బాబు చుట్టూ.. తమ్ముళ్ల ముళ్లు.. గ్రౌండ్ దెబ్బతింటోందా..?
క్షేత్రస్థాయిలో టిడిపి నాయకులు దూకుడు ఎక్కువగా ఉంది. ఈ విషయం బహుశా చంద్రబాబుకు కూడా తెలిసే ఉంటుంది.
By: Tupaki Desk | 13 July 2024 8:30 AM GMTక్షేత్రస్థాయిలో టిడిపి నాయకులు దూకుడు ఎక్కువగా ఉంది. ఈ విషయం బహుశా చంద్రబాబుకు కూడా తెలిసే ఉంటుంది. పార్టీ అధినేతగా, ముఖ్యమంత్రిగా ఆయనకు రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో అందించే వ్యవస్థ అన్న విషయం తెలిసిందే. ఆయన పార్టీ అధినేతగా గత ఐదు సంవత్సరాలు ఉన్నప్ప టికీ రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో అందిపుచ్చుకునే వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయనకు ఇంటెలిజెన్స్ వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ చేతుల్లోనే ఉన్నాయి కాబట్టి ఎక్కడ ఏం జరుగుతుందనేది తెలుసుంది.
ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా టిడిపి అధికారంలోకి రావడంతో కొంతమంది నాయకులు వ్యవహరిస్తున్న తీరు, సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులు వంటివి పార్టీ అధినేతను ఇబ్బంది కలిగించేలా పార్టీలో ఇతర నాయకులను ఇబ్బంది కలిగించేలా ఉండటం గమనార్హం. ప్రస్తుతం నామినేటెడ్ పోస్టుల పర్వం తరుముకొచ్చింది. ఈ పోస్టుల విషయంలో అర్హతను బట్టి చంద్రబాబు నిర్ణయిస్తారని ఇప్పటికే ప్రకటించారు. క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తల నుంచి ఆయన అభిప్రాయాలు తీసుకుంటున్నారు. ఏ నాయకుడు ఎన్నికల సమయంలో ఎలా పనిచేశాడు? ఏ నాయకుడు ప్రజలకు చేరువయ్యారు? అనేది తెలుసుకుంటారు.
నిజంగా పనిచేసిన వాళ్ళు ఎంతమంది అనేది చంద్రబాబు గాలిస్తున్నారు. తద్వారా బలమైన అంకిత భావం ఉన్న నాయకులను.. ప్రోత్సహించాలని చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే ఇదే కొంతమంది నాయకులకు నచ్చటం లేదు. ఎందుకంటే పదవులు ఆశించిన వారు చాలామంది ఉన్నారు. కానీ ఉన్న పదవులు కొద్దిగానే ఉన్నాయి. పైగా మిత్రపక్షాలు కూడా కొన్ని కోరుతున్నాయి. దీంతో తక్కువ సంఖ్యలో ఉన్న పదవులను ఎక్కువ మందికి అందించడం చంద్రబాబుకు కూడా ఇబ్బందికరమైన పరిస్థితి.
ఈ నేపథ్యంలో కొంతమంది నాయకులు `మైండ్ గేమ్`కు తెర తీశారు. అంటే చంద్రబాబు ఎంపిక చేసుకున్న వాళ్లకే ఇచ్చేస్తారని, ఎవరినీ గుర్తించరని, ఇది కేవలం డబ్బా మాత్రమేనని పైకి ప్రచారం చేస్తున్నారని క్షేత్రస్థాయిలో ఏం చెప్పినా.. చంద్రబాబు వినరని ఇట్లా వ్యతిరేక ప్రచారాన్ని సోషల్ మీడియాలో జోరుగా కొనసాగిస్తున్నారు. తద్వారా చంద్రబాబును ఒత్తిడికి గురి చేస్తున్నారు. తద్వారా తమ ఆశయాన్ని సాధించాలని తామనుకున్న పదవులను దక్కించుకోవాలని కొందరు నాయకులు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.
ఇది పార్టీకి కానీ, క్షేత్రస్థాయిలో కార్యకర్తలకు కానీ మంచిది కాదనే విషయం అందరికీ తెలిసిందే. నిజానికి పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు ఉన్నారు. అదే సమయంలో కేవలం మీడియా ముందుకు వచ్చి నాలుగు తిట్లు తిట్టి.. జగన్ పై బండ బూతులు తిట్టేసి వెళ్లిపోయి తమ సొంత పనులు చేసుకునే వాళ్ళు ఉన్నారు. అలాగే ఇంట్లో నుంచి బయటికి రాకుండా పోలీసులు గృహ నిర్బంధం చేశారని, అందుకే తమ ఇంట్లో ఉండిపోయామని అందుకే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనలేక పోతున్నామని చెప్పిన నాయకులు కూడా ఉన్నారు. కానీ, ఇప్పుడు పదవుల విషయం వచ్చేసరికి వీరంతా మేమంటే మేమే నంటూ ముందుకు వస్తున్నారు.
కానీ ఇట్లాంటి వారిని కట్టడం చేసేందుకు, నాటకాలు ఆడే నాయకులను ఏరేసేందుకు చంద్రబాబు చాలా వ్యూహాత్మకంగా కేడర్ నుంచే సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఇదే ఇప్పుడు పదవులు ఆశిస్తున్న నాయకులకు కంటగింపుగా మారింది. దీంతో చంద్రబాబును టార్గెట్ చేస్తూ నేరుగా సోషల్ మీడియాలో తమ చేతికి మట్టంటకుండా కామెంట్లు చేయిస్తున్నారని ప్రచారం జోరుగా జరుగుతోంది. మరి దీనిని చంద్రబాబు కట్టడి చేసి అసలైన నాయకులకు మేలు చేస్తారా లేదా అనేది చూడాలి. ఏదేమైనా చంద్రబాబునే టార్గెట్ చేసేటటువంటి నాయకులు ఉన్నారంటే మున్ముందు పరిస్థితి ఏంటి అనేది ఒకసారి అంతర్మథనం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.