రేవంత్ మీద తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్న చంద్రబాబు సీనియార్టీ!
ముఖ్యమంత్రిగా నాలుగోసారి బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు ఒకవైపు.. తొలిసారి తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి.
By: Tupaki Desk | 18 Jun 2024 5:31 AM GMTముఖ్యమంత్రిగా నాలుగోసారి బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు ఒకవైపు.. తొలిసారి తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి. నిజానికి ఈ గురువు - శిష్యుల మధ్య పాలనా పోటీలో రేవంత్ తేలిపోతున్నారన్న విమర్శ అంతకంతకూ ఎక్కువ అవుతోంది. నిజానికి చంద్రబాబుతో రేవంత్ ను పోల్చటం ఏ మాత్రం సరికాదు. ఎందుకంటే ఈ ఇద్దరిది వేర్వేరు దారులుగా చెప్పాలి. ఒక ప్రాంతీయ పార్టీ అధినేతగా చంద్రబాబు ఉంటే.. ఒక జాతీయ పార్టీలో ఒక నేతగా రేవంత్ ఉన్నారు. తన సొంత సామర్థ్యం మీద రేవంత్ ముఖ్యమంత్రి అయ్యారు. తన రాజకీయ జీవితంలో ఏనాడు అధికార పదవుల్ని అనుభవించిన అనుభవం రేవంత్ కు లేదు.
కానీ.. చంద్రబాబు అలా కాదు. పాలన విషయంలో ఆయనకు ఎంతటి అనుభవం ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చంద్రబాబుకు వెనక్కి లాగే దమ్ము.. ధైర్యం ఎవరికి లేదు. కానీ.. రేవంత్ అలా కాదు తనను వెనక్కి లాగేందుకు ఎన్ని అడ్డంకులు ఉండాలో అన్ని అడ్డంకుల్ని ఎదుర్కొంటూ ఆయన పాలన సాగిస్తున్నారు. దీనికి తోడు చంద్రబాబుకు తనదంటూ సొంత టీం ఉంది. ఎప్పుడు ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోవాలి? ఏం చేస్తే మరేం జరుగుతుందన్న పాలనా అనుభవం కొండంత అయితే.. రేవంత్ కు రవ్వంత కూడా లేదన్నది మర్చిపోకూడదు.
నిజానికి పాలనా పరంగా చంద్రబాబుతో రేవంత్ ను పోల్చటమే పెద్ద తప్పు. కానీ.. పోలికల్ని తీసుకొచ్చే వారికి అవేమీ పట్టవు. ఫలితాన్ని మాత్రమే తప్పించి మరే అంశాల్ని పట్టించుకోని ఈ రోజుల్లో రేవంత్ మరింత స్పీడ్ గా పరుగులు తీయాల్సిన అవసరం ఉంది. ఎవరు అవునన్నా.. కాదన్నా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య.. ముఖ్యమంత్రుల మధ్య పోటీ అన్నది ఉంటుంది. చంద్రబాబు - కేసీఆర్, కేసీఆర్ - జగన్, జగన్ - రేవంత్, ఇప్పుడు చంద్రబాబు - రేవంత్ లను ముఖ్యమంత్రులుగా పోలిక చూడటం కొందరు చేస్తుంటారు.
తాజా కాంబినేషన్ లో చంద్రబాబు పాలనా స్పీడ్ ముందు రేవంత్ తేలిపోతున్నారు. దీంతో ఆయన మీద ఒత్తిడి అంతకంతకూ ఎక్కువ అవుతోంది. ఆర్థిక అంశాల్లో చూస్తే ఏపీతో పోలిస్తే తెలంగాణ మెరుగైన స్థితిలో ఉన్నప్పటికీ.. తనకున్న పాలనా అనుభవంతో చంద్రబాబు దాన్ని కవర్ చేయటమే కాదు.. హామీల అమలు విషయంలో గతానికి మించిన వేగాన్ని ఆయన ప్రదర్శిస్తున్నారు. రేవంత్ విషయానికి వస్తే.. వ్యవస్థల మీద అవగాహన తెచ్చుకోవటం.. తన చుట్టు ఉన్న శక్తులను సంత్రప్తికి గురి చేస్తూ.. పార్టీ సీనియర్లతో పంచాయితీలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ పాలన సాగించాలి. పరిమితుల విషయానికి వస్తే చంద్రబాబు అస్సలంటే అస్సలు లేవని చెప్పాలి. ఒకవేళ ఉన్నా వాటిని డీల్ చేసేందుకు అవసరమైన సీట్ల శక్తి ఉంది.కానీ.. రేవంత్ కు అలా కాదు. ఆయన బలం పరిమితం. ఇదే.. ఆయనకు ఇబ్బందిగా మారింది.
ఒకవైపు పాలనాపరమైన అనుభవం పెద్దగా లేకపోవటం.. సొంత టీం కుదరకపోవటం రేవంత్ కు ఇబ్బందికరంగా మారింది. దీనికి తోడు.. చంద్రబాబుతో పోలిస్తే.. రేవంత్ కు మీడియా సపోర్టు కూడా పరిమితమేనన్న విషయాన్ని మర్చిపోకూడదు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. బలమైన ప్రతిపక్షాన్ని రేవంత్ ఎదుర్కోవాల్సి వస్తోంది. అన్ని సానుకూలతలు చంద్రబాబుకు ఉంటే.. పూర్తి ప్రతికూలతల మధ్య రేవంత్ పాలనా రథాన్ని నడిపిస్తున్న పరిస్థితి. అదే ఆయనపై ఒత్తిడిని అంతకంతకూ పెంచేలా చేస్తుందని చెప్పాలి.