Begin typing your search above and press return to search.

బిగ్ బ్రేకింగ్... మూడుకేసుల్లో చంద్రబాబుకు గుడ్ న్యూస్!

నేడు హైకోర్టు తన నిర్ణయాన్ని ప్రకటించింది. ఇందులో భాగంగా మూడు కేసుల్లోనూ చంద్రబాబుకు ముందస్తు బెయిల్ ను మంజూరు చేసింది.

By:  Tupaki Desk   |   10 Jan 2024 9:20 AM GMT
బిగ్  బ్రేకింగ్... మూడుకేసుల్లో చంద్రబాబుకు గుడ్  న్యూస్!
X

గతకొంతకాలంగా పలు కేసులను ఎదుర్కొంటూ, వాటిపై న్యాయపోరాటం చేస్తున్న చంద్రబాబుకు ఊరట లభించింది! ఇప్పటికే స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టై సుమారు 53 రోజులు రాజామండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉండి బెయిల్ పై వచ్చిన బాబు... అనంతరం ఆ కేసుతోపాటు మిగిలిన కేసులపైనా న్యాయపోరాటం చేస్తున్నారు! ఇందులో భాగంగా ముందుగా ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారు!

ఈ సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఒకేసారి మూడు కేసుల్లో ముందస్తు బెయిల్‌ మంజూరు చేస్తూ ఏపీ ఉన్నత న్యాయస్థానం తీర్పు వెల్లడించింది. ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు అలైనమెంట్, ఇసుక, మద్యం వ్యవహారాల్లో అక్రమాలు జరిగాయంటూ ఏపీ సీఐడీ ఆయనపై కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అయితే వీటిపై ముందస్తు బెయిల్‌ కోరుతూ ఏపీ హైకోర్టులో చంద్రబాబు పిటిషన్లు దాఖలు చేశారు.

ఇప్పటికే ఆ మూడు పిటిషన్లపైనా వాదనలు ముగిసిన నేపథ్యంలో నేడు హైకోర్టు తన నిర్ణయాన్ని ప్రకటించింది. ఇందులో భాగంగా మూడు కేసుల్లోనూ చంద్రబాబుకు ముందస్తు బెయిల్ ను మంజూరు చేసింది.

కాగా... ఉచిత ఇసుక కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ పై ఏపీ హైకోర్టులో వాదనలు డిసెంబర్ 20నే ముగిశాయి! ఉచిత ఇసుక వ్యవహారంలో రాష్ట్ర ఖజానాకు తీవ్ర నష్టం వాటిల్లిందనే ఆరోపణలతో చంద్రబాబుపై సీఐడీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇందులో చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ్‌ లూథ్రా, సీఐడీ తరఫున ఏజీ శ్రీరాం వాదనలు వినిపించారు.

ఇరువైపులా వాదనలు ముగియడంతో పిటిషన్‌ పై తీర్పును ధర్మాసనం రిజర్వ్‌ చేసింది. ఇదే సమయంలో ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసులో దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ పై విచారణ కూడా గతనెల రెండోవారంలోనే ముగిసాయి! ఈ నేపథ్యంలో మూడు కేసులకు సంబంధించి తాజాగా హైకోర్టు తన నిర్ణయాన్ని ప్రకటించింది! ఇందులో భాగంగా మూడు కేసుల్లోనూ ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.