ఐఆర్ ఆర్ కేసు.. చంద్రబాబుకు దక్కని ఊరట.. ఏం జరిగిందంటే
తాజాగా మరోసారి విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా బుధవారం .. చంద్రబాబు తరఫున న్యాయవాది నాగముత్తు వాదనలు వినిపించారు.
By: Tupaki Desk | 29 Nov 2023 9:36 AM GMTటీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ప్రభుత్వం పెట్టిన అనేక కేసుల గురించి తెలిసిందే. వీటిలో స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో ఆయనను జైలుకు తరలించడం.. తర్వాత.. ఆయనకు రెగ్యులర్ బెయిల్ దక్కడం తెలిసిందే. అయితే.. ఇప్పుడు ఆయనకు పొంచి ఉన్న మరో కేసు అమరావతి రాజధాని ఇన్నర్ రింగ్‌రోడ్డు(ఐఆర్ ఆర్) వ్యవహారం. ఈ కేసులో అరెస్టు చేయబోమని ఇప్పటికే రాష్ట్ర సీఐడీ అధికారులు ప్రకటించారు.
అయినప్పటికీ.. ఈ కేసు విషయంలో టీడీపీ నాయకులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ కేసులో బెయిల్ కోరుతూచంద్రబాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ముందస్తు బెయిల్ ఇవ్వాలని ఆయన కోర్టును అభ్యర్థించారు. దీనిపై ఇప్పటికే రెండు దఫాలుగా విచారణ చేసిన హైకోర్టు.. తాజాగా మరోసారి విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా బుధవారం .. చంద్రబాబు తరఫున న్యాయవాది నాగముత్తు వాదనలు వినిపించారు.
ఐఆర్‌ఆర్ మాస్టర్ ప్లాన్‌లో అవకతవకలు జరగలేదని ఆయన తెలిపారు. అయితే.. ప్రభుత్వం రాజకీయ ప్రేరేపితంగానే ఈ కేసు దాఖలు చేసిందని ఆయన చెప్పారు. ఇక, సీఐడీ తరఫు న్యాయవాది స్పందిస్తూ.. రాజకీయ ప్రేరేపితం లేదని.. ఉన్న ఆధారాలకు అనుగుణంగానే కేసు నమోదుచేశారని తెలిపారు. అయితే.. చంద్రబాబును అరెస్టు చేయాలనే ఉద్దేశం లేదన్నారు. ఇరు పక్షాల వాదనలను విన్న న్యాయస్థానం తదుపరి విచారణను డిసెంబర్ 1కి వాయిదా వేసింది.
మరోవైపు అసైన్డ్ భూముల వ్యవహారంలో టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి నారాయణ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో నారాయణ దాఖలు చేసిన ముందస్తు బెయిల్, క్వాష్ పిటిషన్లపై విచారణను కూడా కోర్టు వాయిదా వేసింది.