చంద్రబాబు నిర్ణయంతో బీఆర్‌ఎస్ లో గుబులు!
ఇప్పుడు మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు చంద్రబాబు తీసుకున్న నిర్ణయంతో కేసీఆర్ బెంబేలెత్తుతున్నారని తెలుస్తోంది.
By: Tupaki Desk | 18 Jun 2024 6:30 AM GMTకేంద్రంలో చక్రం తిప్పేది తానేనంటూ ఓ రేంజులో బీరాలు పలికి కనీసం రాష్ట్రంలో కూడా అడ్రస్ లేకుండా పోయారు.. బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. ఇటీవల లోక్ సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా దక్కించుకోలేని స్థితికి బీఆర్‌ఎస్ చేరుకుంది. దాదాపు వరుసగా పదేళ్లపాటు అధికారంలో ఉండి ఒక్క లోక్ సభ ఎంపీ సీటును గెలుచుకోలేని పార్టీగా బీఆర్‌ఎస్ రికార్డులు నమోదు చేసింది.
అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో ఎక్కడా అవకాశం లేకపోవడంతో బీఆర్‌ఎస్ పార్టీ నేతలు కూడా కాంగ్రెస్ పార్టీ, బీజేపీల వైపు చూస్తున్నారని టాక్ నడుస్తోంది. దీంతో వారు పార్టీ మారకుండా కాపాడుకోవడానికి కేసీఆర్ కిందామీదా పడుతున్నారని అంటున్నారు.
ఇప్పుడు మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు చంద్రబాబు తీసుకున్న నిర్ణయంతో కేసీఆర్ బెంబేలెత్తుతున్నారని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో అఖండ విజయం సాధించిన టీడీపీ అధినేత చంద్రబాబు తెలంగాణలోనూ తన పార్టీని విస్తరింపజేస్తామని చెప్పిన సంగతి తెలిసిందే. టీడీపీకి ఇప్పటికీ తెలంగాణలో నిబద్ధులైన కార్యకర్తలు ఉన్నారు.
తెలంగాణలో ఎంతో మంది బీసీ నేతలు, బడుగు, బలహీన వర్గాల నేతలను రాజకీయంగా పైకి తెచ్చిన పార్టీగా టీడీపీకి గుర్తింపు ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణలోనూ టీడీపీని విస్తరించాలని చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకోవడంతో బీఆర్‌ఎస్ కు కొత్త కష్టాలు మొదలయ్యాయని అంటున్నారు. దీంతో కేసీఆర్ కూడా వ్యూహం మారుస్తున్నారని చెబుతున్నారు.
ఇన్నాళ్లూ బీఆర్‌ఎస్ కుటుంబ పార్టీగానే ఉండిపోయింది. కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్, కుమార్తె కవిత, మేనల్లుడు హరీశ్ రావు, దగ్గరి బంధువులు జోగినపల్లి సంతోష్ కుమార్, వినోద్ కుమార్.. ఇలా చిత్రగుప్తుడి చిట్టాలాగా కేసీఆర్ కుటుంబమే గత పదేళ్లు తెలంగాణలో కీలక పదవులు అనుభవించిందనే విమర్శలున్నాయి.
ఇప్పుడు టీడీపీ తెలంగాణలో విస్తరిస్తుందనే వార్తల నేపథ్యంలో కేసీఆర్ అప్రమత్తమయ్యారని తెలుస్తోంది. బీఆర్‌ఎస్ అంటే కేసీఆర్ కుటుంబమే అనే దానికి ఆయన చరమగీతం పాడనున్నారని అంటున్నారు. ఈ క్రమంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంటుగా ఉన్న తన కుమారుడు కేటీఆర్ ను ఆ పదవి నుంచి తప్పిస్తారని టాక్ నడుస్తోంది.
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ఇద్దరికి అవకాశం ఇస్తారని అంటున్నారు. ఇందులో ఒకరు తెలంగాణలో అత్యధికంగా ఉన్న బీసీ సామాజికవర్గం నుంచి ఉంటారని.. మరొకరు తెలంగాణలో 20 శాతానికి పైగా ఉన్న ఎస్సీ సామాజికవర్గం నుంచి ఉంటారని చెబుతున్నారు.
ఎస్సీల నుంచి మాజీ ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కుమార్, బీసీల నుంచి ఎల్ రమణ లేదా బాజిరెడ్డి గోవర్థన్ ఉండే అవకాశం ఉందని అంటున్నారు. బీఆర్‌ఎస్ అధ్యక్షుడిగా కేసీఆర్ ఉంటూ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా బీసీ, ఎస్సీల నుంచి ఇద్దరు ఉంటారని చెబుతున్నారు. ఇలా అయితేనే పార్టీ బడుగు, బలహీనవర్గాలకు చేరువవుతుందని కేసీఆర్ లెక్కలు వేసుకుంటున్నట్టు తెలుస్తోంది.