Begin typing your search above and press return to search.

దేశంలో ట్యాక్స్‌ కట్టేవాళ్లు ఎంతమందో తెలుసా?

చాలా మంది వ్యక్తులు పన్ను రిటర్న్‌ లను దాఖలు చేయడం స్వచ్ఛందంగా జరుగుతుందని, అందువల్ల అది అనవసరం, భారం అని కొట్టిపారేస్తుంటారు.

By:  Tupaki Desk   |   24 Jan 2024 3:30 PM GMT
దేశంలో ట్యాక్స్‌  కట్టేవాళ్లు ఎంతమందో తెలుసా?
X

చాలా మంది వ్యక్తులు పన్ను రిటర్న్‌ లను దాఖలు చేయడం స్వచ్ఛందంగా జరుగుతుందని, అందువల్ల అది అనవసరం, భారం అని కొట్టిపారేస్తుంటారు. కానీ.. ఇన్ కం ట్యాక్స్ ఫైల్ చేయడం అనేది దేశ ఆర్థిక అభివృద్ధికి ఆరోగ్యకరమైన దృక్పథం! పన్ను రిటర్న్‌ లను దాఖలు చేయడం అనేది దేశంలోని బాధ్యతగల ప్రతి పౌరుని నైతిక, సామాజిక విధిగా పరిగణించబడే కార్యక్రమం. ఇప్పుడు ఈ విధంగా ఆలోచించేవారి సంఖ్య పెరుగుతుందని అంటున్నారు.

అవును... రిటర్న్‌ లు దాఖలు చేయడం ప్రతి పౌరుని బాధ్యత! ఇదే సమయంలో వ్యక్తులు, వ్యాపారాలు తదుపరి లావాదేవీలలోకి ప్రవేశించడాన్ని ఈ ప్రక్రియ సులభతరం చేస్తుంది కూడా! ఈ క్రమంలో దేశంలో పన్ను చెల్లింపుదారుల సంఖ్య క్రమంగా పెరుగుతుందని తెలుస్తుంది. ఇది కచ్చితంగా శుభసూచికం. తాజాగా వీటికి సంబంధించిన గణాంకాలను, పెరిగిన వివరాలను కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

వివరాళ్లోకి వెళ్తే... గడిచిన పదేళ్ల కాలంలో దేశంలో ఆదాయపు పన్ను చెల్లింపుదారుల సంఖ్య రెట్టింపయ్యిందని, ఇందులో భాగంగా.. ఐటీ రిటర్నులు దాఖలు చేసే వారిసంఖ్య 7.78 కోట్లకు చేరుకుందని కేంద్ర ప్రభుత్వం తాజాగా వెల్లడించింది. ఈ సందర్భంగా ఇన్ కం టాక్స్ కి సంబంధించి "సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్ట్‌ టాక్సెస్‌ (సీబీడీటీ)" కీలక గణాంకాలను వెల్లడించింది.

ఇందులో భాగంగా... 2013 - 14లో దేశంలో ఇన్ కం ట్యాక్స్ దాఖలు చేసిన వారి సంఖ్య 3.8కోట్లు ఉండగా... 2022 - 2023 ఆర్థిక సంవత్సరానికి గానూ దేశంలో ఆదాయపు పన్ను దాఖలు చేసే వారి సంఖ్య 7.78 కోట్లకు చేరుకుంది. అంటే... 2013 - 14తో పోలిస్తే 104.91శాతం పెరుగుదల కనిపించింది అని సీబీడీటీ తన తాజా గణాంకాలలో వెల్లడించింది.

ఇదే సమయంలో... 2013 - 14లో పన్నుల రూపంలో నికరంగా రూ.6,38,596 కోట్లు వసూలు కాగా 2022 - 23 నాటికి ఆ సొమ్ము రూ.16,63,686 కోట్లకు పెరిగిందని తెలిపింది. అంటే... నికర పన్నుల వసూళ్లలో వృద్ధి 160.52శాతం కనిపించిందన్నమాట. ఇదే సమయంలో... ప్రత్యక్ష పన్నుల ద్వారా రూ.18.23లక్షల కోట్లు వసూలు చేయాలని బడ్జెట్‌ లో ప్రతిపాదించగా.. గత ఆర్థిక సంవత్సరంలో రూ.16.61లక్షల కోట్లతో పోలిస్తే ఇది 9.75శాతం ఎక్కువ అని సీబీడీటీ వెల్లడించింది.