటర్లు తీవ్ర అసహనానికి గురయ్యారు.
ఈ సమయంలో ఆ క్యూలైన్ లోని ఓటర్లలో గొట్టుముక్కల సుధాకర్ అనే వ్యక్తి.. క్యూలైన్లో నిలబడి వచ్చి ఓటు వేయాలని వ్యాఖ్యానించారు! దీంతో ఆగ్రహానికి గురైన ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్... సుధాకర్ చెంపపై కొట్టారు. దాంతో ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైన సుధాకర్.. అదే వేగంతో తిరిగి ఎమ్మెల్యే శివకుమార్ చెంపపై ఒక్కటి కొట్టారు.
ఈ పరిణామాలతో... ఎమ్మెల్యే వెంట ఉన్న కుటుంబసభ్యులు, అనుచరులు వెంటనే సుధాకర్ పై దాడిచేసి విచక్షణారహితంగా పిడిగుద్దులు కురిపించారు. ఈ సమయంలో బాధితుడి ఆర్తనాదాలను విన్న పోలీసులు.. వారి మధ్యకు వచ్చి విడదీసే ప్రయత్నం చేసినా ఫలించలేదని తెలుస్తుంది. అనంతరం ఎలాగోలా ఆయనను బయటకు తీసుకొచ్చి, పోలీసు వ్యాన్ లో తరలించారు!