తిరుమల లడ్డూ.. ఆ జాబితాలోకేనా..!
తిరుమల శ్రీవారి పవిత్ర లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగించారన్న ఆరోపణలు గత 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించిన విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 5 Oct 2024 12:30 PM GMTతిరుమల శ్రీవారి పవిత్ర లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగించారన్న ఆరోపణలు గత 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఒక్క మన దేశంలోనే కాకుండా.. ప్రపంచ వ్యాప్తంగా హిందువులు ఈ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తానికి ఇది .. సుప్రీంకోర్టుకు చేరిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా సీబీఐ, ఏపీ పోలీసు, కేంద్ర ఆహార నాణ్యత పరిశీలన అధారిటీ నుంచి కూడా అధికారులను ఎంపిక చేసుకుని దర్యాప్తు చేయాలని ఆదేశించింది.
దీనిని అందరూ స్వాగతించారు. సీఎం చంద్రబాబు నుంచి డిప్యూటీ సీఎం, విపక్ష నాయకుడు ఇలా.. అందరూ స్వాగతించారు. మంత్రి నారా లోకేష్ అయితే.. నిత్య సత్యం నినదించు! అనే క్యాప్షన్ కూడా పెట్టారు. సో.. మొత్తానికి అత్యంత తీవ్ర వివాదంగా అవతరించిన లడ్డూ వివాదం... మేలైన మలుపు తిరిగిందని నిపుణులు, విద్యాధికులు కూడా భావిస్తున్నారు. ఇంత వరకు బాగానే ఉంది. ఇక, ఇప్పుడు కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ నేతృత్వంలో ఈ కేసు విచారణ సాగనుంది.
అయితే.. ఇక్కడ చిత్రం ఏంటంటే.. సీబీఐకి అప్పగించిన ఏ కేసూ కూడా(ఏపీకి సంబంధించి) ఇప్పటి వరకు ముందుకు సాగలేదు. ఉదాహరణకు విజయనగరంలో రామతీర్థం శ్రీరాముని విగ్రహం శిరచ్ఛేధం జరిగినప్పుడు ఆ కేసును సీబీఐకి అప్పటి సీఎం జగన్ అప్పగించారు. ఎవరూ కోరకుండానే ఆయన ప్రధాని మోడీకి లేఖ రాసి కేసును అప్పగించారు. కానీ, ఇప్పటి వరకు ఈ కేసు విచారణ కు కూడా నోచు కోలేదు. ఇక, దీనికి ముందు అంతర్వేది రథం దగ్ధం వ్యవహారం కూడా అనేక మలుపులు తిరిగింది.
ఈ కేసును కూడా బీజేపీ నేతల ఒత్తిడి, ప్రతిపక్షాల ఒత్తిడితో అప్పటి సీఎం జగన్ సీబీఐకి అప్పగించారు. సీబీఐ అధికారులు కూడా తాము ఈ కేసును దర్యాప్తు చేస్తామని చెప్పారు. కానీ, ఏళ్లు, పూళ్లూ గడిచిపో యినా.. ఇప్పటి వరకు అంతర్వేది రథాన్ని ఎవరు తగుల బెట్టారు? దీనివెనుక ఎవరున్నారనే విషయం వెలుగు చూడలేదు. సీబీఐ విచారణ సాగుతూనే ఉంది. ఈ క్రమంలో ఇప్పుడు తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం వ్యవహారం కూడా ఇదే జాబితాలో చేరిపోతుందా? అన్నది ప్రశ్న.
అయితే.. దీనిపై భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. పై రెండు కేసులు కూడా అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఇనిషియేట్ తీసుకుని సీబీఐకి అప్పగించిందని పరిశీలకులు చెబుతున్నారు. కానీ, ఇప్పుడు సుప్రీంకోర్టు జోక్యంతో.. తన పర్వేక్షణ, సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణ ఉంటుంది కాబట్టి విచారణ ఊపందుకుంటుందని మరికొందరు భావిస్తున్నాయి. పైగా సుప్రీంకోర్టు స్వయంగా ఏర్పాటు చేసిన కమిటీ కావడంతో విచారణ పరుగులు పెడుతుందని టీడీపీ నాయకులు అంటున్నారు. కానీ, ఇక్కడ చిత్రం ఏంటంటే.. సుప్రీంకోర్టు ఎలాంటి టైం పెట్టకపోవడం! దీనిప్రకారం.. సీబీఐ అధికారులు ఏమేరకు తొందరగా ఈ కేసును ఛేదిస్తారో చూడాలి.