రెండుపార్టీల దృష్టి వీళ్ళపైనేనా ?
ఈ న్యూట్రల్స్ వర్గంలో కులం, మతం, పార్టీల ప్రస్తావన ఉండదు. తమకు ఎవరు మేలుచేస్తారు ? అన్న విషయాన్ని మాత్రమే ఆలోచిస్తారు.
By: Tupaki Desk | 28 Sep 2023 4:43 AM GMTగడచిన 20 రోజులనుండి ఏపీ రాజకీయాలు మొత్తం చంద్రబాబునాయుడు, అరెస్టు, రిమాండు, సీఐడీ విచారణ, కోర్టుల్లో పోరాటాల చుట్టే తిరుగుతున్నాయి. అరెస్టుకు సంబంధించి రెండుపార్టీల నేతల్లోను ఎవరి వాదనలు వాళ్ళకుంటాయి. స్కిల్ స్కామ్ లో చంద్రబాబు రు. 371 కోట్లను దోచుకున్నారు కాబట్టే అరెస్టయ్యారని మంత్రులు, వైసీపీ ఎంఎల్ఏలు అంటున్నారు. ఇదే సమయంలో స్కిల్ సెంటర్ల ఏర్పాటులో చంద్రబాబు ఏ తప్పుచేయలేదని, ప్రభుత్వం తప్పుడు కేసులుపెట్టి అరెస్టుచేసిందని తమ్ముళ్ళు వాదిస్తున్నారు.
బయట వీళ్ళ ఆరోపణలు, ప్రత్యారోపణలు, కోర్టుల్లో లాయర్ల వాదోపవాదనలు ఎలాగున్నాయన్నది వేరే సంగతి. అయితే రెండుపార్టీల దృష్టి మూడోవర్గంపైన పడిందట. ఆ మూడోవర్గం ఏమిటంటే న్యూట్రల్స్ వర్గం.అంటే ఏ పార్టీతోను వీళ్ళకి సంబంధం ఉండదు.మామూలుగా అయితే ఏ పార్టీ అధినేతల వాదనలను ఆ పార్టీ నేతలు, క్యాడర్, సానుభూతిపరులు వినిపిస్తుంటారు. వీళ్ళ లైన్ ఫిక్సయిపోయుంటుంది కాబట్టి పెద్దగా ఆలోచించాల్సిన అవసరంలేదు. అంటే సమాజంలోని పార్టీల జనాలు పార్టీల వారీగా చీలిపోయుంటారు.
వీళ్ళమద్దతు కూడా స్పష్టంగానే ఉంటుంది. అయితే వీళ్ళకన్నా ముఖ్యం ఎవరంటే న్యూట్రల్స్ వర్గం. ఏ ఎన్నికల్లో అయినా వీళ్ళు ఎవరివైపు ఎక్కువగా మొగ్గితే ఆ పార్టీకే అధికారం దక్కుతుంది. ఏ పార్టీకైనా పార్టీ జనాల వల్ల అధికారం రాదు ఇలాంటి న్యూట్రల్స్ మొగ్గు వల్లే అధికారం డిసైడ్ అవుతుంది. ఒక అంచనా ప్రకారం న్యూట్రల్స్ వర్గం జనాభా సుమారు 25 శాతం ఉంటుంది.
ఈ న్యూట్రల్స్ వర్గంలో కులం, మతం, పార్టీల ప్రస్తావన ఉండదు. తమకు ఎవరు మేలుచేస్తారు ? అన్న విషయాన్ని మాత్రమే ఆలోచిస్తారు. వీళ్ళల్లో అత్యధికులు మధ్యతరగతి జనాలే ఉంటారు. వీళ్ళకి రాజకీయాలు కూడా పెద్దగా పట్టవు. తమ ఉద్యోగాలు, వృత్తులేదో చేసుకుంటుంటారంతే. ఎన్నికల సమయంలో కూడా పెద్దగా యాక్టివ్ గా ఉండరు.
పోలింగ్ రోజున సైలెంటుగా వచ్చి ఓట్లేసి వెళ్ళిపోతారంతే. ఇపుడు రెండుపార్టీల ప్రయాసంతా వీళ్ళపైనే నిలిచింది. చంద్రబాబు తప్పుచేశాడని లేదా చేయలేదని ఈ న్యూట్రల్స్ వర్గం నమ్మటంపైనే వైసీపీ, టీడీపీ ల భవిష్యత్ రాజకీయం ఆధారపడుంటుంది. వీళ్ళని మెప్పించటంపైనే రెండుపార్టీలు అవస్తలు పడుతున్నాయి.