బ్రాహ్మణికి పార్టీ బాధ్యతలు?... బాబు రియాక్షన్ ఇదే!
ఇదే క్రమంలో తాజాగా శనివారం మరోసారి హైదరాబాద్ లోని ఎన్టీఆర్ భవన్ కు వెళ్లారు చంద్రబాబు. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
By: Tupaki Desk | 11 Aug 2024 4:05 AM GMTఏపీలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ చంద్రబాబు తెలంగాణలోనూ పార్టీ అభివృద్ధిపై దృష్టిపెట్టిన సంగతి తెలిసిందే. నాటి నుంచీ రెగ్యులర్ గా తెలంగాణ టీడీపీ కార్యకర్తలు, నేతలను కలుస్తున్నారు. పార్టీ అభివృద్ధి గురించి దిశానిర్ధేశం చేస్తున్నారు. ఇదే క్రమంలో తాజాగా శనివారం మరోసారి హైదరాబాద్ లోని ఎన్టీఆర్ భవన్ కు వెళ్లారు చంద్రబాబు. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అవును... ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చంద్రబాబు రెండోసారి టీడీపీ భవన్ కి వచ్చారు. ఈ సందర్భంగా జూబ్లిహిల్స్ లోని తన నివాసం నుంచి ట్రస్ట్ భవన్ కు ర్యాలీగా బయలుదేరారు. అనంతరం తెలంగాణ నేతలతో భేటీ అయిన బాబు.. తెలంగాణ టీడీపీ నూతన అధ్యక్షుడు, పార్టీ బలోపేతం, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ మొదలైన విషయాలపై చర్చించినట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో పార్లమెంట్, అసెంబ్లీ సెగ్మెంట్స్ వారీగా ఉన్న కమిటీలను ఆయన రద్దు చేశారు. త్వరలో రెండు రాష్ట్రాల్లోనూ ఒకేసారి కొత్త కమిటీలు ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ఆ కమిటీల ఏర్పాటు అనంతరమే తెలంగాణ టీడీపీ నూతన అధ్యక్షుడిని ఎంపిక చేస్తారని అంటున్నారు. ఇక ప్రతీ నెలా రెండో శనివారం, ఆదివారం చంద్రబాబు తెలంగాణకు రానున్నారు.
ఈ సమయంలో తెలంగాణ టీడీపీ ప్రెసిడెంట్, వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులపై విలేఖరుల నుంచి చంద్రబాబుకు ఆసక్తికరమైన ప్రశ్నలు ఎదురయ్యాయి. ఇందులో భాగంగా.. తెలంగాణ టీడీపీ బాధ్యతలు నారా లోకేష్ కి అప్పగించే అవకాశం ఉందా? అనే ప్రశ్న బాబుకు ఎదురైంది. ఇదే క్రమంలో... వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా బ్రాహ్మణిని ఎంపిక చేస్తారా? అనే ప్రశ్నా ఎదురైంది.
అయితే... వీటికి చంద్రబాబు ఆసక్తికరమైన సమాధానం చెప్పారు. ఇంద్లో భాగంగా.. జర్నలిస్టులను ఉద్దేశించి స్పందిస్తూ.. మీ ఆలోచనలు చాలా వేగంగా ఉన్నాయని కామెంట్ చేశారు. ఇదే సమయంలో విలేకరులంత వేగంగా తాము ఆలోచించడం లేదని చెబుతూ.. ఏపీలో అయినా, తెలంగాణలో అయినా తెలుగుజాతి బాగుండాలని కోరుకునే వ్యక్తి తానని చెప్పారు.
కాగా... తెలంగాణ టీడీపీ బాధ్యతల విషయంలో గత కొంతకాలంగా నారా బ్రాహ్మణి పేరు తెరపైకి వచ్చినట్లు కథనాలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే... బాబు మాత్రం ఈ విషయామపై తాను ఇంకా ఏమీ ఆలోచించలేదని స్పష్టం చేశారు.