జనంతోనే చంద్రబాబు పందెం...సంచలన నిర్ణయం దిశగా...!?
ప్రజలు నన్ను గెలిపించాలి అని ఆయన చాలా తక్కువ సందర్భాలలో మాట్లాడుతారు. అదే టైం లో రాజకీయాల్లో తనదైన స్ట్రాటజీలను ఆయన నమ్ముకుని అనేక సార్లు సక్సెస్ అయ్యారు.
By: Tupaki Desk | 2 Feb 2024 3:34 AM GMTటీడీపీ అధినేత చంద్రబాబు ఎపుడూ పొత్తుల మీద ఆధారపడతారు అని పేరు. ఆయన విజయం కోసం వ్యూహాలనే బాగా విశ్వసిస్తారు. ప్రజలు నన్ను గెలిపించాలి అని ఆయన చాలా తక్కువ సందర్భాలలో మాట్లాడుతారు. అదే టైం లో రాజకీయాల్లో తనదైన స్ట్రాటజీలను ఆయన నమ్ముకుని అనేక సార్లు సక్సెస్ అయ్యారు.
అయితే ఎన్ని వ్యూహాలు ఉన్నా ప్రజలే అల్టిమేట్ అన్నది అంతా అంగీకరించాల్సిందే. వారు తలచుకుంటేనే ఎవరికైనా గెలుపు. వారు ఆదరిస్తేనే ఎవరైనా అందలం అందుకుంటారు. కానీ రాజకీయ గణిత శాస్త్రాన్ని నిండా చదివేసిన చంద్రబాబు రెండు ప్లస్ రెండు నాలుగు లేకపోతే ఆరు ఎనిమిది అవుతాయని ఇలాగే భావిస్తూ తన నాలుగున్నర రాజకీయ జీవితాన్ని నెట్టుకుంటూ వచ్చారు.
ఇవన్నీ ఇలా ఉంటే కొన్ని ఎన్నికలు మాత్రం చంద్రబాబుకు రెండు రెండూ జీరో అని కూడా నిరూపించాయి. అవి 2004, 2009 ఎన్నికలు. సరే 2019 ఎన్నికలు ఎటూ చేదు జ్ఞాపకాలను ఆయనకి బాగా మిగిల్చాయి. అది వేరే విషయం అనుకోండి. ఇపుడు 2024 ఎన్నికలు ఈసారి ఎట్టి పరిస్థితులలోనూ పొత్తులతోనే ముందుకు పోవాలని బాబు గట్టిగా తీర్మానించుకున్నారు అన్నది తెలిసిందే.
ఆ దిశగా ఆయన చేసిన ప్రయత్నాలకు జనసేన నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ లభించడంతో బాబు ప్లాన్ ఏ ఇబ్బంది లేకుండా సక్సెస్ అయింది. ఈ నేపథ్యంలో బీజేపీ మాత్రం బెట్టు చేస్తోంది. కాస్తా ట్రబుల్ ఇచ్చేలా వ్యవహరిస్తోంది. ఇంకో వైపు పొత్తులు కూడా అధికారాన్ని అందిస్తాయా అన్న డౌట్లూ టీడీపీలో ఉన్నాయి.
జనసేనతో పొత్తు అంటే అది జూనియర్ పార్టనర్ కాదు, సమాన ఉజ్జీ లాంటి పార్టీ కాదు, దాంతో ఆ పార్టీతో కొత్త అనుభవంగానే ఉంది. మరో వైపు ఎన్నికలు ముంచుకువస్తున్నా కూడా టీడీపీకి ఎడ్జి ఉంటుందని అధిక శాతం సర్వేలు చెప్పడంలేదు. దాంతో బాబుకు కంగారు అయితే ఉంది అంటున్నారు.
ఈ పరిణామాల నేపధ్యంలో చంద్రబాబు తాజాగా ఒక మీడియా చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఏపీ ప్రజలు మరోసారి కూడా తనను తిరస్కరిస్తే మాత్రం తాను రాజకీయాల నుంచే తప్పుకుంటాను అని భారీ శపధం చేసారు.
ఇదిపుడు చర్చకు దారి తీస్తోంది. బాబు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు. ఆయనకు గెలుపు మీద నమ్మకం లేదా లేక సర్వే నివేదికలు ఏమైనా ఆయన దగ్గర ఉన్నాయా అన్నది కూడా ఆలోచిస్తున్నారు. ప్రజలు తిరస్కరిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటాను అని అనడంలోనూ రాజకీయ వ్యూహాలు ఉన్నాయని అంటున్నారు.
ఆ విధంగా ప్రజల సానుభూతి పొందడమే బాబు ఆలోచన అని వైసీపీ నుంచి కామెంట్స్ వస్తున్నాయి. ఏది ఏమైనా ఇన్నాళ్ళకు చంద్రబాబు జనాలతో పందెం కాశారు. వారే తనను గెలిపించే వారు అని అంటూనే వారు ఏమైనా వ్యతిరేకంగా చేస్తే ఇక నో పాలిటిక్స్ అంటూ ఎమోషనల్ టచ్ ఇచ్చేలా మాట్లాడుతున్నారు. మరి బాబు అన్న ఈ కామెంట్స్ వైసీపీ అనుకూల మీడియా విపరీతంగా వైరల్ చేస్తోంది. బాబుకు ఓటమి భయం పట్టుకుంది అంటోంది.
ఇవన్నీ పక్కన పెడితే ఎన్నికల్లో గెలుపోటములు సహజం. దానికి రాజకీయాలకు ముడిపెట్టడం ఎంతవరకూ సమంజసం అన్న వారూ ఉన్నారు. బాబుకు వరసగా రెండుసార్లు ఓడడం అన్నది గతంలో జరగలేదా అన్న వారూ ఉన్నారు. అందువల్ల గెలుపు కోసమే కృషి చేయాలి ఫలితం ఎలా వచ్చినా రాజకీయాల్లోనే ఆయన కొనసాగాలి అన్నదే అందరి మాటగా ఉంది.