Begin typing your search above and press return to search.

చక్రం తిప్పేలా చంద్రబాబుకు మళ్లీ ఆ కీలక పదవి.. మోదీ, షా మంత్రాంగం

లోక్ సభ ఎన్నికలకు సంబంధించి దేశవ్యాప్తంగా ఆరు దశల పోలింగ్ ముగిసింది.

By:  Tupaki Desk   |   26 May 2024 4:30 PM GMT
చక్రం తిప్పేలా చంద్రబాబుకు మళ్లీ ఆ కీలక పదవి.. మోదీ, షా మంత్రాంగం
X

లోక్ సభ ఎన్నికలకు సంబంధించి దేశవ్యాప్తంగా ఆరు దశల పోలింగ్ ముగిసింది. మరొక్క విడత మాత్రమే మిగిలి ఉంది. దీంతోపాటు ఏపీ, అరుణాచల్, ఒడిసా అసెంబ్లీలకూ ఎన్నికలు జరిగాయి. మిగతావాటి సంగతి ఏమోగానీ ఏపీ విషయం మాత్రం చాలా కీలకం. ఎందుకంటే అక్కడ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వంటి నాయకుడు తిరిగి ఎన్డీఏలో చేరారు. ఇటీవలి ఎన్నికల్లో బీజేపీ, జనసేనతో కలిసి కూటమి కింద పోటీచేశారు. ఒకవేళ ఏపీలో ఫలితాలు అనుకూలంగా వస్తే బాబు సీఎం అవడం ఖాయం. కానీ, జాతీయ స్థాయిలో బీజేపీకి సీట్లు తగ్గి హంగ్ తరహా పరిస్థితులు వస్తే..?

బాబు చక్రం తిప్పేలా..

ఐదు దశల ఎన్నికల తర్వాత కేంద్రంలో బీజేపీకి సాధారణ మెజార్జీ 272 వచ్చే అవకాశం లేదనే విశ్లేషణలు వస్తున్నాయి. మోదీ ప్రచారంలోనూ దీని తాలూకు అసహనం కనిపిస్తోందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్డీఏకు గనుక సొంతంగా మెజారిటీ రాకుంటే పరిస్థితి ఏమిటి? టీడీపీ అధినేత చంద్రబాబు సేవలను ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఉపయోగించుకునే యోచనలో ఉన్నారని తెలుస్తోంది.

ఆనాటి అనుభవంతో..

యునైటైడ్ ఫ్రంట్, వాజ్ పేయీ హయాంలో ఎన్డీఏను చంద్రబాబు శాసించారు. కేంద్రంలో చక్రం తిప్పారు. ప్రధానమంత్రులుగా ఎవరు ఉండాలో డిసైడ్ చేశారు. మళ్లీ ఇప్పుడు అలాంటి పాత్రనే చంద్రబాబు పోషించాలని మోదీ-షా కోరుకుంటున్నారు. ఎందుకంటే.. బీజేపీని మరీ ముఖ్యంగా మోదీ-షాలను నమ్మి తటస్థ పార్టీలు ఏవీ కూడా మద్దతు ఇవ్వవు. ఉదాహరణకు ఒడిసా అధికార పార్టీ బీజేడీనే తీసుకుంటే మోదీని నవీన్ పట్నాయక్ పెద్దగా విశ్వసించరు. చిన్నవో పెద్దవో ఇలాంటి పార్టీలు దేశంలో కొన్ని ఉన్నాయి. వాటికి అటుఇటుగా 20 సీట్లు వస్తే కేంద్రంలో కీలకం అవుతాయి. మరి వీటిని మెప్పించి మద్దతు పొందాలంటే చంద్రబాబు లాంటి కీలక వ్యక్తి అవసరమని మోదీ-షా భావిస్తున్నారట. అందుకే చంద్రబాబుకు ఎన్డీఏ కన్వీనర్ పదవి అప్పగించే యోచనలో ఉన్నారని సమాచారం.

కాగా, ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం కానీ.. దీనిపై స్పష్టత వచ్చే అవకాశం లేదు. కేంద్రంలో మోదీ మళ్లీ మెజార్టీ సాధిస్తే ఆ అవసరమే రాకపోవచ్చు. అంతేగాక ఏపీలో చంద్రబాబు ఓడిపోతే మరొక విధమైన సమీకరణం నెలకొంటుంది. అప్పుడు జగన్ ఇప్పటిలాగానే అంశాలవారీగా మద్దతు ఇస్తారని భావించవచ్చు.