బాబు గారి క్వాష్ పిటిషన్... టీడీపీ పంతం ఎందుకంటే...?
సహజంగా ఎవరినైనా కోర్టు రిమాండ్ చేస్తే ఆ వెంటనే పెట్టుకునేది బెయిల్ పిటిషన్. కానీ తెలుగుదేశం పార్టీ మాత్రం క్వాష్ పిటిషన్ అంటోంది.
By: Tupaki Desk | 22 Sep 2023 4:43 PM GMTసహజంగా ఎవరినైనా కోర్టు రిమాండ్ చేస్తే ఆ వెంటనే పెట్టుకునేది బెయిల్ పిటిషన్. కానీ తెలుగుదేశం పార్టీ మాత్రం క్వాష్ పిటిషన్ అంటోంది. అసలు ఏంటి క్వాష్ పిటిషన్. తెలుగుదేశం లీగల్ విభాగం దీని మీదనే ఎందుకు అంత పట్టుదలగా ఉంది. ఎందుకంటే క్వాష్ పిటిషన్ ద్వారా చంద్రబాబు మీద ఏపీసీఐడీ పెట్టిన ఎఫ్ఐ ర్ ని చార్జి షీట్ ని మొత్తానికి మొత్తం కొట్టేయించాలన్నదే తాపత్రయం అంటున్నారు.
అంటే చంద్రబాబు ఏ విధంగానూ తప్పు చేయలేదు, ఆయన్ని అక్రమంగా అరెస్ట్ చేశారు అని తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి వాదిస్తోంది. బాబు అరెస్ట్ అయి రిమాండ్ లో ఉంటూ అపుడే పదిహేను రోజులు గడచిపోయాయి. అయినా సరే బెయిల్ జోలికి వెళ్లకుండా క్వాష్ పిటిషన్ అనే టీడీపీ అంటోంది.
హై కోర్టులో క్వాష్ పిటిషన్ మీద బడా లాయర్లే బాబు పక్షన వాదించారు. బాబుకు ఈ కేసులో ఏ మాత్రం సంబంధం లేదని వారు ఏసీబీ కోర్టులో వాదించిన దాన్నే అక్కడ వాదించారు అని అంటున్నారు. ప్రత్యేకంగా సెక్షన్ 17ఏ మీద కూడా గట్టిగా మాట్లాడుతున్నారు. బాబు అరెస్ట్ అయిన తీరు కూడా సక్రమంగా లేదని అంటున్నారు.
ఎఫ్ఐ ర్ లో బాబు పేరు లేదని, ఆయన మీద ఏ కేసు ఉందో చెప్పకుండా అరెస్ట్ చేశారు అని బాబు లాయర్లు వాదిస్తున్నారు. అయితే దీనికి కౌంటర్ గా సీఐడీ లాయర్ పొన్నవోలు సుధాకరరెడ్డి ధీటైన వాదన వినిపిస్తున్నారు. బాబు ప్రస్తుతం ఎమ్మెల్యే. అందువల్ల ఆయన అరెస్ట్ విషయం స్పీకర్ కి మాత్రమే ముందుగా తెలియచేశామని చెబుతున్నారు. పైగా ఈ కేసు 2014-15లలో జరిగింది, కాబట్టి అప్పటికే సెక్షన్ 17ఏ అన్నది లేదు కాబట్టి వర్తించదు అని కూడా చెబుతున్నారు.
ఇక బాబు మీద ఎఫ్ఐ ర్ లేదు అనడం మీద సీఐడీ వాదన లాజిక్ గా లా ఫుల్ గా ఉంది అంటున్నారు. ఒక కేసులో ఎన్ని చార్షి సీట్లు అయినా వేసి కేసుని విచారణలో భాగంగా పొడిగించవచ్చు. దర్యాపులో తేలే అంశాలు కొత్తవి అయితే అనుబంధ చార్జిషీట్లు ఎన్ని అయినా వేస్తారు అని అంటున్నారు. అలా బాబు కేసులో ఆయన మీద పక్కా ఆధారాలు ఉన్నాయని అందుకే అరెస్ట్ చేశామని చెబుతున్నారు.
అయితే హైకోర్టులో మాత్రం క్వాష్ పిటిషన్ మీద బాబు లాయర్ల వాదనలు నిలవలేదు. ఇక సుప్రీం కోర్టుకు వెళ్లాలని టీడీపీ చూస్తోంది. సోమవారం దేశ అత్యున్నత న్యాయ స్థానం తలుపు తట్టవచ్చు అని తెలుస్తోంది. అక్కడ క్వాష్ పిటిషన్ మీదనే వాదిస్తారు అంటున్నారు. చంద్రబాబు మీద ఎఫ్ఐఆర్ ని కొట్టించాలన్నదే టీడీపీ పంతంగా ఉంది.
అలా చేయడం వల్లనే ఆయనను అక్రమంగా అరెస్ట్ చేశారు అని జనాలకు చెప్పవచ్చు. ఇక ఈ కేసు మూసుకుపోతుంది కాబట్టి కోర్టుల చుట్టూ తిరగాల్సింది లేదు అన్న ఆలోచనతోనే క్వాష్ పిటిషన్ మీద పట్టు పడుతున్నారు అని అంటున్నారు. అయితే క్వాష్ పిటిషన్ అని అనుకున్నా దాన్ని ఏసీబీ కోర్టులోనే వేయాలని, అది కూడా రిమాండ్ దశ కంటే ముందే వేయాలని అంటున్నారు.
ఒకసారి రిమాండ్ కి ఇచ్చి కస్టడీకి కూడా ఇచ్చాక క్వాష్ పిటిషన్ అంటే కుదురుతుందా అని కూడా న్యాయ నిపుణులు అంటున్నారు. మరి చంద్రబాబు కి సుప్రీం కోర్టులో ఊరట దక్కుతుందో లేదో చూడాలి. ఇంకో వైపు చూస్తే క్వాష్ పిటిషన్ అంటూ ఈ వ్యవహారం లో ముందుకు పోవడం ద్వారా బాబుకు బెయిల్ పిటిషన్ కోరేందుకు లేట్ చేస్తున్నారు అంటున్నారు. ఏది ఏమైనా చంద్రబాబు జైలులో రిమాండ్ ఖైదీగా పదహారు రోజులు ఉన్నట్లు అయింది అంటున్నారు.