Begin typing your search above and press return to search.

అమరావతిలో పెట్టుబడులు... వారికి చంద్రబాబు ప్రత్యేక వినతి!

ఆంధ్రప్రదేశ్‌ లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అమరావతిపై అభివృద్దిపై సారించింది.

By:  Tupaki Desk   |   27 Jun 2024 2:30 PM GMT
అమరావతిలో పెట్టుబడులు... వారికి చంద్రబాబు ప్రత్యేక వినతి!
X

ఆంధ్రప్రదేశ్‌ లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అమరావతిపై అభివృద్దిపై సారించింది. తాము గెలిస్తే అమరావతే రాజధానిగా ఉంటుందని చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ ఎన్నికల ముందు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక చంద్రబాబు తన రెండో పర్యటనకు రాజధాని అమరావతినే ఎంచుకున్నారు.

అమరావతి రాజధాని నిర్మాణానికి లక్ష కోట్లు రూపాయలు అవసరమవుతాయని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. మొదటి రెండున్నరేళ్లలోనే రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేస్తామని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ ఇప్పటికే ప్రకటించారు. మొత్తం మూడు దశల్లో రాజధాని నిర్మాణం చేపడతామని.. మొదటి రెండున్నరేళ్లలోనే రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేస్తామన్నారు.

అయితే రాజధాని అమరావతికి భారీ ఎత్తున నిధులు అవసరం. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పెట్టుబడుల సేకరణకు శ్రీకారం చుట్టారు. ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతిని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దాలని ఆయన కంకణం కట్టుకున్నారు. ఈ నేపథ్యంలో పెట్టుబడులను ఆహ్వానించే పనిలో ఉన్నారు.

కేవలం రాష్ట్రానికి చెందినవారినే కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన పారిశ్రామికవేత్తలను కూడా అమరావతిలో పెట్టుబడులు పెట్టాలని చంద్రబాబు ఆహ్వానిస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా కర్ణాటక పారిశ్రామికవేత్తలను పెట్టుబడులను పెట్టాల్సిందిగా ఆహ్వానించారు.

చంద్రబాబు రెండు రోజుల పర్యటనకు గానూ తన నియోజకవర్గం చిత్తూరు జిల్లా కుప్పం వెళ్లిన సంగతి తెలిసిందే. రెండు రోజుల పాటు నియోజకవర్గంలో పర్యటించారు. కుప్పం నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌ లో బెంగళూరులో హెచ్‌ఏఎల్‌ విమానాశ్రయానికి వెళ్లారు.

బెంగళూరు నుంచి విజయవాడకు తిరుగు ప్రయాణంలో ఉన్న క్రమంలో చంద్రబాబు బెంగళూరులో పలువురు పారిశ్రామికవేత్తలను కలిసి ఏపీలో పెట్టుబడులు పెట్టాలని కోరారు.

బెంగళూరు విమానాశ్రయంలో చంద్రబాబును సెంచురీ గ్రూప్‌ సంస్థల ఈడీ అశ్విని పై, ఎండీ రవీంద్ర పై తదితరులు మర్యాదపూర్వకంగా కలిశారు. అమరావతిలో పెట్టుబడులు పెట్టాలని చంద్రబాబు వారిని కోరారు. ఈ నేపథ్యంలో వచ్చే ఆర్థిక సంవత్సరంలోగా అమరావతిలో పెట్టుబడుల విషయంపై నిర్ణయం తీసుకుంటామని అశ్విని పై చంద్రబాబుకు తెలిపారు.

కాగా ఇప్పటికే సెంచురీ గ్రూప్‌ వైఎస్సార్‌ జిల్లాలో తన యూనిట్‌ ను ఏర్పాటు చేసింది. పలు ఫర్నీచర్‌ ఉత్పత్తులను ఉత్పత్తి చేస్తోంది. ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు వినతి నేపథ్యంలో పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెడితే ఏపీకి మంచి రోజులు వచ్చినట్టేనని అంటున్నారు.