ముందస్తు ప్రకటనకు రెడీ అవుతున్నారా ?
రాబోయే ఎన్నికలకు సంబంధించి అభ్యర్ధుల ముందస్తు ప్రకటన చేయాలని చంద్రబాబునాయుడు ఆలోచిస్తున్నారట.
By: Tupaki Desk | 6 Dec 2023 5:30 PM GMTరాబోయే ఎన్నికలకు సంబంధించి అభ్యర్ధుల ముందస్తు ప్రకటన చేయాలని చంద్రబాబునాయుడు ఆలోచిస్తున్నారట. టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. పొత్తులో జనసేనకు కేటాయించాల్సిన స్ధానాలెన్ని, ఆ నియోజకవర్గాలు ఏవి అన్న విషయంలో చంద్రబాబుకు క్లారిటి ఉంది. అయితే ఆ విషయాన్ని ఇప్పటివరకు చంద్రబాబు ప్రకటించలేదు. చంద్రబాబు, పవన్ భేటీలో కూడా ఈ విషయం ఫైనల్ అయిపోయుండచ్చు. పవన్ కూడా ఈ విషయంలో ఎలాంటి ప్రకటనచేయలేదు.
వచ్చే ఫిబ్రవరిలో ఎన్నికల నోటిపికేషన్ వస్తుందని అనుకుంటున్నారు. ఒకసారి నోటిపికేషన్ విడుదలైందంటే ఎన్నికల ప్రక్రియ మొదలైపోయినట్లే. అప్పటినుండి అందరు ఎన్నికల మూడ్ లోకి వెళ్ళిపోతారు. అందుకనే నోటిఫికేషన్ను దృష్టిలో పెట్టుకుని జనవరిలోనే కొందరు అభ్యర్ధులను ప్రకటించాలని చంద్రబాబు అనుకున్నట్లు పార్టీవర్గాల సమాచారం. సిట్టింగ్ ఎంఎల్ఏలు 19 మందికి మళ్ళీ టికెట్లు ఇవ్వబోతున్నట్లు చంద్రబాబు గతంలోనే చాలా సందర్భాల్లో ప్రకటించారు. అంటే 19 నియోజకవర్గాల్లో అభ్యర్ధులను ప్రకటించేసినట్లే లెక్క.
175లో 19 పోను మిగిలిన 156 నియోజకవర్గాల్లోనే జనసేనకు కూడా సీట్లు కేటాయించాల్సుంటుంది. జనసేనకు 30 సీట్ల మధ్య కేటాయించే అవకావాలున్నాయని బాగా ప్రచారం జరుగుతోంది. పోటీచేసే విషయంలో రెండు పార్టీల నేతలు పట్టుబడుతున్న నియోజకవర్గాలను వదిలేసి మిగిలిన వాటిలో కనీసం 80 నియోజకవర్గాల్లో అభ్యర్ధులను జనవరిలో ప్రకటించాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారట. మామూలుగా అయితే నామినేషన్ గడువు ముగిసే చివరివరకు అభ్యర్ధులను ప్రకటించే అలవాటు చంద్రబాబుకు లేదు. దానికి భిన్నంగా ఈసారి ముందస్తుగా అభ్యర్ధులను ప్రకటించబోతున్నట్లు పార్టీలో టాక్ వినబడుతోంది.
అభ్యర్ధులను ముందుగా ప్రకటించేస్తే నియోజకవర్గాల్లో విస్తృతంగా ప్రచారం చేయటానికి కావాల్సినంత సమయం ఉంటుందన్నది అసలు ఉద్దేశ్యం. అలాగే అసంతృప్తులను బుజ్జగించి దారికి తెచ్చుకునే అవకాశాలు కూడా ఉంటాయని అనుకుంటున్నారట. రెండుపార్టీలు కలిసి ఎన్నికలకు వెళుతున్న దృష్ట్యా అభ్యర్ధుల ముందస్తు ప్రకటన లేకపోతే చివరలో సమస్యలు తలెత్తుతుందని చంద్రబాబు అనుమానిస్తున్నారట. అందుకనే రెండుపార్టీల్లో అసంతృప్తులు, తిరుగుబాట్లు లేకుండా చూసుకోవాలంటే ముందస్తు అభ్యర్ధుల ప్రకటనే మంచిదని చంద్రబాబు డిసైడ్ అయ్యారు. మరి చివరకు ఏమిచేస్తారో చూడాల్సిందే.