చంద్రబాబు కేసు : అవినీతి మీద కాదు... దాని మీదేనా...?
నేరం చేసిన వారిని పరిరక్షించడానికి ఈ సవరణ పార్లమెంట్ చేయలేదని ఆయన కోర్టు దృష్టికి తెసుకుని వచ్చారు.
By: Tupaki Desk | 10 Oct 2023 12:34 PM GMTమాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కేసు విషయంలో ఇపుడు ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. చంద్రబాబు గత నెల 9న నంద్యాలలో అరెస్ట్ అయ్యారు. ఆయన అరెస్ట్ అక్రమం అని గత నెల రోజులుగా ఆయన తరఫున న్యాయవాదులు కోర్టులలో వాదిస్తున్నారు. ఈ నెల రోజులూ చంద్రబాబు రిమాండ్ ఖైదీగా రాజమండ్రి జైలులో ఉన్నారు. మరో వైపు చూస్తే చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్ ని హైకోర్టు కొట్టేసింది.
దాన్ని సుప్రీం కోర్టులో సవాల్ చేసిన బాబు తరఫున న్యాయవాదులు అక్కడ కూడా టెక్నికల్ పాయింట్ మీదనే వాదిస్తున్నారు. 17ఏ అన్న దాని ప్రకారం బాబుని ఎలా అరెస్ట్ చేస్తారు గవర్నర్ పర్మిషన్ తీసుకోవాలని అంటున్నారు. నేరం జరిగింది 2018కి ముందు అయినా విచారణ తరువాత జరిగింది కాబట్టి బాబు విషయం గవర్నర్ కి తెలియచేయాలని అలా అరెస్ట్ చెల్లదు అన్న పాయింట్ మీదనే రోజుల తరబడి వాదిస్తున్నారు.
ఇక్కడ మ్యాటర్ ఏంటి అంటే స్కిల్ స్కాం లో బాబు పాత్ర ఎంత ఆయన నిజంగా ఇందులో ఏమైనా అవినీతికి పాల్పడ్డారా లేక ఆయన క్లీన్ గా ఉన్నారా అన్న దాని మీద ఆయన కేసులో వాదనలు జరగడంలేదు. నిజంగా ఇది ఆశ్చర్యకరమే. ఇక ఇపుడు 17ఏ అన్న పీసీ యాక్ట్ లో సవరణ విషయానికి వస్తే పొరపాటున కానీ లేక కక్షపూరితంగా కానీ లేక కావాలని కానీ ఈ కేసులో ఎవరైనా నిజాయతీపరులను ఇరికించి ఉంటే కనుక వారికి రక్షణ కవచంగా ఈ సవరణ పనిచేస్తుంది అని న్యాయ నిపుణులు అంటున్నారు.
ఇదే పాయింట్ మీద సుప్రీం కోర్టులో సీఐడీ తరఫున వాదించిన ముకుల్ రోహత్గి చెప్పుకొచ్చారు. నేరం చేసిన వారిని పరిరక్షించడానికి ఈ సవరణ పార్లమెంట్ చేయలేదని ఆయన కోర్టు దృష్టికి తెసుకుని వచ్చారు. ఇక 17ఏ బాబుకు వర్తించదు అని ఆయన అంటున్నారు 2018కి ముందే జీఎస్టీ ఈ కేసులో విచారణ జరిపిందని ఆయన కోర్టుకు తెలిపారు. ఆనాడు సీఎం గా చంద్రబాబు ఉన్నారని విచారణ అయితే తరువాత దశ అన్నది ఏమైందో చూడాలని అన్నారు.
సరే ఇరు పక్షాల వాదనల సంగతి ఎలా ఉన్నా నేరం జరిగిందా లేదా అన్నది ఎప్పుడైనా పాయింట్ గా ఉంటుంది. టెక్నికల్ రీజన్స్ బట్టి అసలు కేసే పెట్టరాదని వాదించడం మీద న్యాయ నిపుణుల మధ్య చర్చ సాగుతోంది. ఏది ఏమైనా ఈ కేసులో బాబు రిమాండ్ రిపోర్టుని కొట్టివేయాలని ఆయన న్యాయవాదులు పోరాడుతున్నారు.
అయితే సుప్రీం కోర్టులో వాదనలు మాత్రం జరుగుతున్నాయి. శుక్రవారం మధ్యాహ్నానికి ఈ కేసు విచారణ వాయిదా పడింది. మరి ఆ రోజు అయినా దీని మీద ఏమైనా జరుగుతుందా లేక సోమవారానికి వాయిదా పడుతుందా అన్నది చూడాల్సి ఉంది. ఏది ఏమైనా 17ఏ అన్న పీసీ చట్ట సవరణ మీద వాదనలు రేపటి కేసులకు కూడా ఉపయోగపడతాయేమో అంటున్నారు.