Begin typing your search above and press return to search.

గోదావరి పాలిటిక్స్ : క్యాస్ట్ పోలరైజేషన్ దిశగా ?

రాజకీయాలు అంటే ఎన్నో సమ్మిళితం. ఎవరూ బయటకు ఏమీ చెప్పకపోయినా కులం ప్రాంతం మతం ఇలా ఎన్నో కీలకమైన పాత్ర పోషిస్తాయి

By:  Tupaki Desk   |   12 Aug 2024 2:30 PM GMT
గోదావరి పాలిటిక్స్ : క్యాస్ట్ పోలరైజేషన్ దిశగా ?
X

రాజకీయాలు అంటే ఎన్నో సమ్మిళితం. ఎవరూ బయటకు ఏమీ చెప్పకపోయినా కులం ప్రాంతం మతం ఇలా ఎన్నో కీలకమైన పాత్ర పోషిస్తాయి. ఏపీలో చూస్తే ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా కూడా అత్యంత కీలకమైన ప్రాంతం గోదావరి జిల్లాలు అని చెబుతారు.

రాజకీయ నాడిని పట్టడంలో ఈ జిల్లాలు అందె వేసిన చేయిగా ఉంటూ వస్తున్నాయి. ఈ జిల్లాలను నమ్ముకున్న పార్టీలదే అందలం అని రుజువు అవుతోంది. ఇదిలా ఉంటే వైసీపీ విముక్త గోదావరి జిల్లాలు అని గత ఎన్నికల ముందు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు ఇచ్చారు. దానికి తగినట్లుగానే గోదావరి జిల్లాలలో వైసీపీ ఒక్క సీటునూ గెలుచుకో లేకపోయింది.

పోనీ అది కూటమి ప్రభంజనం అనుకున్నా ఎన్నికల తరువాత కూడా వైసీపీకి మారుతున్న రాజకీయ పరిణామాలు షాక్ ఇచ్చేలాగానే ఉన్నాయి. గోదావరి జిల్లాలో ఒక ప్రధాన సామాజికవర్గం రాజకీయ ఆధిపత్యం అధికంగా ఉంటుంది. ఆ సామాజిక వర్గం ఇపుడు వైసీపీకి దూరం అవుతున్నట్లుగానే పరిస్థితి అయితే కనిపిస్తోంది అని అంటున్నారు.

ఎందుకు అంటే కూటమిలో కీలకంగా ఉన్న జనసేనకు ఆ ప్రధాన సామాజిక వర్గం ఆలంబనగా ఉంది. కొత్త రాజకీయం పైగా తన సామాజిక వర్గం ఉనికిని చాటుకునేందుకు ఇది మంచి అవకాశంగా భావించిన వారు అంతా ఆ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు. అదే సమయంలో టీడీపీలో కూడా ఆ ప్రధాన సామాజిక వర్గానికి చెందిన నాయకులు ఉన్నారు. రెండు పార్టీలు మిత్రులే కాబట్టి ఇబ్బంది అయితే లేదు.

కానీ వైసీపీ మాత్రం విపక్షంలో ఉంది. దాంతో ఆ పార్టీలో ఉన్న వారి మీద సదరు ప్రధాన సామాజిక వర్గం నుంచి ఒత్తిళ్ళు వస్తున్నాయని అంటున్నారు. వైసీపీని ఆ సామాజిక వర్గానికి చెందిన రాజకీయ నేతలు ఎందుకో దూరం పెడుతున్నారు. తమకు వ్యతిరేక పార్టీగానే చూస్తున్నారు.

దాంతో అందులో ఉన్న వారిని సైతం సదరు సామాజిక వర్గానికి వ్యతిరేకం అన్నట్లుగా ప్రచారం సాగుతోందిట. ఈ పరిణామాల క్రమంలోనే ఏళ్ళ తరబడి వైసీపీ జెండా మోసిన వారు సైతం సడెన్ గా జెండా దించేస్తున్నారు. వారు ఏ పార్టీకి చెందని వారుగా ఉండడానికి ఇష్టపడుతున్నారు కానీ వైసీపీ తరఫున తాము జెండా ఎత్తేందుకు మాత్రం అంతగా ముందుకు రావడం లేదు అని అంటున్నారు.

దానికి కారణం కూటమి బలంగా ఉండడం అధికారంలో ఉండడంతో కూటమి చుట్టూ ఒక బలమైన సామాజిక వర్గం అల్లుకుంటోంది అని అంటున్నారు. అలా క్యాస్ట్ పోలరైజేషన్ సాగుతోందని ఇది వైసీపీకి రాజకీయంగా ఇబ్బందిగా మారింది అని అంటున్నారు. గోదావరి జిల్లాలో బీసీలు ఎక్కువ. అయితే బీసీలు మళ్లీ టీడీపీకి చేరువ అయ్యారు. వారంతా 2019లో వైసీపీ వైపు వచ్చిన వారే కానీ మారిన పరిణామాలు అధికార పార్టీ గట్టిగా ఉండడంతో ఆ వైపుగా మళ్ళుతున్నారు.

దీంతో వైసీపీకి గోదావర్ జిల్లాలలో ఎదురీతగానే ఉంది అని అంటున్నారు. కూటమి అధికారంలోకి వచ్చి రెండు నెలలు అయింది. అపుడే గోదావరి జిల్లాలలోనే ఎక్కువగా వైసీపీని నేతలు వీడిపోతున్నారు. అందులో ఒక బలమైన సామాజిక వర్గానికి చెందిన వారే ఉండడం విశేషం అంటున్నారు. మరి ఇది ఇలాగే కొనసాగుతుందా అంటే ఎవరూ ఏమీ చెప్పలేరని అంటున్నారు.

రాజకీయం ఎపుడూ కదిలే నది లాంటిది. నిన్నటిలా నేడు ఉండదు, రేపు అసలే ఉండదు, అందువల్ల వైసీపీకి ఈ రోజు ఇబ్బందులు ఉన్నా తట్టుకుని నిలబడాల్సి ఉంది. మరి ఆ విధంగా వైసీపీ ఎంతవరకూ గోదావరి జిల్లాలలో తన పార్టీ పటిష్టత కోసం పోరాడుతుంది అన్నదానిని బట్టే భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది అని అంటున్నారు. సాధారణంగా ఎన్నికలు ముగిసాక ఏ పార్టీ దారి ఆ పార్టీదే. కానీ ఈసారి మాత్రం ఎన్నికల అనంతరం కూడా క్యాస్ ఈక్వేషన్స్ బలంగా విస్తరించడంతో పాటు పోలరైజేషన్ దిశగా సాగుతున్న పరిణామాలు చూస్తూంటే గోదావరి వర్రీ వైసీపీకి తప్పదనే అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.