14 ఏళ్ల సీఎంని... అడ్వొకేట్లను కూడా కలవనివ్వరా? : చంద్రబాబు ఘాటు లేఖ
అంటూ ఆయన సీఐడీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన తనకు ఉన్న న్యాయ హక్కులను గుర్తు చేస్తూ.. స్వయంగా లేఖ రాశారు.
By: Tupaki Desk | 9 Sep 2023 4:11 PM GMTటీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర ఆగ్రహానికి, ఆవేశానికి, ఆవేదనకు గురయ్యారు. శనివారం ఉదయం నంద్యాలలో అరెస్టు చేసిన ఏపీ సీఐడీ అధికారులు ఆయనను రోడ్డు మార్గంలో సాయంత్రం 5.30 గంటలకు విజయవాడలోని సీఐడీ ఆఫీసుకు తీసుకువచ్చారు. అయితే, ఈ సందర్భంగా ఆయనతో కేసు విషయంపై చర్చించేందుకు టీడీపీ తరఫున ఏర్పాటైన న్యాయ వాదుల బృందం సీఐడీ ఆఫీసుకు చేరుకుంది.
అయితే, సీఐడీ పోలీసులు టీడీపీ తరఫున వాదించేందుకు రెడీ అయిన న్యాయ వాదులను చంద్రబాబును కలిసేందుకు అనుమతి నిరాకరించారు. దీనిపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహానికి, ఆవేదనకు గురయ్యారు. "14 ఏళ్ళపాటు ఈ రాష్ట్రాన్ని పాలించిన సీఎంకు ఇదేనా మీరిచ్చే గౌరవం" అంటూ ఆయన సీఐడీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన తనకు ఉన్న న్యాయ హక్కులను గుర్తు చేస్తూ.. స్వయంగా లేఖ రాశారు.
తనను అక్రమంగా నిర్బంధించారని ఈ సందర్భంగా తనకు న్యాయ సేవ పొందే హక్కు ఉందని, ఇది రాజ్యాంగమే ప్రసాదించిన హక్కు అని పేర్కొన్నారు. కాబట్టి తన కోసం వచ్చిన న్యాయవాదులు.. సీనియర్ న్యాయవాది దమ్మాల పాటి శ్రీనివాస్, మరో సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు, అడ్వొకేట్ ఎం. లక్ష్మీనారాయణ, మరో అడ్వొకేట్ జవ్వాజి శరత్ చంద్రలతో తాను భేటీ అయ్యేందుకు అవకాశం ఇవ్వాలని ఆయన సీఐడీ చీఫ్ కు లేఖ రాశారు. ప్రస్తుతం ఈ లేఖపై అధికారులు మంతనాలు జరుపుతున్నారు.