Begin typing your search above and press return to search.

బాబు ఈజ్ బ్యాక్... అసెంబ్లీలోకి సీఎం గానే !

ఏపీ అసెంబ్లీలో దాదాపుగా రెండున్నరేళ్ళ క్రితం టీడీపీ అధినేత చంద్రబాబు ఒక భీషణ ప్రతిన చేశారు.

By:  Tupaki Desk   |   4 Jun 2024 5:29 AM GMT
బాబు ఈజ్ బ్యాక్... అసెంబ్లీలోకి సీఎం గానే !
X

ఏపీ అసెంబ్లీలో దాదాపుగా రెండున్నరేళ్ళ క్రితం టీడీపీ అధినేత చంద్రబాబు ఒక భీషణ ప్రతిన చేశారు. అది 2021లో జరిగిన శాసనసభ వర్షాకాల సమావేశం. ఆ సమావేశంలో బాబు గట్టి శపధం చేశారు. దాని ప్రకారం చూస్తే తనను అవమానించిన సభను ఆయన కౌరవ సభగా అభివర్ణించారు. మళ్లీ తాను ముఖ్యమంత్రిగానే సభలోకి ప్రవేశిస్తాను అని బాబు గట్టిగా చాటారు.

ఆ తరువాత బాబు రెండున్నరేళ్ళ పాటు అసెంబ్లీ ముఖం చూడలేదు. బాబు సీఎం గానే సభలోకి రాబోతున్నారు అన్నది కౌంటింగ్ తరువాత చూస్తే అంచనాలు చెబుతున్నాయి. అది కూడా చంద్రబాబు సైతం ఊహించని విధంగా కనీ వినీ ఎరుగని తీరులో ఏపీలో అధ్బుతమైన విజయాన్ని టీడీపీకి ప్రజలు కట్టబోతున్నారు. మొత్తం 144 అసెంబ్లీ సీట్లలో పోటీ చేసిన టీడీపీకి వందకు పైగా సీట్ల నుంచి ఇంకా ఎక్కువగానే సీట్లు అందించే విధంగానే రిజల్ట్స్ ఉండబోతున్నాయని అంటున్నారు.

ఏపీలో శపధం చేసి అసెంబ్లీలో తిరిగి అడుగు పెట్టిన వారిలో మొదట ఎన్టీఆర్ ఉంటే ఆ తరువాత జగన్ నిలిచారు. ఇపుడు శపధం నెరవేర్చుకుని చంద్రబాబు ఆ లిస్ట్ లోకి చేరబోతున్నారు. అంతే కాదు ఆయన ఏడున్నర పదుల వయసులో ఏపీకి నాలుగవ సారి ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఈ రికార్డు కూడా బహుశా ఎవరికీ ఉండకపోవచ్చు అని అంటున్నారు.

ఏపీలో చూస్తే చంద్రబాబు గత అయిదేళ్ళుగా అవిశ్రాంతంగా పోరాటం చేశారు అని చెప్పాలి. ఆయన ఘోర ఓటమి నుంచి వెంటనే తేరుకుని జనంలోనే ఉన్నారు. అంతే కాదు ఎవరూ తిరగనన్ని సార్లు ఆయన ఏపీలో సుడిగాలి పర్యటనలు చేశారు. ఈ వయసులో బాబు జనంలో తిరగడం కష్టపడడం వంటి వాటికి సరైన ఫలితం వచ్చిందనే అంటున్నారు.

జనాలు కూడా బాబుని గట్టిగా విశ్వసించారు అని అంటున్నారు. ఏపీలో అభివృద్ధి లేదని అలాగే ఏపీలో శాంతిభద్రతలు లేవని ఏపీలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేవని చంద్రబాబు చేసిన ప్రచారానికి జనాల నుంచి అంతే స్థాయిలో ప్రతిస్పందన లభించింది అని అంటున్నారు.

దాంతోనే ఎన్నడూ లేని విధంగా టీడీపీ కూటమికే ఓటర్లు మద్దతుగా నిలుస్తున్నారు అని అంటున్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఇది చంద్రబాబు విజయంగానే ఆయన ఖాతాలోనే వేయాలని అంటున్నారు. మిగిలిన వారు అంతా పక్కన ఉండవచ్చు కానీ అందరినీ ఏకం చేసి అంతా తాను అయి కూటమికి కేంద్ర బిందువుగా నిలిచిన చంద్రబాబుకే ఈ విషయంలో పెద్ద పీట వేయాల్సిన అవసరం ఉందని అంటున్నారు.

మొత్తం మీద చూస్తే ఏపీలో రాజకీయం మార్చిన ఘనత బాబుకే దక్కుతుంది. ఆయన గేరు మార్చారు. సైకిల్ స్పీడ్ పెంచారు. ఈసారి కొత్త బాబుని జనాలు చూస్తారు అని కూడా అంటున్నారు. చూడాలి మరి ఏమి జరగనుందో.