Begin typing your search above and press return to search.

ఆ విషయంలో జగన్ కంటే ఒక్క పోస్ట్ తక్కువిచ్చిన బాబు!

అవును... ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఈ సందర్భంగా చంద్రబాబు కేబినెట్ లో ముగ్గురు మహిళలకు మంత్రులుగా అవకాశం దక్కింది.

By:  Tupaki Desk   |   12 Jun 2024 10:07 AM GMT
ఆ విషయంలో జగన్ కంటే ఒక్క పోస్ట్ తక్కువిచ్చిన బాబు!
X

ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఈ సందర్భంగా.. రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయగా... మంత్రిగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రమాణం చేశారు. కేసరపల్లిలో అట్టహాసంగా జరిగిన ఈ వేడుకలో చంద్రబాబు, పవన్ లతో పాటు మరో 23మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. వీరిలో ముగ్గురు మహిళలు ఉండటం గమనార్హం.

అవును... ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఈ సందర్భంగా చంద్రబాబు కేబినెట్ లో ముగ్గురు మహిళలకు మంత్రులుగా అవకాశం దక్కింది. కాగా.. గతంలోని జగన్ కేబినెట్ లో నలుగురు మహిళలలకు మంత్రులుగా అవకాశం దక్కిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... ఆర్కే రోజా, తానేటి వనిత, విడదల రజనీ, ఉషశ్రీ చరణ్ లు గతంలో మంత్రులుగా పనిచేశారు.

ఇప్పుడు కొత్తగా కొలువుదీరిన చంద్రబాబు కేబినెట్ లో వంగలపూడి అనిత, గుమ్మడి సంద్యారాణి, ఎస్ సవిత మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.

వంగలపూడి అనిత:

పాయకరావుపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలిచిన వంగలపూడి అనిత... ఉమ్మడి విశాఖ జిల్లా రాజవరంలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తూనే రాజకీయాల్లో అడుగుపెట్టారు. ఇందులో భాగంగా... 2014 ఎన్నికల్లో పాయకరావుపేట నుంచి పోటీ చేసి తొలిసారీ విజయం సాధించిన ఆమె 2018లో టీటీడీ బోర్దు సభ్యురాలిగా నియమితులయ్యారు.

2019 ఎన్నికల్లో కొవ్వూరు నుంచి పోటీ చేసి ఓటమిపాలైన తర్వాత ఏపీ టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలిగా పనిచేశారు. ఈ క్రమంలో తాజా ఎన్నికల్లో పాయకరావుపేట నుంచి 43,727 ఓట్ల మెజారిటీతో గెలిచి.. తాజాగా మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.

గుమ్మడి సంద్యారాణి:

సాలూరు నియోజకవర్గం నుంచి గెలిచిన గుమ్మడి సంధ్యారాణి.. తొలుత ఉపాధ్యాయురాలిగా పనిచేశారు. అనంతరం రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఆమె... 1999లో కాంగ్రెస్ నుంచి పోటి చేసి ఓటమిపాలయ్యారు. అనంతరం ఆ పార్టీని వీడి టీడీపీలో జాయిన్ అయ్యారు.

ఈ క్రమంలో 2009 అసెంబ్లీ, 2014 లోక్ సభ ఎన్నికల్లోనూ ఓటమిపాలయ్యారు. అయితే... 2015లో టీడీపీ నుంచి శాసనమండిలికి ఎన్నికయ్యారు. ఈసారి మాత్రం... 13,733 ఓట్ల మెజారిటీతో గెలిచి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

ఎస్ సవిత:

పెనుగొండ నియోజకవర్గం నుంచి గెలిచిన సవిత... అప్పట్లో మంత్రిగా, ఎంపీగా పనిచేసిన ఎస్ రామచంద్రారెడ్డి వారసురాలిగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ క్రమంలో 2017-19 మధ్య రాష్ట్ర కురుబ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్ పర్సన్ గా పనిచేశారు. ఇదే సమయలో తన తండ్రి పేరుమీద ఎస్.ఆర్.ఆర్. ఫౌండేషన్ ఏర్పాటుచేసి సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.