'కామం' ముందు 'కులం' నిలవలేదు.. సీఎం సర్
వీటిలో ప్రధానంగా ఓబీసీ, ఈబీసీవర్గాలకు మునుపెన్నడూ లేని విధంగా ఊహకు సైతం అందని విధంగా 43 శాతం పెంచుతూ సీఎం నితీశ్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
By: Tupaki Desk | 9 Nov 2023 11:58 AM GMT``కులం లెక్కలు తేల్చి.. వెనుకబడిన వర్గాలకు మేలు చేసేందుకు మా ముఖ్యమంత్రి కృషి చేస్తున్నాడు``- నగరం నుంచి గ్రామీణం వరకు వినిపించిన ప్రశంసాపూర్వక మాట ఇది!
``ఈ దెబ్బతో మాకు మంచి రోజులు వచ్చాయి. వస్తాయి!`` పట్టణం నుంచి రాష్ట్ర సరిహద్దుల వరకు మార్మోగిన మాట ఇది. అదే. బిహార్లో చేపట్టిన కులగణన ఎఫెక్ట్. దేశంలోనే తొలిసారి కుల గణన చేపట్టిన రాష్ట్రంగా బిహార్ రికార్డు సృస్టించింది. అంతేకాదు.. ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్లను 50 శాతానికి పెంచుతూ కూడా నిర్ణయం తీసుకుంది. వీటిలో ప్రధానంగా ఓబీసీ, ఈబీసీవర్గాలకు మునుపెన్నడూ లేని విధంగా ఊహకు సైతం అందని విధంగా 43 శాతం పెంచుతూ సీఎం నితీశ్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
నిజానికి ఈ నిర్ణయం తీసుకున్నందుకుఆయన జీవించి ఉండగానే.. విగ్రహాలు పెట్టి పూజలు చేయాల్సింది. వెనుక బడిన వర్గాలకు మేలు చేయాలన్న తలంపు(ఎన్నికల నేపథ్యంలోనే కావొచ్చు) మంచిదే కావొచ్చు. కానీ, ఆయనకు ఎక్కడా మెచ్చుకోళ్లు రావడం లేదు. తన వ్యతిరేకతను తానే తవ్వుకున్నారు. కీలకమైన కుల గణన చర్చకు రాకుండా.. సంచలనం కాకుండా చేసుకున్నది సాక్షాత్తూ ముఖ్యమంత్రి నితీశే!!
దీనికి కారణం.. అసెంబ్లీలో ఆయన చేసిన కామ వ్యాఖ్యలు. ``చదువుకున్న మహిళలైతే.. శృంగార సమయంలో పీక్ స్టేజ్‌కు వెళ్లినప్పుడు బయటకు తీసేయడం ద్వారా జననాల రేటును తగ్గించి.. జనాభా తగ్గేలా దోహదపడతారు`` అని నితీశ్ కుమార్ నిండు అసెంబ్లీలో చేసిన వ్యాఖ్య.. కీలకమైన కుల గణనపై చర్చను బదాబదలు చేసింది.
కట్ చేస్తే.. నితీశ్ చేసిన వ్యాఖ్యలపై దేశంలోనే కాదు.. అంతర్జాతీయంగా కూడా.. తీవ్ర విమర్శలు వస్తున్నాయి. తక్షణం ఆయన రాజీనామా చేయాలని బ్రిటన్ మహిళా మంత్రికోరగా.. అమెరికా మహిళా ప్రజానిథులు కూడా అంతే తీవ్రంగా స్పందించారు. ఇక, బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ వ్యాఖ్యలపై ప్రముఖ అమెరికన్ గాయని మేరీ మిల్బెన్ దీటుగా స్పందించారు. ఆయన మాటలను ఖండించారు.
``నీతీశ్‌జీ వ్యాఖ్యల తర్వాత.. బిహార్ ముఖ్యమంత్రి పదవి కోసం ఒక ధైర్యవంతురాలైన మహిళ ముందుకు రావాల్సిన అవసరం ఉందని భావిస్తున్నాను. నేను భారతీయ మహిళను అయ్యుంటే.. బిహార్‌కి వెళ్లి ముఖ్యమంత్రి పదవికి పోటీ చేసుండేదాన్ని. నీతీశ్ కుమార్ రాజీనామా చేయాల్సిన సమయం వచ్చింది. ‘ఓటు వేయండి, మార్పు తీసుకురండి`` అని సూచించారు. మొత్తానికి కీలకమైన కుల గణన కాస్తా.. కామ వ్యాఖ్యల ముందు కొట్టుకుపోవడం.. నితీశ్ చేసుకున్న స్వయంకృతం. ఇదే లేక పోయి ఉంటే.. దేశంలో ఇప్పుడు ఆయన మోడీని మించిన హీరో అయి ఉండేవారని పరిశీలకులు చెబుతున్నారు.