దేశంలో తొలిసారి మాజీ గవర్నర్ ఇంట్లో సీబీఐ సోదాలు.. మోడీని విమర్శించడమే కారణమా?
తాజాగా ఓ మాజీ గవర్నర్ ఇంట్లో సీబీఐ సోదాలు చేపట్టింది. ఆయనే.. జమ్ము కశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్. మరి ఈయన ఇంట్లోనే సీబీఐ సోదాలు చేయడం వెనుక కారణమేంటి?
By: Tupaki Desk | 22 Feb 2024 12:30 PM GMTదేశంలో సంచలనం చోటు చేసుకుంది. ఇప్పటి వరకు జరగని ఘటన జరిగింది. దేశంలో గవర్నర్‌లుగా పనిచేసి పదవీ విరమణ పొందిన వారిపై ఆరోపణలువచ్చిన సందర్భాల్లో కూడా జరగని విధంగా.. తాజాగా ఓ మాజీ గవర్నర్ ఇంట్లో సీబీఐ సోదాలు చేపట్టింది. ఆయనే.. జమ్ము కశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్. మరి ఈయన ఇంట్లోనే సీబీఐ సోదాలు చేయడం వెనుక కారణమేంటి? ఎందుకు అనేది ఆసక్తిగా మారింది.
ఏం జరిగింది?
జమ్ము కాశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ ఇంట్లో సీబీఐ అధికారులు సోదాలు చేస్తున్నారు. జల విద్యుత్ ప్రాజెక్టు కాంట్రాక్టుకు సంబంధించి ఆయన గవర్నర్‌గా ఉన్నసమయంలో ఇచ్చిన అనుమతుల పై ఆరోపణలు వచ్చాయి. దీనిపై గతంలోనే సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో గురువారం ఉదయం నుంచి ఢిల్లీతో పాటు వివిధ ప్రాంతాల్లో సత్యపాల్ మాలిక్‌కు సంబంధించిన 30 మంది బంధువులు, స్నేహితుల ఇళ్లలోనూ తనిఖీలు కొనసాగుతున్నాయి. సుమారు 100 మంది సీబీఐ అధికారులు ఈ సోదాల్లో పాల్గొన్నారు.
ఏంటి ఆరోపణ?
సత్యపాల్ మాలిక్.. గవర్నర్‌గా ఉన్న సమయంలో 2,200 కోట్ల రూపాయల విలువైన 'కిరు హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్టు' నిర్మాణ పనులకు సంబంధించి అనుమతులు ఇచ్చారు. అయితే.. ఈ విషయంలో భారీగా అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంపై 2022వ సంవత్సరం ఏప్రిల్ నెలలో సత్యపాల్ మాలిక్ సహా ఐదుగురిపై సీబీఐ కేసు ఫైల్ చేసింది. 2018 ఆగస్టు 23 నుంచి 2019 అక్టోబర్ 30 వరకు ఆయన జమ్ముకశ్మీర్ గవర్నర్‌గా పని చేశారు. అయితే, సీబీఐ సోదాలపై సత్యపాల్ రియాక్ట్ అయ్యారు. తాను అనారోగ్యంతో బాధపడుతున్న సమయంలో.. తన నివాసంపై నిరంకుశ శక్తులు దాడులు చేస్తున్నాయని మండిపడ్డారు.
ఎవరీ సత్యపాల్?
సత్యపాల్ మాలిక్ బీజేపీ నాయకుడు. పైగా.. ప్రధాని నరేంద్ర మోడీకి ఒకప్పటి సన్నిహితుడు. ఈక్రమంలో నే ఆయనను 2018 ఆగస్టులో జమ్ము కశ్మీర్‌కు గవర్నర్‌గా నియమించారనే వాదన ఉంది. అయితే.. తర్వాత కాలంలో మాలిక్.. ప్రధానిని వ్యతిరేకించారు. ఆయన నిర్ణయాలను తప్పుబట్టారు. ముఖ్యంగా జమ్ము కశ్మీర్ కు సంబంధించి ఆర్టికల్ 370ని రద్దు చేసే ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించారు. తరచుగా మోడీ సర్కారుపైనా.. ఆయన విధానాలపై నా విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలోనే గవర్నర్ పదవినుంచి ఆయనను తప్పించారు. ఆ తర్వాత కూడా మాలిక్ మోడీ టార్గెట్‌గా విమర్శలుచేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఇంట్లో సోదాలు చేపట్టారనే విమర్శలు వస్తున్నాయి.