మహిళా ఐపీఎస్ పై సీబీఐ కేసు... ఏమిటీ రూ.1,200 కోట్ల స్కామ్?
వివరాళ్లోకి వెళ్తే... జల్ గావ్ జిల్లాలోని భైచంద్ హీరా చంద్ రైసోనీ క్రెడిట్ సొసైటీ కి సంబంధించిన రూ.1,200 కోట్ల స్కామ్.. 2015లో వెలుగులోకి వచ్చింది.
By: Tupaki Desk | 18 Oct 2024 1:30 AM GMTమహారాష్ట్రలో కంచె చేను మేసినటువంటి సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఫోర్జరీ, నేరపూరిత కుట్ర ఆరోపణలపై ఐపీఎస్ అధికారిణిపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) కేసు నమోదు చేసినట్లు దర్యాప్తు సంస్థ ప్రకటించింది. రూ.1,200 కోట్ల కుంభకోణం దర్యాప్తులో ఫోర్జరీ, లోపభూయిష్ట డాక్యుమెంటేషన్ అనే ఆరోపణలు తెరపైకి వచ్చాయి!
అవును... మహారాష్ట్రలోని ఓ మహిళా ఐపీఎస్ పై సీబీఐ కేసు నమోదు చేసింది. రూ.1,200 కోట్ల కుంభకోణానికి సంబంధించిన దర్యాప్తు వ్యవహారంలో ఫోర్జరీ, నేరపూరిత కుట్రకు ఆమె పాల్పడిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. భారతీయ శిక్షాస్మృతిలోని 120-బి, 466, 474, 201 సెక్షన్ల కింద ఆమెపై అభియోగాలు మోపినట్లు చెబుతున్నారు!
వివరాళ్లోకి వెళ్తే... జల్ గావ్ జిల్లాలోని భైచంద్ హీరా చంద్ రైసోనీ క్రెడిట్ సొసైటీ కి సంబంధించిన రూ.1,200 కోట్ల స్కామ్.. 2015లో వెలుగులోకి వచ్చింది. ఈ కేసు 2020లో సీబీఐకి బదిలీ అయ్యింది. ఈ క్రమంలో... 2020 నుంచి 2022 వరకూ ఈ కేసు విచారణకు సంబంధించి సదరు మహిళా ఐపీఎస్ నాయకత్వం వహించారు.
ఈ క్రమంలోనే ఆమె దర్యాప్తులో ఎన్నో అవకతవకలకు పాల్పడ్డారని సీబీఐ పేర్కొంది. ఇందులో భాగంగా... ఒకే రోజు ఒకే నేరం కింద మూడు కేసులు నమోదు చేయడం.. కేసుకు హాజరుకాకుండానే ఫిర్యాదుదారుల సంతకాలను ఫోర్జరీ చేయడం వంటివాటిలో ఆమె పాత్ర ఉన్నట్లు సీబీఐ విచారణలో తేలిందట. దీంతో... ఆమె పై సీబీఐ కేసు నమోదు చేసింది.
ఏమీటీ రూ.1,200 బీ.హెచ్.ఆర్. స్కామ్..?:
మహారాష్ట్రలోని జల్ గావ్ జిల్లాలో భైచంద్ హీరాచంద్ రైసోనీ క్రెడిట్ సొసైటీ ఫిక్స్డ్ డిపాజిట్ల పేరుతో అనేక మందిని మోసం చేసింది. అధిక వడ్డీలు ఆశచూపించి రూ.1,200 కోట్లకు పైగా భారీ కుంభకోణానికి పాల్పడింది. 2015లో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలోనే 2020లో ఈ కేసు సీబీఐకి అప్పగించబడింది.
ఈ క్రమంలో భైచంద్ హీరాచంద్ రైసోని (బీ.హెచ్.ఆర్.) స్టేట్ కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీకి సంబంధించి సుమారు రూ.1,200 కోట్ల కుంభకోణంలో ప్రధాన నిందితుడైన జితేంద్ర కందారేను ను జూన్ 2021లో అరెస్ట్ చేశారు. ఈ కేసు విచారణ ఇంకా కొనసాగుతోంది.