సుజాతకు చెక్.. చింతలపూడి ఇంచార్జిని ప్రకటించిన చంద్రబాబు
అయితే.. కీలకమైన ఓకేసులో తీవ్ర ఆరోపణలు రావడం.. ప్రతిపక్షాలు ఆందోళన చేయడంతో ఆమెను తప్పించిన చంద్రబాబు.. అప్పటి నుంచి పక్కన పెడుతూనే ఉన్నారు.
By: Tupaki Desk | 21 Feb 2024 12:30 PM GMTపశ్చిమ గోదావరి జిల్లాలోని ఎస్సీ నియోజకవర్గం చింతలపూడి ఇంచార్జ్‌ని టీడీపీ అధినేత చంద్రబాబు ఖరా రు చేశారు. మాల సామాజిక వర్గానికి చెందిన సొంగా రోషన్ కుమార్‌ని ఇక్కడకు పంపిస్తున్నట్టు పేర్కొన్నా రు. ఈ మేరకు టీడీపీ రాష్ట్ర చీఫ్.. కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ఆయన నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందన్నారు. అయితే.. ఈ ఈక్వేషన్‌పై విమర్శలు వస్తున్నాయి. ఇప్పటి వరకు నియోజక వర్గం లో పార్టీని ముందుకు నడిపించడంలో మాజీ మంత్రి పీతల సుజాత కీలకంగా వ్యవహరించారు.
2009లో ఆచంట నియోజకవర్గం నుంచి విజయం దక్కించుకున్న పీతల సుజాత.. అనూహ్య కారణాలతో 2014లో చింతలపూడి నుంచి పోటీ చేసి విజయం దక్కించుకున్నారు. ఈ క్రమంలోనే ఆమెకు చంద్రబాబు మంత్రి పదవి కూడా ఇచ్చారు. అయితే.. కీలకమైన ఓకేసులో తీవ్ర ఆరోపణలు రావడం.. ప్రతిపక్షాలు ఆందోళన చేయడంతో ఆమెను తప్పించిన చంద్రబాబు.. అప్పటి నుంచి పక్కన పెడుతూనే ఉన్నారు. 2019లో తిరిగి టికెట్ ఇస్తారని అనుకున్నా.. చంద్రబాబు ఆమెకు అవకాశం ఇవ్వలేదు.
అయినప్పటికీ.. నియోజకవర్గంలోనే సుజాత కొనసాగారు. వేరేవారికి టికెట్ ఇచ్చినా.. ఆమె తిరిగారు. ఇక, ఇక్కడ టీడీపీ ఓడిపోయింది. తర్వాత టికెట్ దక్కించుకున్న నాయకుడు పార్టీని వీడిపోయినా.. సుజాత మాత్రం ఇక్కడ పార్టీ తరఫున కార్యక్రమాలు నిర్వహించారు. బాబు ష్యూరిటీ, భవిష్యత్తుకు గ్యారెంటీ సభల్లోనూ ఆమె పాల్గొన్నారు. నియోజకవర్గంలోనూ చక్రం తిప్పుతున్నారు. దీంతో ఆమెకు టికెట్ గ్యారెంటీ అని అనుకుంటున్న తరుణంలో అనూహ్యంగా సొంగా రోషన్ కుమార్ పేరును ప్రతిపాదించారు.
సుజాతకు టికెట్ ఇవ్వకపోవడానికి కారణాలు ఇవేనా?
+ ఎస్సీల్లో ఆమెపై సానుభూతి తగ్గడం.
+ చంద్రబాబు చేపట్టిన సర్వేల్లో మార్కులు పడకపోవడం.
+ ఆర్థికంగా బలంగా లేకపోవడం.
+ టీడీపీలో నేతలను కలుపుకొని వెళ్లకపోవడం.
+ పార్టీ కేడర్‌లోనూ సుజాతపై అసంతృప్తి.