Begin typing your search above and press return to search.

జడ్జికి చంద్రబాబు లేఖ... ఆరోపణలపై పిన్ టు పిన్ డీఐజీ వివరణ!

స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో అరెస్టయి రిమాండ్‌ లో ఉన్న టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. రాజమండ్రి సెంట్రల్ జైల్లో తన భద్రత, ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేశారు.

By:  Tupaki Desk   |   28 Oct 2023 4:24 AM GMT
జడ్జికి చంద్రబాబు లేఖ... ఆరోపణలపై పిన్  టు పిన్  డీఐజీ వివరణ!
X

స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో అరెస్టయి రిమాండ్‌ లో ఉన్న టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. రాజమండ్రి సెంట్రల్ జైల్లో తన భద్రత, ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఏసీబీ కోర్టు జడ్జికి చంద్రబాబు లేఖ రాశారు. ఈనెల 25న చంద్రబాబు రాసిన మూడు పేజీల లేఖను జైలు అధికారులు జడ్జికి పంపారు. దీంతో ఈ విషయంలో జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్ స్పందించారు.

అవును... రాజమండ్రి సెంట్రల్ జైలులో పెన్ను కెమెరాతో ఒక రిమాండ్‌ ఖైదీ జైల్లో తిరుగుతున్నాడని.. తనను చంపుతామని మావోయిస్టుల పేరుతో లేఖ వచ్చిందని.. తనను హత్య చేసేందుకు పెద్దమొత్తంలో డబ్బులు చేతులు మారాయని.. తన కుంటుం కలిసేందుకు వచ్చిన సమయంలో ఒక డ్రోన్‌ తిరిగిందని.. తన ప్రాణాలకి ముప్పు ఉందని ఆరోపిస్తూ ఏసీబీ గౌరవ జడ్జికి చంద్రబాబు రాసిన లేఖపై జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్ స్పందించారు.

ఇందులో భాగంగా... లేఖలో చంద్రబాబు ప్రస్థావించిన ప్రతి ఇష్యూపైనా జైళ్ల శాఖ డిఐజి రవికిరణ్ వివరణ ఇచ్చారు. ఇందులో భాగంగా మావోయిస్టులు లేఖ రాశారని చెబుతున్న విషయంలో నిజం లేదని అన్నారు. ఇదే సమయంలో ప్రతీ వారం తనతో పాటు ఎస్పీ కలిసి జైలుకువెళ్లి చంద్రబాబు సెక్యూరిటీపై రివ్యూ చేయడం జరుగుతుందని డీఐజీ రవికిరణ్ స్పష్టం చేశారు.

ఇక ఎస్ కోటకు సంబంధించిన ఒక రిమాండ్ ఖైదీ రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెన్ కెమెరాతో తిరుగుతున్నారని చేసిన ఆరోపణపైనా స్పందించారు. అతను ఎన్డీపీఎస్ కేసులో రాలేదని, శ్రీనివాస్ అనే వ్యక్తి ఒక దొంగతనం కేసులో జైలుకు వచ్చాడని, అతను జైలుకి వచ్చిన సమయంలోనే అతని వస్తువుల్లో పెన్ కెమెరా కాదు.. ఒక బటన్ కెమెరా దొరికిందని, వెంటనే దాన్ని ఆ రోజే సీజ్ చేయడం జరిగిందని డీఐజీ వివరణ ఇచ్చారు.

గతంలో ఒక డ్రోన్ కనిపించిందని వాచ్ టవర్ సిబ్బంది చెప్పారని.. అయితే అది జైలు సమీపం పైకి రాలేదని.. ఈ విషయం గతంలోనే చెప్పామని.. దాని తర్వాత మరళా అలాంటి సంఘటన ఏమీ జరగలేదని డీఐజీ తెలిపారు. ఇదే సమయంలో.. గంజాయి పేకెట్లు జైలు లోపలకు విసురుతున్నారని చేసిన ఆరోపణలపైనా డీఐజీ స్పందించారు. చంద్రబాబు జైలుకి వచ్చినప్పటినుంచీ... ఎలాంటి గంజాయి ప్యాకెట్లూ జైలులోపలకి విసిరివేయబడలేదు అని తెలిపారు.

ఇదే సమయంలో చంద్రబాబును ములాకత్ లో కుటుంబ సభ్యులు కలిసినప్పుడు డ్రోన్ తిరిగిందని, ఫోటోలు తీసిందని చేసిన ఆరోపణలకు సంబంధించి తమవద్ద సమాచారం ఏమీ లేదని.. దానికి సంబంధించి ఎలాంటి ఫిర్యాదు కూడా తమకు అందలేదని క్లారిటీ ఇచ్చారు. ఇదే సమయలో జైలు బయట 24 గంటలూ పూర్తి సెక్యూరిటీ, అడిషినల్ సెక్యూరిటీ ఉందని స్పష్టం చేశారు.

ఇక కంటి ఆపరేషన్ పైనా డీఐజీ క్లారిటీ ఇచ్చారు. ప్రతీ రోజూ వైద్య బృందం చంద్రబాబుకు ఆరోగ్య పరీక్షలు చేస్తున్నారని తెలిపారు. జూన్ 2023 లో తన కంటికి ఆపరేషన్ జరిగిందని చంద్రబాబు తెలిపారని అన్నారు. ఇక మరోకంటికి ఇప్పటికిప్పుడే ఆపరేషన్ అవసరం లేదని వైద్యులు చెప్పినట్లు డీఐజీ కిరణ్ స్పష్టం చేశారు.

ఇక వైద్యులు ఒక రిపోర్ట్ ఇస్తుంటే.. జైలు అధికారులు మరో రిపోర్ట్ ఇస్తున్నారని వచ్చిన ఆరోపణలపైనా డీఐజీ వివరణ ఇచ్చారు. ఐదుగురు వైద్యుల సంతకాలతో వచ్చే ఆ రిపోర్ట్ ను ప్రతీ రోజూ కోర్టుకు సమర్పిస్తున్నామని, అదే సమయంలో చంద్రబాబు ఫ్యామిలీ మెంబర్స్ కి, ఆయన తరుపు లాయర్ కు కూడా అదే రోజు ఆ రిపోర్ట్ ను పంపిస్తున్నామని తెలిపారు.

ఇక చంద్రబాబు భద్రత విషయంలో ఎవరికీ ఎలాంటి అనుమానాలూ ఆవసరం లేదని.. అత్యంత కట్టుదిట్టమైన భద్రత చంద్రబాబుకు కల్పిస్తున్నామని.. ఆయన ఆరోగ్యానికి సంబంధించిన ప్రతీ విషయం ఆయన కుటుంబ సభ్యులకు, కోర్టుకు రెగ్యులర్ గా తెలియపరుస్తున్నట్లు జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్ క్లారిటీ ఇచ్చారు.