ప్లేగు వ్యాది ఖాళీ చేసిన "కేవ్ సిటీ" గురించి తెలుసా?
ఈ సృష్టిలో ప్రకృతి సిద్ధంగా ఎన్ని అద్భుతాలు ఉన్నాయో.. కాల క్రమేణా అద్భుతాలుగా మారిన మరెన్నో సుందర ప్రాంతాలూ ఉన్నాయి.
By: Tupaki Desk | 9 Oct 2023 12:30 AM GMTఈ సృష్టిలో ప్రకృతి సిద్ధంగా ఎన్ని అద్భుతాలు ఉన్నాయో.. కాల క్రమేణా అద్భుతాలుగా మారిన మరెన్నో సుందర ప్రాంతాలూ ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని ప్రాంతలు అద్భుత నగరాలుగా మారితే.. మరికొన్ని సందర్భాల్లో అవి కాస్తా శాపగ్రస్త నగరాలుగా మారతాయి. ఇలా శాపగ్రస్త నగరంగా మారిన ఒక గ్రామం గురించి తెలుసుకుందాం.
అవును... గతం ఎంతో ఘనం, వర్తమానం పర్యాటకం అన్నట్లుగా జన నివాసాలకు శాపగ్రస్త ప్రాంతంగా, పర్యాటకులకు అద్భుత ప్రాంతంగా మారిన "కేవ్ సిటీ" ఇటలీలోని బాజిలికా ప్రాంతంలో ఉంది. సుమారు అరవై ఏళ్లుగా మనుషులు లేని శాపగ్రస్త గ్రామంగా ఉన్న ఆ ఊరి పేరు క్రాకో.
వివరాళ్లోకి వెళ్తే... ఇటలీలోని కేవోన్ నది సమీపంలో ఎత్తయిన కొండ మీద ఉంది ఒక ఊరు. దీనిని సుమారు పద్నాలుగు శతాబ్దాల కిందట కట్టుదిట్టంగా నిర్మించుకున్నారని చెబుతుంటారు. ఆనాటి రక్షణ అవసరాలను దృష్టిలో పెట్టుకుని శత్రుదుర్భేద్యంగా దీనిని రూపొందించుకున్నారు. కొండను తొలిచి ఊరిలోని ఇళ్లను, ప్రార్థన స్థలాలను రాళ్లతో నిర్మించుకున్నారు.
ఇదే గ్రామంలో కొన్ని చోట్ల అలా కొండలను తొలిచి గృహాలు నిర్మిస్తే.. మరికొన్నిచోట్ల గుహలలో ఇళ్లను ఏర్పాటు చేసుకున్నారు. అందుకే దీన్ని గతంలో "కేవ్ సిటీ"గా పేరుపొందింది. ఇదే సమయంలో అప్పట్లో రోమన్ చక్రవర్తి రెండో ఫ్రెడెరిక్ కాలంలో ఈ ఊరు వ్యూహాత్మక సైనిక స్థావరంగా కూడా ఉపయోగపడేదని చెబుతుంటారు.
ఈస్థాయి చరిత్రతో, వైభవంగా వెలిగిన ఈ గ్రామాన్ని పద్నాలుగో శతాబ్దిలో ప్లేగు మహమ్మారి కబలించింది. నాడు ప్రాణాంతకమైన ప్లేగు వ్యాధి విజృంభించడంతో ఈ ఊళ్లోని వందలాది మంది మృత్యువాత పడ్డారు. నాటి నుంచి నిత్యం ఏదో ఒక ఉపద్రవం ఆ గ్రామాన్ని ఇబ్బందిపెడుతూనే ఉంది. దీంతో కాలక్రమేణా దీన్ని ఒక శాపగ్రస్త గ్రామంగా భావించడం మొదలుపెట్టారు.
మరోపక్క కొండచరియలు కూలిన సంఘటనల్లో కొందరు మరణించారు. ఈ ప్రకృతి విపత్తులకు తోడు బందిపోట్ల దాడులు కూడా కారణమమవుతూ... ఆ ఊరిని పూర్తి జనరహిత ప్రాంతంగా మార్చేశాయి. ఇందులో భాగంగా... చివరిసారిగా 1963లో ఒక భారీ కొండచరియ విరిగిపడటంతో ఊళ్లో భారీ విధ్వంసమే జరిగింది. దానితో అప్పటికీ కొద్దోగొప్పో ఉన్న జనాం కూడా ఊరిని వదిలేశారు.
నాటి నుంచి ఈ గ్రామం శాపగ్రస్త గ్రామంగా పేరుగాంచింది. జనావాసలు లేకుండా పోయాయి. అయితే కాలక్రమేణా అక్కడి అద్భుత నిర్మాణాల కారణంగా అదొక పర్యాటక ప్రదేశంగా మారింది. దీంతో... ఇటలీ వెళ్లే పర్యాటకుల్లో పలువురు ఈ ఊరిని కచ్చితంగా సందర్శించి వెళ్తుంటారు. ఇలా కాలక్రమంలో నివాసాలకు దూరమైన ఈ ఊరు... పర్యాటకులకు మాత్రం ఆసక్తికరమైన ప్రదేశంగా మారిపోయింది.