దేవుడి స్క్రిప్ట్.. : చంద్రబాబు
టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు వైసీపీని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
By: Tupaki Desk | 22 Jun 2024 6:56 AM GMTటీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు వైసీపీని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``గతంలో 2019లో ప్రజలు మాకు 23 సీట్లు ఇచ్చారు. అప్పట్లోనూ మేం ప్రజాతీర్పును ఆహ్వానించాం. కానీ, నేను అడుగు పెడుతుంటే.. సభలో గేలి చేశారు. 23 స్థానాలను దేవుడు ఇచ్చిన స్క్రిప్టు అంటూ.. అవహేళనగా మాట్లాడారు. మరి ఇప్పుడు ఏం జరిగింది? దేవుడి స్క్రిప్టు కాదా? కానీ నేను ఈమాట అనను`` అని చంద్ర బాబు వ్యాఖ్యానించారు.
కూటమి పార్టీలకు 164 సీట్లు వచ్చాయన్న చంద్రబాబు 1+6+4 = 11 సీట్లేనని చెప్పారు. ఇది దేవుడి స్క్రీప్టే నని అన్నారు. అదేవిధంగా రాజధాని ప్రాంత రైతులు 1631 రోజులు.. ఉద్యమాలుచేశారని చెప్పారు. 1+6+3+1 = 11 సీట్లేనని అన్నారు. అయితే.. ఇప్పుడు ఇవన్నీ అప్రస్థుతమని చంద్రబాబు తెలిపారు. కానీ, గతాన్ని మరిచిపోలేమన్నారు. 15వ శాసన సభ కౌరవ సభగా గుర్తింపు పొందిందన్నారు. చర్చల స్థానంలో తిట్లు.. బూతులు.. పరుష పదాలు.. అవమానించడమే లక్ష్యంగా ముందుకు సాగారంటూ.. వైసీపీపై విమర్శలు గుప్పించారు.
కానీ, ఇప్పుడు ఏర్పడిన 16వ శాసన మాత్రం పద్ధతిగా ముందుకు సాగాలని.. గౌరవంగా సభ ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారని.. అందుకే మనకు ఇంత పెద్ద అవకాశం కల్పించారని చంద్రబాబు అన్నారు. ఎవరూ కూడా.. గతంలో మాదిరిగా.. వైసీపీ సభ్యులు వ్యవహరించినట్టుగా వెకిలి చేష్టలు.. పిల్ల చేష్టలు.. బూతులకు అవకాశం లేకుండా ప్రస్తుత సభ్యులు వ్యవహరించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు.
11 సీట్లు వచ్చినా.. వైసీపీ నాయకులు సభకు రాలేదన్నారు. అయ్యన్న పాత్రుడిని ఎన్నుకోవడం.. సభకు గౌరవం పెరిగిందన్నారు. బీసీ నాయకుడిని ఎన్నుకుని సభా స్థానంలో కూర్చోబెట్టడం.. సభకే వన్నె తెచ్చిందన్నారు. సుదీర్ఘ అనుభవం ఉన్న అయ్యన్న పాత్రుడు సభను మరింత గౌరవంగా ముందుకు తీసుకువెళ్తారని ఆశిస్తున్నట్టు తెలిపారు. సభలో బూతలకు.. విద్వేషాలకు.. తావులేకుండా సభను ముందుకు నడిపించాలని చంద్రబాబు సూచించారు.