ఆ విషయంలో జగనే కాదు.. పవన్. లోకేషూ తక్కువ కాదుగా..!
ఏపీ రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలు ఇప్పుడు చర్చకు వస్తున్నాయి.
By: Tupaki Desk | 11 Nov 2024 4:30 PM GMTరాజకీయాల్లో ఉన్న నాయకులు అధికారంలో ఉన్నప్పుడు ఒక విధంగా.. అధికారం కోల్పోతే మరో విధంగా స్పందించడం.. కామన్ అయిపోయింది. కేంద్రం నుంచి రాష్ట్రం వరకు పరిస్థితి ఇలానే ఉంది. అయితే.. అధికారంలోకి వచ్చాక మాత్రం అంతా బాగుండాలని కోరుకుంటారు. ఇది మంచిదే. కానీ, అందుకు తగిన విధంగా వేదికలు ఏర్పాటు చేయాలి. ఆ విధంగా ముందు మారాల్సింది.. మార్చాల్సింది కూడా రాజకీయా లనే. ఏపీ రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలు ఇప్పుడు చర్చకు వస్తున్నాయి.
ఇటీవల వైసీపీ అధినేత జగన్.. పోలీసులను హెచ్చరించారు. అతి చేసే అధికారులను, తమ పార్టీ నేతల పై విరుచుకుపడే అధికారులను సప్త సముద్రాలకు అవతల ఉన్నా.. వెతికి వెతికి తీసుకువచ్చి కేసులు పెడతామన్నారు. ఈ వ్యాఖ్యలు నిజంగానే సంచలనం పుట్టించాయి. దీనికి కారణం.. సోసల్ మీడియాలో వికృత పోస్టులు పెడుతున్నారంటూ.. వైసీపీ నాయకులకు ఏకంగా 2118 మందికి ఒకే రోజు నోటీసులు ఇచ్చారు. ఒకే రోజు 412 మందిని స్టేషన్‌కు తీసుకువచ్చారు.
ఈ కారణంగానే జగన్ ఫైరయ్యారు. అయితే.. ఇలా అధికారులను బెదిరించే వారిని ఊరు కునేది లేదని.. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లు హెచ్చరించారు. ఇలా అధికారులను టార్గెట్ చేసే వారిపై సుమోటోగా కేసులు పెడుతామని కూడాతెలిపారు. అయితే.. ప్రస్తుతం జగన్ చేసిన వ్యాఖ్యలు పక్కన పెడితే.. గత ఐదేళ్లలో వైసీపీ హయాంలో టీడీపీ, జనసేన నాయకులు కూడా చేసింది ఈ వ్యాఖ్యలే . జీర్ణించుకోవడానికి కొంత ఇబ్బంది ఉన్నా.. నిజం అయితే ఇదే!
అధికారులూ ఖబడ్దార్.. అంటూ.. చంద్రబాబు, అధికారులకు కళ్లు లేవా? గుడ్డిగా పనిచేస్తారా? జగన్ చెప్పాడని వింటారా? అని పవన్ కల్యాణ్.. అనేక సందర్భాల్లో వారిని హెచ్చరించారు. ఇక, నారా లోకేష్ అయితే.. రెడ్ బుక్ చూపించి మరీ హెచ్చరించారు. ఇదంతా జరిగిపోయింది. కాబట్టి మరిచిపోయాం అంటే కుదరదు. కానీ, ఇప్పుడు కావాల్సింది ప్రజాస్వామిక మార్పు. అన్నిపక్షాలు కూడా సంయమనంగా వ్యవహరించాలి. అధికారులను చట్ట ప్రకారం.. రాజ్యాంగం ప్రకారం పనిచేసుకోనివ్వాలి. అంతేకానీ, అధికారంలో ఉంటే ఒకలా.. లేకపోతే.. మరోలా వ్యవహరించడం అనేది ఇరు పక్షాలకూ మంచిది కాదన్నది పరిశీలకులు చెబుతున్న మాట.