Begin typing your search above and press return to search.

'కావేరీ' కల్లోలం.. 44 విమానాలు రద్దు!

కావేరి నదీ జలాల వ్యవహారం కర్ణాటకలో తీవ్ర అలజడికి కారణమవుతోంది. తమిళనాడుకు నీటిని విడుదల చేయడాన్ని నిరసిస్తూ గత కొద్ది రోజులుగా కర్ణాటకలో నిరసనలు చెలరేగుతున్నాయి.

By:  Tupaki Desk   |   29 Sep 2023 9:03 AM GMT
కావేరీ కల్లోలం.. 44 విమానాలు రద్దు!
X

కావేరి నదీ జలాల వ్యవహారం కర్ణాటకలో తీవ్ర అలజడికి కారణమవుతోంది. తమిళనాడుకు నీటిని విడుదల చేయడాన్ని నిరసిస్తూ గత కొద్ది రోజులుగా కర్ణాటకలో నిరసనలు చెలరేగుతున్నాయి. కర్ణాటక పరిరక్షణ సమితి, రైతు సమితి, కన్నడ రైతు సంఘాల ఆధ్వర్యంలో బంద్‌ కొనసాగుతోంది. తమిళనాడుకు నీటిని విడుదల చేయొద్దని ఆందోళనలు కొనసాగుతున్నాయి.

కర్ణాటక రక్షణ వేదికె, జయ కర్ణాటక సంఘం, ఇతర కన్నడ సంఘాలు, రైతు సంఘం, హసిరుసేన, చెరకు సాగుదారుల సంఘం, ట్యాక్సీ– ఆటోరిక్షా సంఘాలు, కర్ణాటక చలనచిత్ర వాణిజ్య మండలి, సినిమా కళాకారుల సంఘం తదితర వందకు పైగా సంస్థలు ఈ బంద్‌ కు పిలుపునిచ్చాయి. దీంతో పూర్తి స్థాయి బంద్‌ కొనసాగింది. బంద్‌ తో కర్ణాటక వ్యాప్తంగా బస్సులు నిలిచిపోయాయి. అలాగే స్కూళ్లు, కళాశాలలు సైతం మూతపడ్డాయి.

ఆందోళనకారులు నిరసనలకు దిగడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. నిరసనల సెగ విమానాలకు కూడా తగిలింది. బెంగళూరు నుంచి బయలుదేరాల్సిన మొత్తం 44 విమానాలను బంద్‌ నేపథ్యంలో రద్దు చేశారు. బంద్‌ కు మద్దతుగా హోటళ్లు, విద్యా, వ్యాపార సంస్థలు మూతపడ్డాయి. ట్యాక్సీలు, ఆటోలు కూడా ఎక్కడికక్కడే స్తంభించిపోయాయి. ఓలా, ఉబెర్‌ వంటి యాప్‌ ఆధారిత ట్యాక్సీ సేవలు కూడా నిలిచిపోయాయి.

బంద్‌ ప్రభావం విమాన రాకపోకలపైనా పడింది. బెంగళూరు విమానాశ్రయంలో 44 విమాన సర్వీసులను అధికారులు రద్దు చేశారు. బంద్‌ నేపథ్యంలో చాలా మంది ప్రయాణికులు తమ టికెట్లను క్యాన్సిల్‌ చేసుకోవడంతో వీటిని రద్దు చేసినట్టు చెబుతున్నారు.

తమిళనాడుకు నీటిని విడుదల చేయడాన్ని నిరసిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పలుచోట్ల ఆందోళనకారులు నిరసనలకు దిగారు. మైసూరులో బస్టాండ్‌ ఎదుట రైతు సంఘాల నేతలు ఆందోళనకు దిగడంతో బస్సుల రాకపోకలు నిలిచిపోయాయి.

ఇప్పటివరకు 50 మందికి పైగా ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బంద్‌ తో శుక్రవారం అర్ధరాత్రి వరకు రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్‌ విధించారు. అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పలు చోట్ల సీఆర్‌పీఎఫ్‌ బలగాలను రంగంలోకి దించారు. ఆందోళనల నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయాలతోపాటు కేఆర్‌ఎస్‌ ఆనకట్ట, ఇతర పర్యాటక, చారిత్రక కట్టడాల వద్ద ప్రభుత్వం భద్రతను మరింతను పెంచింది.

మరోవైపు తమిళనాడు సరిహద్దు ప్రాంతాల్లోనూ భద్రతను కట్టుదిట్టం చేశారు. కర్ణాటకలో ఆందోళనలతో తమిళనాడులోనూ కొన్ని చోట్ల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో తమిళనాడు వైపు వెళ్లే వాహనాల్లో ముమ్మర తనిఖీలు చేపట్టారు. అంతేకాకుండా తమిళనాడుకు వెళ్లే కర్ణాటక ఆర్టీసీ బస్సులను ముందు జాగ్రత్త చర్యగా నిలిపివేశారు.

కాగా కావేరీ జలాల విడుదలను నిరసిస్తూ గత వారం బెంగళూరులో చేపట్టిన బంద్‌ తో రాష్ట్ర ఖజానాకు రూ.1000–1500 కోట్ల నష్టం వాటిల్లినట్లు సమచారం. ఇప్పుడు రోజుల వ్యవధిలోనే మరోసారి బంద్‌ చేపట్టడంతో పరిశ్రమలు ఉత్పత్తి ఆగిపోయి భారీ నష్టాన్ని చూస్తాయనే ఆందోళన వ్యక్తమవుతోంది.