చంద్రబాబు ఎత్తు.. పవన్ చిత్తు చిత్తు!
తాజాగా ప్రకటించిన టీడీపీ - జనసేన అభ్యర్థుల తొలి జాబితాపై రకరకాల హాట్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగా పవన్ కల్యాణ్ కు న్యాయం చేసిన చంద్రబాబు.
By: Tupaki Desk | 24 Feb 2024 8:50 AM GMTఎన్నికలు సమీపిస్తుండటం.. మరోపక్క అభ్యర్థుల ప్రకటన జాప్యంపై వైసీపీ ర్యాగింగ్ నడుమ తాజాగా టీడీపీ - జనసేన అభ్యర్థుల తొలి జాబితా విడుదలయ్యింది. ఇందులో భాగంగా... మొత్తం 118 సీట్లకు అభ్యర్థులను కన్ ఫాం చేసినట్లు ప్రకటించిన చంద్రబాబు... వీటిలో టీడీపీకి 94, జనసేనకు 24 సీట్లు ఇస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఈ వ్యవహారంపై హాట్ కామెంట్స్ తెరపైకి వస్తున్నాయి.
అవును... తాజాగా ప్రకటించిన టీడీపీ - జనసేన అభ్యర్థుల తొలి జాబితాపై రకరకాల హాట్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగా పవన్ కల్యాణ్ కు న్యాయం చేసిన చంద్రబాబు.. కాపులకు అన్యాయం చేశారనే మాట వినిపిస్తుండటం గమనార్హం!! ఇప్పటికే ప్రకటించిన 118 స్థానాల్లోనూ కేవలం 24 స్థానాలు మాత్రమే కేటాయించారు. దీంతో కాపు సమాజం ఫైరవుతుందని తెలుస్తుంది!
ఈ నేపథ్యంలో... చంద్రబాబు మళ్ళీ తన సహజ నైజాన్ని బయటపెట్టుకున్నారనే కామెంట్లు తెరపైకి వస్తున్నాయి. ఎవరు ఏమనుకున్నా, పైకి ఎన్ని నీతులు వల్లించినా... ఫైనల్ గా తనకు, తన పార్టీకి లబ్ది చేకూరేలా మాత్రమే చంద్రబాబు పొత్తులు ప్లాన్ చేస్తారనే విషయం తాజాగా జనసేన విషయంలోనూ కన్ ఫాం అయ్యిందని అంటున్నారు.
ఈ సందర్భంగా... ఈ విషయం పవన్ కి తెలియంది కాదు.. ఎవరి బలహీనతలు వారికుంటాయనే కామెంట్లూ వినిపిస్తున్నాయి. తాజాగా... తెలుగుదేశం వాటాకింద వచ్చిన 94 స్థానాలకూ అభ్యర్థుల పేర్లను సైతం ప్రకటించారు.. కానీ జనసేన వాటాలోని 24 సీట్లలో కేవలం ఐదుగురి పేర్లు మాత్రమే ప్రకటించారు. మిగిలిన 19 స్థానాల్లో ఎవరు ఉంటారన్నది తేల్చలేదు.
అంటే... అక్కడ కూడా చంద్రబాబు సూచించినవాళ్లనే జనసేన తరఫున పోటీ చేయిస్తారా అనే సందేహం ఇప్పుడు తెరపైకి వచ్చింది. ఇక మిగిలిన సీట్ల విషయానికొస్తే... జనసేన, టీడీపీ కూటమి 57 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. వాటిలో జనసేనకు ఎన్ని ఇస్తారు అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారిందని అంటున్నారు! అసలు ఇస్తారా, ఇంతటితో సరిపెట్టేస్తారా అనేది మరో ప్రశ్న!
ఏదిఏమైనా పవన్ కళ్యాణ్ కు, కాపులకు చంద్రబాబు మరోసారి పోటు పొడిచినట్లే క్యాడర్ భావిస్తోందని తెలుస్తుంది. ఇదిలా ఉండగా టీడీపీ ప్రకటించిన సీట్లలో చంద్రబాబు, అచ్చెన్నాయుడు, లోకేష్, బాలకృష్ణ వంటి ప్రముఖుల పేర్లు ఉన్నాయి.. కానీ జనసేన తరఫున ఐదుగురి పేర్లు చెప్పినా అందులో పవన్ పేరు లేదు. అంటే అయన ఎక్కడ పోటీ చేస్తారన్నది మాత్రం చెప్పలేదు. బహుశా ఇంకా కన్ ఫాం కాలేదేమో!
దీంతో... ఆఖరుకు జనసేనాని పవన్ కళ్యాణ్ తన సీటు తాను ప్రకటించుకోలేని స్థితిలో పొత్తుకు సిద్ధమై చంద్రబాబుకు తలొగ్గారనే కామెంట్లు ఇప్పుడు జనసైనికులు, పార్టీ మద్దతుదారులు నుంచి బలంగా వినిపిస్తున్నాయి. దీంతో... పొత్తు వ్యవహారంపై జనసేన మద్దతుదారులు పెదవి విరుస్తున్నారని తెలుస్తుంది!