Begin typing your search above and press return to search.

పని చేయని సెమినార్ హాల్ డోర్ బోల్ట్.. మరి చిత్రహింస ఎవరికి వినపడలేదా?

యావత్ దేశాన్ని షాక్ కు గురి చేసిన కోల్ కతా వైద్య విద్యార్థిని హత్యాచారం రోజులు గడుస్తున్నా.. ఒక కొలిక్కి రావట్లేదు.

By:  Tupaki Desk   |   24 Aug 2024 3:46 AM GMT
పని చేయని సెమినార్ హాల్ డోర్ బోల్ట్.. మరి చిత్రహింస ఎవరికి వినపడలేదా?
X

యావత్ దేశాన్ని షాక్ కు గురి చేసిన కోల్ కతా వైద్య విద్యార్థిని హత్యాచారం రోజులు గడుస్తున్నా.. ఒక కొలిక్కి రావట్లేదు. ఆ మాటకు వస్తే.. రోజు గడిచి మరో రోజులో అడుగు పెట్టే వేళకు.. కొన్ని కొత్త సందేహాలు.. సరికొత్త అంశాలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా అలాంటి డెవలప్ మెంట్ ఒకటి వెలుగు చూసింది. హత్యాచారం జరిగిన సెమినార్ హాల్ డోర్ బోల్ట్ పని చేయటం లేదన్న విషయాన్ని సీబీఐ వెల్లడించింది.

సెమినార్ హాల్ కు డోర్ బెల్ట్ లేనప్పుడు.. హాల్ లోపల హత్యాచారం జరుగుతున్నప్పుడు.. శబ్దాలు ఎవరికి ఎందుకు వినిపించలేదు? అన్నది ఒక ప్రశ్న. ఇదంతా చూస్తే.. సెమినార్ హాల్ డోర్ బోల్ట్ విరిగిపోగా.. నేరం జరుగుతున్న వేళలో ఎవరూ లోపలకు వెళ్లకుండా ఉండేందుకు హాల్ బయట ఎవరైనా ఉన్నారా? ఈ కారణంగానే ఎవరికి తెలీకుండా మేనేజ్ చేశారా? అన్న ప్రశ్నలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి.

ఈ కొత్త సందేహానికి సమాధానం కోసం సీసీ పుటేజ్ ను జల్లెడ వేస్తున్నారు. బాధితురాలిని చిత్ర హింసలకు గురి చేస్తున్న వేళలో.. సెమినార్ హాల్ లోపల నుంచి శబ్దాలు వినిపించకపోవటం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నట్లుగా చెబుతున్నారు. అంతేకాదు.. డోర్ బోల్ట్ లేని విషయాన్ని జూనియర్ డాక్టర్లు.. సిబ్బంది తమకు చెప్పినట్లుగా సీబీఐ అధికారులు చెబుతున్నారు.

దీంతో.. హత్యాచార ఉదంతం జరిగిన ఇన్ని రోజుల తర్వాత.. సెమినార్ హాల్ డోర్ కు బోల్ట్ లేదన్న కీలక విషయం వెలుగు చూసింది. దీంతో.. సెమినార్ హాల్ బయట ఎవరో ఉండి ఉంటారన్న అనుమానం బలపడుతోంది. దీంతో.. ఇప్పటివరకు ఈ వ్యవహారంలో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ చుట్టూ తిరిగినప్పటికీ.. ఇంకొందరు ఉన్నారన్న దానికి సరైన ఆధారం లభించని పరిస్థితి. ఇలాంటి వేళలో.. తెర మీదకు వచ్చిన బోల్ట్ వ్యవహారం విచారణలో కొత్త అంశాల మీద ఫోకస్ చేసేలా చేస్తుందని చెప్పాలి.