బిగ్ ఇష్యూ... విశాఖ డ్రగ్స్ కంటైనర్ కేసులో వీడిన సందిగ్ధత!
అందులోని ఓ కంటైనర్ లో డై ఈస్ట్ పేరుతో పెద్ద ఎత్తున కొకైన్ వచ్చిందని, దాని విలువ వేల కోట్లని ప్రచారం జరిగింది.
By: Tupaki Desk | 6 Dec 2024 5:15 PM GMTఅబద్ధం ఊరంతా తిరిగి వచ్చేసే సమయానికి నిజం చెప్పులు వేసుకుని బయలుదేరుతుందనేది సామెత! ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికలకు ముందు మార్చి నెలలో విశాఖ పోర్టుకు బ్రెజిల్ నుంచి ఓ షిప్ వచ్చింది. అందులోని ఓ కంటైనర్ లో డై ఈస్ట్ పేరుతో పెద్ద ఎత్తున కొకైన్ వచ్చిందని, దాని విలువ వేల కోట్లని ప్రచారం జరిగింది. ఇంకేముంది ఇదిగో తోక అదిగో పులి మొదలైంది!
దీనిపై పెద్ద ఎత్తున రాజకీయ విమర్శలు వెల్లువెత్తాయి. నాటి అధికారపక్షం - ప్రతి పక్షాల మధ్య తీవ్ర విమర్శలు తెరపైకి వచ్చాయి. దీంతో... ఈ వ్యవహారంపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దర్యాప్తు చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా విశాఖ పోర్టు డ్రగ్స్ కేసులో సీబీఐ విచారణ ముగిసింది! ఈ మేరకు కస్టమ్స్ ప్రిన్సిపల్ కమిషనర్ ఎన్ శ్రీధర్ కీలక విషయాలు వెల్లడించారు!
అవును... ఈ ఏడాది మార్చిలో విశాఖ పోర్టుకు వచ్చిన షిప్ లో డ్రై ఈస్ట్ పేరుతో పెద్ద ఎత్తున కొకైన్ వచ్చిందని, దాని విలువ వేల కోట్లు ఉంటుందని ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. అయితే.. తాజాగా ఆ 25 వేల టన్నుల డ్రగ్స్ కేసులో సీబిఐ విచారణ ముగిసింది. కంటైనర్ షిప్ లో ఎటువంటి డ్రగ్స్ లేవని సీబీఐ విచారణలో నిర్ధారించింది!
కాగా... బ్రెజిల్ లోని శాంటోస్ పోర్ట్ నుంచి కంటైనర్ డ్రై ఈస్ట్ బ్యాగ్ లతో విశాఖకు బయలుదేరిందని సీబీఐ అధికారులు గుర్తించారని.. ఈ కంటైనర్ సంధ్యా ఆక్వా పేరుతో బుక్ అయ్యిందని.. జర్మనీ పోర్టు మీదుగా వస్తున్న సమయంలో దీన్ని స్క్రీనింగ్ చేయగా ఇందులో మాదక ద్రవ్యాలు ఉన్నట్లు అనుమానించారని రకరకాల కథనాలు హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే.
అయితే... ఈ వ్యవహారంలో ఇంటర్ పోల్ అప్రమత్తమై సమాచారం ఇవ్వడంతో సీబీఐ రంగంలోకి దిగిన పరిస్థితి! ఇదే సమయంలో.. ఒక్కో బ్యాగులో ఎంత మేర డ్రగ్స్ ఉన్నాయనే లెక్కలు తేల్చాల్సి ఉందని.. ఈ డ్రగ్స్ ఖరీదైనవని కథనాలు విచ్చలవిడిగా వచ్చేవి. ఇందులో అంతర్జాతీయ నేర ముఠా ప్రమేయం ఉండొచ్చని రాసుకొచ్చారు! అయితే అలాంటివి ఏమీ లేవని సీబీఐ నిర్ధారించింది!