వంచనకు తగిన శిక్ష - మోసానికి జరిగిన శాస్తి... కామెంట్స్ వైరల్!
తాను అధికారంలో ఉన్న సమయంలో చేసిన తప్పులకు తగిన ప్రతిఫలం మాత్రమే అని ప్రభుత్వం చెబుతోంది.
By: Tupaki Desk | 11 Sep 2023 8:08 AM GMTఅది 2014 ఎన్నికల సమయం. పత్రికల్లోనూ, టీవీల్లోనూ రాజకీయ పార్టీల ప్రకటనలు హోరెత్తించేస్తున్న కాలం అది. ఈ క్రమంలో వినూత్నంగా ప్రచారం మొదలుపెట్టింది టీడీపీ! "జాబు రావాలంటే బాబు రావాలి" అనే నినాదాలు తెరపైకి తెచ్చింది! ప్రకటన ప్రారంభంలో సైకిల్ బెల్ మోగించింది. పార్టీ గుర్తుని గుర్తు చేసింది. జనం నమ్మారు!
అవును... "బాబు వస్తే జాబు వస్తుంది.. కంపెనీలు, పరిశ్రమలు, వ్యాపార, వాణిజ్య సంస్థలు ఏపీకి క్యూ కడతాయి. అందరూ తమ గ్రామాలు, పట్టణాలకు సమీపంలోనే ఉద్యోగాలు చేసుకోవచ్చు.. దీనికోసం మీకు స్కిల్స్ (నైపుణ్యాలు) లేకపోయినా ఫర్లేదు.. మీకు ఆ విద్య కూడా ప్రభుత్వమే నేర్పిస్తుంది.. నమ్మండి - బాబును గెలిపించండి" అని చెబితే పేద ప్రజలు నమ్మారు. తమ బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి.. తమ జీవితాలు మెరుగుపడతాయని ఆశపడ్డారు.
దీంతో 2014లో చంద్రబాబుకు ఓటేసి గెలిపించారు! అంతవరకూ ఓడ మల్లయ్య ఒడ్డు దాటాక బోడి మల్లయ్య అన్నట్లుగా ఎన్నికల్లో గెలిచిన అనంతరం ప్రజలను మరిచిపోయినంత పనిచేశారు టీడీపీ పాలకులు! దీంతో యువతకు జాబ్ అన్నారు కాబట్టి యువకుడైన లోకేష్ ఒక్కడికీ మూడు శాఖలకు మంత్రిగా జాబ్ ఇచ్చేశారనే కామెంట్లు వినిపించాయి. రాష్ట్రంలోని మిగతా యూత్ కూడా తమకూ చిన్నవో పెద్దవో ఉద్యోగాలు వస్తాయని ఆశించారు.
ఈ సమయంలో "మీ కోసం స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పెట్టాం.. ఇక మీ నైపుణ్యాలు రాకెట్లా దూసుకెళ్తాయి.. ఉద్యోగాలు బులెట్ రైళ్ల మాదిరి ఎదురొస్తాయి" అనే స్థాయిలో ప్రకటనలు ప్రారంభమయ్యాయి! ఈసారి కూడా రాష్ట్రంలోని యువత బాబు & కో ని బలంగా నమ్మింది.
దీంతో... "మీ నమ్మకమే మా పెట్టుబడి" అనుకున్నారో ఏమో కానీ... స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పేరిట వందల కోట్ల రూపాయలు విడుదలకు అనుమతులు ఇచ్చారనే మాటలు వినిపించాయి. ఇందులో భాగంగా రూ. 371 కోట్లను ఆ పథకానికి విడుదల చేశారని, డమ్మీ కంపెనీల పేరిట రూ. 241 కోట్లు చంద్రబాబు జేబుల్లోకి వచ్చేశాయని తాజాగా ఏపీ సీఐడీ ఆరోపించింది. తీవ్రంగా దృష్టి సారించినంతపనిచేసింది!
న్యాయం ముందు అందరూ ఒక్కటే:
అనంతరం 2019 ఎన్నికల సమయం రానే వచ్చింది. భారీ మెజారిటీతో ఏపీకి వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. ఈ సమయంలో రివర్స్ టెండరింగ్ మొదలుపెట్టడంతోపాటు.. ఎక్కడెక్కడ ఎంతెంత దోపిడీ జరిగిందన్నది తవ్వి తీసే పనికి పూనుకున్నారు. ఈ సమయంలో తవ్వుతున్న కొద్దీ విస్తుపోయే దారుణాలు వెలుగులోకి వచ్చాయని తెలుస్తుంది.
ఇందులో భాగంగా దాదాపు ప్రతీ భారీ పథకంలోనూ వందల కోట్ల అవినీతి తాండవించిందనే కామెంట్లు వినిపించాయి. ఈ సమయంలో "ఇది చిన్న శాంపిల్" అని చెబుతూ స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణాన్ని ప్రజల ముందు పెట్టారు ఏపీ సీఐడీ అధికారులు! ఈ సమయంలో పూర్తి ఆధారాలను న్యాయస్థానం ముందు పెట్టి ధర్మాధర్మాలను మీరే నిర్ణయించండి అని ప్రభుత్వం తరఫున న్యాయాన్ని అర్థించారు!
ఈ సమయంలో ప్రతి పేజీలోనూ అవినీతి కొట్టొచ్చినట్లు స్పష్టమైందని చెబుతున్నారు. ఎక్కడా తప్పించుకునేందుకు వీలు లేదని అంటున్నారు. నాడు... "సీఎం చంద్రబాబు గారు చెప్పారు రూల్స్ లేవు.. గీల్స్ లేవు.. డబ్బు ఇచ్చేయండి" అంటూ అప్పటి ఆర్థికశాఖ ఉన్నతాధికారులు రాసిన నోట్ ఫైల్స్ కోర్టుకు చేరింది. దీంతో... పేదల పక్షాన పోరాడిన ప్రభుత్వం తమను మోసం చేసిన గత పాలకుడిని న్యాయస్థానం ఎదుట నిలబెట్టిందనే కామెంట్లు వినిపించాయి. ఫలితంగా కోర్టు చంద్రబాబుకి 14 రోజుల రిమాండ్ విధించింది!
రాజకీయ కక్ష కాదు... చేసిన తప్పుకు శిక్ష:
"ప్రభుత్వం కక్షగట్టి చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసి జైలుకు పంపింది" అంటూ కొందరు అర్ధజ్ఞానులు అక్కడక్కడా ఎగురుతుండొచ్చు కానీ అది రాజకీయ కక్ష కాదు అని అంటున్నారు అధికారపార్టీ నేతలు. తాను అధికారంలో ఉన్న సమయంలో చేసిన తప్పులకు తగిన ప్రతిఫలం మాత్రమే అని ప్రభుత్వం చెబుతోంది. తాజాగా కోర్టు కూడా ఈ వాదనతో ఏకీభవించదనే కామెంట్లు.. తీర్పు అనంతరం వినిపించాయి.
రాజకీయపరమైన వైరాలు ఉన్నంత మాత్రాన కోర్టులకు ఎందుకు కక్ష ఉంటుంది.. రాజకీయ కక్షలకు కోర్టులు ఎందుకు వేదికలుగా మారతాయి.. అనే ప్రశ్నలు మొదలయ్యాయ్యి. కేసుల్లో స్పష్టమైన ఆధారాలను, పత్రాలనూ తమముందు సమర్పించిన తరుణంలో కోర్టు వాటిని సంపూర్ణంగా పరిశీలించి ఎక్కడ ఏయే స్థాయిల్లో అవినీతి జరిగిందో స్పష్టతకు వచ్చాక అంతిమ తీర్పు చెబుతుంది. ఈ క్రమంలో ప్రస్తుతానికి సీఐడీ వాదనలతో ఏకీభవించింది కాబట్టి రిమాండ్ కు పంపించింది.
దీంతో... "ఇది పేదల విజయం.. తమను మోసం చేసిన పెత్తందారులను ఓడించేందుకు పేదల పక్షాన సీఎం జగన్ ప్రభుత్వం సాధించిన విజయం" అంటూ జరుగుతున్న సంబరాలు నెట్టింట దర్శనమిస్తున్నాయి. అన్ని రోజుల్లోనూ అందర్నీ మోసం చేయడం కుదరదు.. ఏదో రోజు కాలం ఎదురు తిరిగితే ఎత్తి జైల్లో కుదేస్తుందన్నది గతంలో ఎంతోమంది నేరస్తులకు అనుభవమైందనే మాటలు వినిపిస్తున్నాయి.