Begin typing your search above and press return to search.

చంద్రబాబు మోడీని పట్టుకుని ఎందుకు ఏడ్చారు ?

టీడీపీ అధినేత సాధారణంగా తమ ఎమోషన్స్ ని ఎక్కడా బయటపడనీయరు. అంత కంట్రోల్ గా ఆయన ఉంటారు.

By:  Tupaki Desk   |   12 Jun 2024 12:30 PM GMT
చంద్రబాబు మోడీని పట్టుకుని ఎందుకు ఏడ్చారు ?
X

టీడీపీ అధినేత సాధారణంగా తమ ఎమోషన్స్ ని ఎక్కడా బయటపడనీయరు. అంత కంట్రోల్ గా ఆయన ఉంటారు. అలాంటి చంద్రబాబు సీఎం గా నాలుగవ సారి ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా తన ఎమోషన్స్ ని దోచుకోలేక పోయారు. ఆయనకు మోడీ పుషగుచ్చం ఇచ్చి అభినందించిన వెంటనే బాబు మోడీని ఆలింగం చేసుకుని పూర్తిగా భావోద్వేగానికి గురి అయ్యారు

ఆ సమయంలో మోడీ కూడా బాబు భుజం తడుతూ వచ్చారు. అసలు ఏమి జరిగింది బాబు ఎందుకు ఈ విధంగా భావోద్వేగానికి గురి అయ్యారు అన్నది ఇక్కడ చర్చగా ఉంది. మోడీ మనస్పూర్తిగా బాబుకు ఈసారి ఎన్నికల్లో మద్దతు ఇచ్చారు. ఏది అనుకుంటే అదే సాగింది. ఎన్నికల షెడ్యూల్ వెలువడడంతోనే జగన్ ప్రభుత్వం పూర్తిగా అచేతనం అయిపోయింది.

సాధారణంగా జరిగే పాలనా వ్యవహారాలు కూడా జరగలేదు. మెల్లగా మొత్తం ప్రభుత్వాన్ని తన కంట్రోల్ లోకి బాబు తెచ్చుకున్నారు. ఆ మీదట వ్యవస్థల మీద పట్టు సాధించారు. పోలింగ్ వేళకు బాబే సీఎం అన్నట్లుగా అంతా కను సైగ చేస్తే జరిగిపోయింది. అదే టైం లో అధికార వైసీపీకి ఇదేమీ అర్థం కాక చేష్టలుడిగి చూస్తూండిపోయింది.

నిజంగా బాబు ఇంతలా చేయగలిగారు అంటే దాని వెనక మోడీ మద్దతు పూర్తిగా ఉండడమే. మొదట ఇష్టం లేని పెళ్ళి అన్నట్లుగా కూటమి లోకి అడుగుపెట్టిన బీజేపీ ఆ తరువాత మాత్రం పూర్తిగా బాబు వైపే ఉంది. ఆరు నూరు అయినా బాబుని సీఎం చేయాలని బీజేపీ పెద్దలు నిర్ణయించారు. మోడీ అయితే ఏకంగా మూడు బహిరంగ సభలతో పాటు ఒక రోడ్ షోలో పాల్గొని టీడీపీ కూటమికి మంచి బలాన్ని ఇచ్చారు.

అంతే కాదు ఏపీలో ఎన్డీయే సర్కార్ మంచి మెజారిటీతో గెలుస్తుంది అని ఒకటికి పదిసార్లు చెప్పారు. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ఏపీ గురించి కూడా మోడీ అలా ప్రచారం చేస్తూ వచ్చారు. అది న్యూట్రల్ ఓటర్లలో గొప్పగా పనిచేసింది. మొత్తానికి బాబుకు అన్ని ఆయుధాలు సమకూర్చి ఆయనను విజేత చేయడంలో మోడీ పోషించిన పాత్ర అపూర్వం అని చెప్పాలి.

గతంలో ఇద్దరి మధ్య రాజకీయ రచ్చ సాగినా ఆ విభేదాలు అన్నీ మరచిపోయి మోడీ బాబుకు ఫుల్ ఫ్రీడమ్ ఇస్తూ కేంద్రంలోని తన అధికారాన్ని కూడా అందుకు ఉపయోగించారు అని అంటారు. దీంతోనే బాబుకు ఈసారి ఎన్నికలు చాలా ఈజీ అయ్యాయి. ఇక మోడీ కూటమికి అతి పెద్ద బలం అయ్యారు. ఒక దశలో డీమోరలైజ్ అయి ఎన్నికలను ఎలా ఎదుర్కోంటామని డౌట్ లో పడిన బాబుకి కొండంత బాసటగా నిలిచారు మోడీ.

మరో వైపు చూస్తే పవన్ బీజేపీకి టీడీపీకి మధ్య పొత్తును కుదిర్చారు. పవన్ మాటకు మోడీ ఓకే అని టీడీపీతో చేతులు కలిపారు. ఇలా మోడీ అన్ని విధాలుగా సహకరించిన వైనాన్ని గుర్తు చేసుకుంటూ బాబు ఎమోషన్ అయ్యాయరని అందుకే కళ్ళ వెంట నీళ్ళు వచ్చాయని అంటున్నారు. బాబు మోడీ ఇద్దరూ సమ వయస్కులే. ఇద్దరూ రాజకీయంగా ఢక్కా మెక్కీలు తిన్న వారే. బాబు అయితే మోడీ కంటే సీనియర్.

అయినా ఈ ఇద్దరి నేతల మధ్య ఇంతలా అనుబంధం పెరగడం మాత్రం కేవలం ఈ ఎన్నికల్లోనే సాగింది. 2014లో మోడీ పొత్తు పెట్టుకున్నా ఈ తరహా సన్నివేశాలు కనిపించలేదు. బాబు గురించి మోడీ అన్నీ తెలుసుకుని ఆయనను అర్ధం చేసుకున్నారు అనుకోవాలా లేక మోడీ గురించి బాబు అర్థం చేసుకున్నారు అనుకోవాలా లేక రాజకీయ బంధంగానే ఇది ఉంటుందని అనుకోవాలా తెలియదు కానీ మోడీ బాబు ప్రస్తుతానికి అయితే అన్నదమ్ములుగానే ఉంటున్నారు. ఇది బాబు ప్రమాణ స్వీకార వేళ ఇద్దరి అభిమానంతో బయటపడడం ఆలింగనంగా మారడంతో బాబు మోడీ మైత్రి మీద బాబు ఎమోషన్ మీద పెద్ద ఎత్తున చర్చ అయితే సాగుతోంది.